Begin typing your search above and press return to search.

బెంగాల్ గవర్నర్ గా రవి...మమత ట్వీట్ వైరల్

పశ్చిమ బెంగాల్ కి తొందరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి.

By:  Satya P   |   6 March 2026 12:15 AM IST
బెంగాల్ గవర్నర్ గా రవి...మమత ట్వీట్ వైరల్
X

పశ్చిమ బెంగాల్ కి తొందరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలిచేందుకు చూస్తోంది. అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని కూడా ప్రయత్నిస్తోంది. ఇక బీజేపీ 2021లోనే దాదాపుగా తమదే అధికారం అన్నంతగా హడావుడి చేసింది. కానీ అది జరగలేదు. అయితే బెంగాల్ రాజకీయాన్ని మమతా వర్సెస్ బీజేపీగా మార్చడంలో పూర్తి సక్సెస్ అయింది. దాంతో మమత యాంటీ ఓటు కానీ తృణమూల్ కాంగ్రెస్ మూడు సార్లు అధికారంలో ఉన్నందున ఏర్పడే యాంటీ ఇంకెంబెన్సీ ఓటు కానీ బీజేపీ వైపే గుత్త మొత్తంగా రాబోతున్నాయి.

గవర్నర్ రాజీనామా :

ఇలా ఢీ అంటే ఢీ కొడుతున్న బెంగాల్ రాజకీయంలో ఒక కుదుపుగా బెంగాల్ గవర్నర్ రాజీనామా చేయడం అన్నది పెద్ద చర్చగా మారింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్ తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. ఆయన బెంగాల్ గవర్నర్ గా 2022 నవంబర్ లో నియమితులు అయ్యారు. అప్పటిదాకా బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధంకర్ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యారు. దాంతో ఆయన ప్లేస్ లో ఆనంద్ బోస్ వచ్చారు. ఆయన పదవీ కాలం ఇంకా 2027 చివరి దాకా ఉంది. అయితే సడెన్ గా ఆయన రాజీనామా చేయడం అయితే అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మమత ట్వీట్ వైరల్ :

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గవర్నర్ ఆనంద్ బోస్ రాజీనామా మీద చేసిన ట్వీట్ అయితే వైరల్ గా మారుతోంది ఆమె ఏకంగా బీజేపీ కేంద్ర పెద్దలనే విమర్శించారు. ఎన్నికల ముందు గవర్నర్ రాజీనామా అంటే ఆయన మీద ఒత్తిళ్ళు పనిచేయకనే అలా చేశారని ఆమె అంటున్నారు ఎన్నికల వేళ బీజేపీ ఈ విధంగా గవర్నర్ సి.వి. ఆకస్మిక రాజీనామా వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె అన్నారు. అంతే కాదు తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని చెప్పారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తనకు తెలియలేదని అన్నారు.

షాకింగ్ న్యూస్ అంటూ :

ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఇదే ట్వీట్ లో మరో విషయం చెప్పారు. కేంద్ర హోం మంత్రి ఇప్పుడే తనకు ఒక విషయం తెలియజేశారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ కి కొత్త గవర్నర్‌గా ఆర్ఎన్ రవిని నియమిస్తున్నట్లుగా చెప్పారని మమత బెనర్జీ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర పెద్దలు ఎప్పుడూ తనను సంప్రదించలేదని ఆమె విమర్శించారు. ఇటువంటి చర్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని అన్నారు. అంతే కాదు భారత సమాఖ్య నిర్మాణం యొక్క పునాదిపైనే దాడి చేస్తాయని అన్నారు. కేంద్రం సహకార సమాఖ్య సూత్రాలను గౌరవించాలని కోరారు. అలాగే ప్రజాస్వామ్య సంప్రదాయాలను రాష్ట్రాల గౌరవాన్ని దెబ్బతీసే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

కొత్త గవర్నర్ గా రవి :

ఇక కొత్త గవర్నర్ గా ఆర్ఎన్ రవిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరి కొద్ది నెలలలో తమిళనాడు గవర్నర్ గా అయిదేళ్ళ పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్న ఆర్ఎన్ రవిని బెంగాల్ గవర్నర్ గా నియమించడం వెనక బీజేపీ పెద్దల ఆలోచనలు ఏమిటి అన్నది కూడా తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఆరా తీసే పనిలో ఉన్నాయి. రవి వర్సెస్ స్టాలిన్ అన్నట్లుగా తమిళనాడులో సాగింది. మరి బెంగాల్ ఎన్నికల వేళ గట్టి వారు గా పేరు తెచ్చుకున్న ఆర్ఎన్ రవిని నియమించడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఈ నియామకం మీద తృణమూల్ కాంగ్రెస్ అయితే విశ్లేషించే పనిలో పడింది అని అంటున్నారు.