Begin typing your search above and press return to search.

భారత్-బంగ్లా మధ్యలోని 'చికెన్ నెక్' నిర్బంధం.. కుట్రకోణం..? తీవ్ర ఉద్రిక్తతలు

పశ్చిమ బెంగాల్‌ మరోసారి అశాంతికి వేదికైంది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన ముర్షిదాబాద్ జిల్లా బెల్డంగా ప్రాంతంలో వరుసగా రెండో రోజూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

By:  A.N.Kumar   |   18 Jan 2026 11:30 AM IST
భారత్-బంగ్లా మధ్యలోని చికెన్ నెక్ నిర్బంధం.. కుట్రకోణం..? తీవ్ర ఉద్రిక్తతలు
X

పశ్చిమ బెంగాల్‌ మరోసారి అశాంతికి వేదికైంది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన ముర్షిదాబాద్ జిల్లా బెల్డంగా ప్రాంతంలో వరుసగా రెండో రోజూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వలస కూలీల మరణాలు, దాడుల నేపథ్యంతో మొదలైన ఈ ఆందోళనలు ప్రస్తుతం జాతీయ భద్రతాపరమైన చర్చకు దారితీశాయి.

నిరసనలకు ప్రధాన కారణాలు

జార్ఖండ్‌లో వలస కూలీ అలౌద్దీన్ షేక్ మృతి చెందడం.. దీనికి తోడు బీహార్‌లో మరో కార్మికుడు అనిసూర్ షేక్ పై దాడి జరిగిందన్న వార్తలు దావాగ్నిలా వ్యాపించాయి. ఈ పరిణామాలతో ఆగ్రహించిన స్థానికులు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలకు దిగారు. ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులకు భద్రత కరువైందని ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

స్తంభించిన రాకపోకలు.. ప్రయాణికుల నరకయాతన

నిరసనకారులు తమ ఆగ్రహాన్ని జాతీయ రహదారి-12 పై చూపారు. NH-12ను పూర్తిగా అడ్డుకోవడంతో ఉత్తర - దక్షిణ బెంగాల్ మధ్య రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. రోడ్లే కాకుండా రైల్వే లైన్లను కూడా ఆందోళనకారులు ముట్టడించారు. రైల్వే గేట్లను ధ్వంసం చేయడం, ట్రాక్‌లపై బైఠాయించడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అక్కడ భారీగా బలగాలను మోహరించారు.

‘చికెన్ నెక్’ భద్రతపై ఆందోళనలు

ఈ నిరసనలు కేవలం స్థానిక శాంతిభద్రతల సమస్యగా కాకుండా జాతీయ భద్రతా కోణంలో కలకలం రేపుతున్నాయి. ముర్షిదాబాద్ ప్రాంతం భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ‘చికెన్ నెక్’ సిలిగిరి కారిడార్ కు ముఖద్వారం వంటిది. NH-12పై ఇలాంటి ఆటంకాలు కలిగితే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే నిత్యావసరాలు, రక్షణ దళాల కదలికలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీనిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. రహదారుల దిగ్బంధం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఇది జాతీయ భద్రతకు ముప్పు అని ఆరోపించింది. దేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ప్రధాన మార్గాన్ని స్తంభింపజేయడం సాధారణ విషయం కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది అని స్థానిక నేతల విమర్శలు చేశారు.

అక్రమ చొరబాటుదారుల హస్తం?

ఈ హింసాత్మక ఆందోళనల వెనుక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడిన గుంపులు ఉన్నాయని స్థానికంగా, కొన్ని మీడియా వర్గాల్లో ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు, ఉన్నతాధికారులు మాత్రం దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని కుట్ర కోణాన్ని ఇప్పుడే ధృవీకరించలేమని చెబుతున్నారు.

ప్రస్తుతానికి బెల్డంగా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద నిలిచిపోయి అవస్థలు పడుతున్నారు. వలస కార్మికుల రక్షణ మరియు జాతీయ రహదారుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.