Begin typing your search above and press return to search.

రీల్స్ చూడడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా?

రీల్స్ చూడటం వల్ల ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం.

By:  Madhu Reddy   |   2 Sept 2026 10:44 AM IST
రీల్స్ చూడడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా?
X

ఈ రోజుల్లోచిన్న పెద్ద తేడా లేకుండా ఖాళీ సమయం దొరికితే చాలు ఫోన్ పట్టుకుని రీల్స్, షార్ట్స్ చూస్తూ గడిపేయడం అందరికీ అలవాటుగా మారింది. కానీ అలా నిరంతరం షార్ట్ వీడియోలు చూడటం వల్ల మన మెదడు పనితీరు క్షీణిస్తుందని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, టీనేజర్లు దీనికి బానిసలుగా మారితే ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు తీవ్రమైన మానసిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. రీల్స్ చూడటం వల్ల ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతుంది;

ఫోన్‌లో నిమిష వ్యవధి ఉండే రీల్స్, షార్ట్స్ నిరంతరం చూడటం వల్ల మెదడు ఒకే విషయంపై ఎక్కువ సేపు దృష్టి పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గిపోవడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుంది. ఇక చదువుకునే పిల్లలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆందోళన, నిద్రలేమి సమస్యలు:

అపరిమితంగా సోషల్ మీడియా వాడటం వల్ల మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. నిరంతరం వీడియోలు మార్చుతూ చూడటం వల్ల నిద్ర పట్టక నిద్రలేమి సమస్యలు చుట్టుముడతాయి. ఫలితంగా తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇక మెదడు ఎప్పుడూ విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అలసటకు గురవుతుంది.

పిల్లలు, టీనేజర్లలో ఎక్కువ ముప్పు:

ఈ షార్ట్ వీడియోల ప్రభావం పెద్దల కంటే చిన్న పిల్లలు, టీనేజర్లపైనే అత్యధికంగా ఉంటోంది. వారి మెదడు ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఇలాంటి డిజిటల్ వ్యసనాలకు గురైతే వారి ఆలోచనా శక్తి దెబ్బతింటుంది. నిజ జీవితంలోని బంధాలకు దూరమై, డిజిటల్ ప్రపంచానికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఫోన్ వాడకంపై నిఘా పెట్టడం చాలా అవసరం.

సోషల్ మీడియా వాడకానికి బ్రేక్ ఇవ్వండి:

ఈ డిజిటల్ ప్రమాదం నుంచి బయటపడటానికి సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడమే ఏకైక మార్గం. రోజులో ఫోన్ వాడే సమయానికి ఒక హద్దు పెట్టుకోవాలి. షార్ట్ వీడియోలకు బదులుగా మంచి పుస్తకాలు చదవడం, అవుట్‌డోర్ గేమ్స్ ఆడటం లేదా వ్యాయామం చేయడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇవి మెదడును చురుగ్గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.

కాలక్షేపం కోసం చూసే రీల్స్ మన ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును దెబ్బతీస్తున్నాయని గ్రహించాలి. ముఖ్యంగా పిల్లలను ఈ రీల్స్ సంస్కృతికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సాంకేతికతను అవసరం మేరకే ఉపయోగిస్తూ, శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తేనే ఈ సోషల్ మీడియా ముప్పు నుంచి మనం సురక్షితంగా బయటపడగలం అంటున్నారు నిపుణులు..