వాట్సాప్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చిందా..? ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ కావొచ్చు..!
సాంకేతికత పెరిగేకొద్దీ మనిషి జీవనశైలి సులభతరమవుతోంది. ఒకప్పుడు శుభలేఖలు ఇవ్వాలంటే ఇంటింటికీ తిరిగేవారు, కానీ ఇప్పుడు ఒక్క 'క్లిక్'తో వందల మందికి వాట్సాప్ ద్వారా ఆహ్వానాలు పంపేస్తున్నారు.
By: A.N.Kumar | 12 May 2026 4:00 AM ISTసాంకేతికత పెరిగేకొద్దీ మనిషి జీవనశైలి సులభతరమవుతోంది. ఒకప్పుడు శుభలేఖలు ఇవ్వాలంటే ఇంటింటికీ తిరిగేవారు, కానీ ఇప్పుడు ఒక్క 'క్లిక్'తో వందల మందికి వాట్సాప్ ద్వారా ఆహ్వానాలు పంపేస్తున్నారు. అయితే ఇదే సౌకర్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా "వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్" కలకలం సృష్టిస్తోంది. పెళ్లి పత్రిక పేరుతో వచ్చే ప్రమాదకరమైన ఫైళ్లను క్లిక్ చేస్తే క్షణాల్లో మీ జీవితకాల సంపాదన మాయమైపోయే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మోసం ఎలా జరుగుతుందంటే?
సాధారణంగా పెళ్లి పిలుపులు ఫోటో లేదా పీడీఎఫ్ రూపంలో వస్తాయి. కానీ సైబర్ నేరగాళ్లు ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైళ్లను పంపిస్తున్నారు. వీటికి "వెడ్డింగ్ ఇన్విటేషన్’’, "మ్యారేజ్ కార్డ్ ’’ లేదా "శుభలేఖ" వంటి పేర్లు పెట్టి పంపిస్తారు. మనం ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయగానే అది మనకు తెలియకుండానే ఫోన్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌లా ఇన్‌స్టాల్ అవుతుంది. ఒక్కసారి ఆ మాల్వేర్ మీ ఫోన్‌లోకి ప్రవేశించిందంటే మీ ఫోన్ నియంత్రణ మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది.
బెంగళూరు వ్యాపారికి రూ. 5 లక్షల షాక్!
ఇటీవల బెంగళూరుకు చెందిన నహిద్ ఖాన్ అనే వ్యాపారి ఈ తరహా మోసానికే బలయ్యాడు. తనకు తెలిసిన వారి నుంచే సందేశం వచ్చిందని భావించి.. వాట్సాప్‌లో వచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశాడు. ఆ ఫైల్ ఓపెన్ కాకపోవడంతో ఆయన దానిని వదిలేశారు. కానీ, కొద్ది సేపటికే ఆయన ఫోన్ వింతగా ప్రవర్తించడం మొదలైంది. చూస్తుండగానే ఆయన బ్యాంక్ ఖాతా నుండి వరుసగా లావాదేవీలు జరిగి.. ఏకంగా రూ. 5 లక్షలు మాయమయ్యాయి. బ్యాంక్ నుండి మెసేజ్‌లు వచ్చినప్పటికీ.. హ్యాకర్లు ఫోన్‌ను నియంత్రించడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు.
మాల్వేర్ చేసే వినాశనం ఇదే!
సైబర్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఈ ఏపీకే ఫైళ్లలో అత్యంత ప్రమాదకరమైన 'ట్రోజన్' మాల్వేర్ ఉంటుంది. ఇది ఫోన్‌లోకి చేరిన తర్వాత ఫోన్ హ్యాక్ అవుతుంది. మీరు చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్లకు వచ్చే ఓటీపీలను నేరుగా హ్యాకర్లకు పంపిస్తుంది. మీరు ఫోన్‌లో ఏ పాస్‌వర్డ్ టైప్ చేస్తున్నారో హ్యాకర్లు లైవ్‌లో చూడగలరు. మీ గ్యాలరీలోని ఫోటోలు, కాంటాక్ట్స్, ప్రైవేట్ మెసేజ్‌లను సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తుంది. హ్యాకర్లు మీకు తెలియకుండానే మీ ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్‌ను ఆన్ చేసి మిమ్మల్ని నిఘా పెట్టే అవకాశం ఉంది.
మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
సైబర్ దాడుల నుండి సురక్షితంగా ఉండటానికి నిపుణులు సూచనలు చేస్తున్నారు. వాట్సాప్‌లో ఎవరైనా ఏపీకే ఫైళ్లను పంపిస్తే వాటిని పొరపాటున కూడా డౌన్‌లోడ్ చేయకండి. పెళ్లి పత్రికలు ఎప్పుడూ ఏపీకే ఫార్మాట్‌లో ఉండవు. తెలియని నంబర్ల నుండి వచ్చే లింకులను క్లిక్ చేయకండి. ఒకవేళ తెలిసిన వారి నుండి వచ్చినా అది వారే పంపారో లేదో ఫోన్ చేసి నిర్ధారించుకోండి. ఏ రకమైన యాప్‌లనైనా కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి. 'అనౌన్ సోర్సెస్’ నుండి ఇన్‌స్టాలేషన్ ఆప్షన్‌ను ఫోన్ సెట్టింగ్స్‌లో డిసేబుల్ చేయండి. మీ సోషల్ మీడియా, బ్యాంకింగ్ యాప్‌లకు రెండు అంచెల భద్రతను ఏర్పాటు చేసుకోండి. మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను.. సెక్యూరిటీ ప్యాచెస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.
"డిజిటల్ విప్లవం మనకు సౌకర్యాలను తెచ్చింది, అదే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే ముప్పులను కూడా తెస్తుంది. ఒక్క క్షణం ఆలోచించకుండా చేసే 'క్లిక్' మీ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయగలదు " అని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు ఇలాంటి మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. అప్రమత్తతే అజేయమైన రక్షణ!
