Begin typing your search above and press return to search.

పెళ్లికి అప్పు కావాలా నాయనా... ఇదిగో కొత్త ట్రెండ్..!

ఈ సమయంలో పలు కంపెనీలు యాప్ ఆధారిత తక్షణ లోన్లను అందిస్తున్నాయి. పైగా ఇక్కడ లోన్ తీసుకోవడానికి షూరిటీలు, ఆస్తుల తాకట్టులు అవసరం లేదని అంటున్నారు.

By:  Raja Ch   |   16 Dec 2025 5:00 PM IST
పెళ్లికి అప్పు కావాలా నాయనా... ఇదిగో కొత్త ట్రెండ్..!
X

ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు! అంటే.. ఇళ్లు కట్టడం, పెళ్లి చేయడం ఎంతో కష్టమైన విషయాలు అని! అంతే కాదు సుమా.. జీవితంలో అత్యంత విలువైన విషయాలు, చాలా మందికి ఒక్కసారి మాత్రం వచ్చే వేడుకలు కూడా! అయితే ఇప్పుడు పెళ్లి చేసుకునే విషయంలో డబ్బులకు టెన్షన్ పడొద్దు, మేము లోన్స్ ఇస్తాము, వాటిని ఈఎంఐ రూపంలో చెల్లించుకోండి అంటూ ఫిన్ టెక్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి!

అవును... ఈ రోజుల్లో చాలామంది యువతకు వయసుకు పెళ్లి కావడం లేదు! ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని అంటున్నా.. కెరీర్ పై ఫోకస్ తోనో, పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇంట్లో వాళ్లను అడగలేకో, అదీగాక.. పెళ్లిని తన డ్రీమ్స్ కి తగ్గట్లు చేసుకోవడానికి సేవింగ్స్ సరిపోకో.. వాయిదాలు పడుతూనే ఉన్న పరిస్థితి! ఈ సమయంలో.. పెళ్లి సంబంధాలు మీరు చూసికుని, సెట్ చేసుకోండీ.. పెళ్లి ఖర్చు తాము ఇస్తామంటున్నాయి కంపెనీలు!

ఈ సమయంలో పలు కంపెనీలు యాప్ ఆధారిత తక్షణ లోన్లను అందిస్తున్నాయి. పైగా ఇక్కడ లోన్ తీసుకోవడానికి షూరిటీలు, ఆస్తుల తాకట్టులు అవసరం లేదని అంటున్నారు. దీంతో.. చాలామందికి ఇదొక గుడ్ ఆప్షన్ గా మారిందని చెబుతున్నారు. పైగా ఇటీవల చాలా మందికి అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారిన సిబిల్ స్కోర్ సమస్య కూడా ఈ లోన్స్ విషయంలో లేదని చెబుతున్నారు. కాకపోతే కావాల్సినంత తీసుకుని వాయిదాలు కరెక్ట్ గా కట్టేయడమే!

పైగా నేటి యువత చాలా మంది.. ‘లైఫ్ లో ఒక్కసారే కదా’ అంటూ వారి వివాహాన్ని వీలైనంత గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగుల వంటివాటికి ఆకర్షితులవుతున్నారు! అనంతరం హనీమూన్ కార్యక్రమాన్ని కూడా విదేశాల్లో, తమ డ్రీమ్ ప్లేస్ లో జరుపుకోవాలని భావిస్తున్నారు. ఈ సమయంలో ఈ ఆప్షన్ కచ్చితంగా అలాంటి వారికి బెస్ట్ అనే అంటున్నారు!

నాణానికి మరో వైపు!:

వాస్తవానికి ఎంత చెట్టుకు అంత గాలి అని పెద్దలు చెబుతారు. అప్పులు చేసి హెచ్చులకు పోకురా అని అంటారు. పైగా ఈ రోజుల్లో చాలా మంది వందల మందిని పిలిచి, భోజనాలు పెట్టి, తర్వాత వాటిపై వారి నుంచి (బ్యాడ్) ఫీడ్ బ్యాక్ లు వినడం, లైటింగ్ హడావుడిలు చేయడం అవసరమా? అని భావించేవారూ లేకపోలేదు! మనకు ఉన్నంతంలో చేసుకుని, తర్వాత సంసారం చక్కగా సాగేలా చూసుకుంటే చాలని అంటున్నారు.

పైగా... వివాహం అయిన తర్వాత ఊహించని ఖర్చులు ఎన్నో ఉంటాయి కాబట్టి.. వాటికి తోడు పెళ్లి కోసం చేసిన అప్పుకు వాయిదాలు కూడా చెల్లించాల్సి రావడం అంటే.. కచ్చితంగా ఆదాయ, వ్యయాల విషయంలో పూర్తీ స్పష్టత చాలా ముఖ్యమని గుర్తుచేస్తున్నారు! లేదంటే... పెళ్లయ్యాక లైఫ్ బ్యాండ్ మోగించేస్తుందని గుర్తు చేస్తున్నారు.