వరంగల్ కాంగ్రెస్ రగడ కంటిన్యూ.. కొండా Vs డీసీసీ లీడర్లు
ఇక మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ విభేదాలు మరోమారు బట్టబయలు అయ్యాయి.
By: Tupaki Political Desk | 9 Dec 2025 6:22 PM ISTతెలంగాణలోని వరంగల్ కాంగ్రెస్ లీడర్లు తగ్గేదేలే అన్నట్లు రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖతో విభేదిస్తున్న నేతలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంత్రి కొండా దంపతులే తమ దారికి రావాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు మంత్రి కొండా వర్గం కూడా అసలు తగ్గడం లేదు. జిల్లా కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగానే తమ రాజకీయం నడిపిస్తోంది. చాలా కాలంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో రచ్చ కొనసాగుతోంది. మంత్రి కొండా సురేఖ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీ వేరువర్గంగానే నడుచుకుంటున్నారు. ఇక మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ విభేదాలు మరోమారు బట్టబయలు అయ్యాయి.
మంగళవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో వేడుకలు చేశారు. అయితే వరంగల్ కాంగ్రెస్ లో మాత్రం రెండు వర్గాలుగా విడిపోవడమే చర్చకు దారితీసింది. మంత్రి కొండా సురేఖ వర్గీయులు ఒకచోట.. డీసీసీ ఆధ్వర్యంలో మరోచోట సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. డీసీసీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకుల జిల్లా కాంగ్రెస్ ప్రముఖులు అంతా హాజరుకావడం చర్చకు తావిచ్చింది. జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్గం ఒంటిరి అవుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. జిల్లా మంత్రిగా ఎమ్మెల్యేలు, పార్టీని నడిపించాల్సిన సురేఖ.. తొలి నుంచి వివాదాస్పద వైఖరితో అందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ప్రచారం ఉంది. సురేఖ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సురేఖ తీరుపై పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ అయినట్లు కథనాలు వచ్చాయి. అన్నివైపుల నుంచి మంత్రిపై విమర్శలు రావడంతో తన వైఖరి మార్చుకుంటానని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్టావర్గానికి తెలియజేసినట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న వరంగల్ కాంగ్రెస్ రాజకీయం సోనియా జన్మదినం సందర్భంగా మారోమారు రాజుకుంది. వరంగల్ కాంగ్రెస్ లో ఐక్యత ఒట్టిమాటే అన్నట్లు తేలిపోయిందని అంటున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ కూడలిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. దీనికి కొత్తగా డీసీసీ అధ్యక్షుడైన ఆయుబ్ నాయకత్వం వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతోపాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు అంతా డీసీసీ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే మంత్రి కొండా వర్గం నుంచి ఏ ఒక్కరూ హాజరుకాకపోవడంతో కార్యకర్తలు మంత్రి తీరును తప్పుబడుతున్నారు.
ఇక రైల్వేస్టేషన్ ఆవరణలో మంత్రి కొండా వర్గం ఆధ్వర్యంలో సోనియా పుట్టినరోజు వేడుకలను నిరవహించారు. కేక్ కట్ చేయడంతోపాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీ నుంచి ఏ ఒక్కరిని ఆహ్వానించలేదని అంటున్నారు. జిల్లా మంత్రిగా ఉంటూ ఏ ఒక్కరినీ కలుపుకుని వెళ్లకపోవడంపై కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్ ఫొటో, పేరు లేకుండా పోస్టర్లు ముద్రించడాన్ని పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడికి గౌరవం ఇవ్వకపోవడం కరెక్టుకాదని అంటున్నారు. అదేసమయంలో డీసీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొండా వర్గం నుంచి ఏ ఒక్కరు రాకపోయినా మంత్రి సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ మురళి ఫొటోలను ముద్రించిన విషయాన్ని ఎత్తిచూపుతున్నారు.
