Begin typing your search above and press return to search.

బీజేపీ ఎన్నిక‌ల 'గిఫ్ట్‌': దేశ‌వ్యాప్త దుమారం!

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   13 May 2026 4:00 AM IST
బీజేపీ ఎన్నిక‌ల గిఫ్ట్‌:  దేశ‌వ్యాప్త దుమారం!
X

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ విజ‌యం ప్ర‌జ‌లు ఇచ్చింది కాద‌ని.. ఈవీఎంలు, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన విజ‌యంగా బీజేపీ నాయ‌కుల‌పై మాజీ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు.. మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం మౌనంగా ఉంది.

ఇదిలావుంటే.. తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఒక‌ప్ప‌టి తృణ‌మూల్ కాంగ్రెస్ కీల‌క నాయ‌కుడు.. సువేందు అధికారి.. ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిగా.. మనోజ్ అగర్వాల్‌ను నియ‌మించారు. ఈ నియామ‌క‌మే ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నియామ‌కాన్ని.. ఎన్నిక‌ల గిఫ్ట్‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు స‌హా.. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతున్నారు. దీని వెనుక ఎన్నిక‌ల ప్ర‌భావం ఉంద‌ని ఆరోపిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా మ‌నోజ్ అగ‌ర్వాల్ వ్య‌వ‌హ‌రిం చారు. ఆ స‌మ‌యంలోనే ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని టీఎంసీ పెద్ద ఎత్తున ఆరోపణ లు చేసింది. ఇక‌, కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు ముందు మ‌నోజ్ అగ‌ర్వాల్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు అలా ముగిసి.. కొత్త ప్ర‌భుత్వం ఇలా ఏర్ప‌డ‌గానే అగ‌ర్వాల్‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డంపై తీవ్ర దుమారం రేగింది.

ఈ వ్యవ‌హారంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. వాస్త‌వానికి బెంగాల్ ఎన్నిక‌ల‌పై నిన్న మొన్న‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న రాహుల్ ఇప్పుడు మాత్రం గ‌ళం వినిపించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు రాష్ట్ర స్థాయిలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇది `ఎన్నిక‌ల బ‌హుమానం` అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇక‌, నిబంధ‌న‌ల మేర‌కు.. ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారులుగా ప‌నిచేసిన వారిని.. త‌క్ష‌ణం కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మించ‌డాన్ని సుప్రీంకోర్టు గ‌తంలో త‌ప్పుబ‌ట్టిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం.