Begin typing your search above and press return to search.

14 ల‌క్ష‌ల కోట్ల ఆస్తిలో 99శాతం స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కే రాసిచ్చాడు!

ఇతర బిలియనీర్లు విలాసవంతమైన భవనాలు, ప్రైవేట్ ఎస్టేట్లను కొనుగోలు చేస్తుంటే బఫెట్ మాత్రం తాను 1958లో కేవలం 31,500 డాల‌ర్ల‌కు కొనుగోలు చేసిన ఒమాహా ఇంటిలోనే దశాబ్దాలుగా నివసిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   19 Sept 2026 8:31 AM IST
14 ల‌క్ష‌ల కోట్ల ఆస్తిలో 99శాతం స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కే రాసిచ్చాడు!
X

ప్రపంచ కుబేరులలో ఒకరైన, బెర్క్‌షేర్ హాత్వే అధినేత వారెన్ బఫెట్ తన భారీ సంపదకు, అత్యంత సాధారణ జీవనశైలికి మధ్య ఉండే వ్యత్యాసంతో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటారు. ఆయన నికర ఆస్తి విలువ సుమారు 146.6 బిలియన్ డాలర్లు(14ల‌క్ష‌ల కోట్లు)గా ఉన్నా.. ఆడంబరాలకు దూరంగా నిరాడంబర జీవితాన్ని గడపడమే ఆయన ప్రత్యేకత. ఈ విశేషాలతో కూడిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బఫెట్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంటూ 96 ఏళ్ల వయసులో బెర్క్‌షేర్ హాత్వే ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు హోవార్డ్ బఫెట్ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా గతేడాదే గ్రెగ్ అబెల్ సీఈఓగా పగ్గాలు చేపట్టారు. దశాబ్దాలుగా సంస్థను విజయవంతంగా నడిపించిన బఫెట్ తాను సాధించిన అపారమైన సంపదకు, తన నివాస స్థానాలకు ఎక్కడా పొంతన లేని విధంగా జీవించడం విశేషం.

ఇతర బిలియనీర్లు విలాసవంతమైన భవనాలు, ప్రైవేట్ ఎస్టేట్లను కొనుగోలు చేస్తుంటే బఫెట్ మాత్రం తాను 1958లో కేవలం 31,500 డాల‌ర్ల‌కు కొనుగోలు చేసిన ఒమాహా ఇంటిలోనే దశాబ్దాలుగా నివసిస్తున్నారు. నేడు ఆ ఇంటి విలువ సుమారు 1.4 మిలియన్ డాలర్లకు చేరినా ఆయన ఇల్లు మార్చకుండా అదే సాధారణ ఇంట్లో గడపడం ఆయన వ్యక్తిగత విలువలకు నిదర్శనం. దీన్ని ఆయన తన జీవితంలో అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటిగా అభివర్ణించారు.

ఒమాహా ఇంటితో పాటు గతంలో ఆయనకు కొన్ని ఇతర ఆస్తులు కూడా ఉండేవి. 1971లో కాలిఫోర్నియాలోని లాగునా బీచ్‌లో ఓ సముద్ర తీర హాలిడే హోమ్‌ను 150,000 డాల‌ర్లు పెట్టి కొనుగోలు చేసిన ఆయన.. తన సతీమణి సునామ్ మరణం తర్వాత 2018లో దానిని దాదాపు 7.47 మిలియన్ డాల‌ర్ల‌కు విక్రయించారు. అలాగే 1986లో 400 ఎకరాల నెబ్రాస్కా వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి.. దానిని తన కుమారుడి సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

తన సంపదలో 99 శాతానికి పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా ఇవ్వాలని బఫెట్ ఎప్పుడో ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల తన పిల్లల ఫౌండేషన్లకు బిలియన్ల కొద్దీ విలువైన షేర్లను విరాళంగా అందజేశారు. పిల్లలకు వారి కాళ్లపై వారు నిలబడేంత ఇస్తే చాలని నమ్మే ఆయన... భారీ ఆస్తులను వారసత్వంగా ఇవ్వడానికి బదులుగా సమాజహితం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.