రెండో ప్రపంచయుద్ధం...పిట్టల్లా రాలిన ప్రపంచ దేశ జనాలు
మహాకవి శ్రీశ్రీ కవితాక్షరాలు అక్షర సత్యాలు. యుద్ధం...రెండక్షరాల ఈ పదం వెనక రాజ్యకాంక్ష, రక్తపాతం, మానవాళి వినాశం అణుబాంబులా నిక్షిప్తమై ఉంది.
By: Tupaki Political Desk | 8 Jan 2026 3:00 PM ISTఏ దేశచరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి సమస్తం
పరపీడనా పరాయణత్వం
గతమంతా తడిసే రక్తంతో
కాకపోతే కన్నీళ్ళతో ...
మహాకవి శ్రీశ్రీ కవితాక్షరాలు అక్షర సత్యాలు. యుద్ధం...రెండక్షరాల ఈ పదం వెనక రాజ్యకాంక్ష, రక్తపాతం, మానవాళి వినాశం అణుబాంబులా నిక్షిప్తమై ఉంది. యుద్ధ ఘటనలు, చరిత్ర వినడానికి బాగుంటుంది...కానీ యుద్ధం వల్ల రక్తపాతం తప్పదు...మారణకాండ తప్పదు. అందుకే ప్రముఖ కవి దాశరథి గారు ఒక రాజును గెలిపించుటకు తెగిపడిన నరకంఠాలెన్నో అని చాలా ఆవేదనతో ఆక్రోశించారు. ప్రపంచ చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం అత్యంత పాశవికంగా రాక్షసంగా సాగింది. ప్రపంచ పటంలో దాదాపు అన్ని దేశాలు రక్తపాతంతో తడిసి ముద్దయ్యాయి. క్రూర నియంత అడాల్ఫ్ హిట్లర్ ...లీబెన్స్' (జీవన ప్రదేశం) పేరుతో ప్రదర్శించిన జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష దుష్ఫలితమే రెండో ప్రపంచయుద్దమని చరిత్ర చెబుతోంది. ఈ యుద్దంలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తమ్మీద 40,000,000–50,000,000 మంది దుర్మరణాల పాలయ్యారు. ఈ యుద్ధం చరిత్రలో అత్యంత రక్తపాత సంఘర్షణగా, అతిపెద్ద యుద్ధంగా మిగిలిపోయింది.
రెండో ప్రపంచయుద్దం అక్ష రాజ్యాలైన జర్మనీ, ఇటలీ మరియు జపాన్...మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, అమెరికా, చైనాల మధ్య జరిగింది. ఈ యుద్దం 1939 నుంచి 1945 దాకా అంటే దాదాపు ఏడేళ్ళపాటు సాగింది. చివరికి 1945లో హిట్లర్ ఆత్మహత్య... జపాన్ నగరాలపై అణుబాంబు దాడులతో ఈ యుద్ధం ముగిసింది. అసలు రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి ప్రధాన కారణాలలో వెర్సెల్లైస్ ఒప్పందం ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక 1919లో జర్మనీపై అత్యంత కఠినమైన నిబంధనలతో ఈ ఒప్పందాన్ని విధించారు. ఈ సంధి ద్వారా భారీ నష్టపరిహారాలు, సైనిక పరిమితులు విధించారు. ఫలితంగా జర్మనీ తన భూభాగాన్ని కోల్పోవడమే కాకుండా అంతకు అంత జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. ఈ పరిణామం జర్మన్లలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించడమే కాకుండా ప్రతీకారేచ్చను ఎగదోసింది. జర్మనీలో ఆర్థిక సంక్షోభం ఆసరాగా అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. అతను వెర్సైల్లెస్ ఒప్పందాన్ని ధిక్కరించి, జర్మనీ సైనిక శక్తిని పెంచి, ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించడం ప్రారంభించాడు.
ఇంత పెద్ద యుద్దం విచక్షణరహితంగా కొనసాగుతున్నా... నివారించడంలో, పరిస్థితిని చక్కదిద్దడంలో నానాజాతి సమితి ఘోరంగా విఫలమైంది. ప్రపంచంలో దేశాల మధ్య తలెత్తే గొడవల్ని ఆపడానికే ఈ నానాజాతి సమితి ఏర్పడింది. అయితే ఈ సమిత తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించలేక పోయింది. జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాల దూకుడుకు అడ్డుకట్ట వేయలేక పోయింది. అలాగే జాపాన్ ఆసియాలో తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు చైనా పై దాడి చేసింది. ఇటలీ ముస్సోలినీ నాయకత్వంలో ఇతర ప్రాంతాల దురాక్రమణకు తెగబడింది. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్ పై దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ఆధికారికంగా ప్రారంభమైంది. జర్మనీ చర్యకు నిరసనగా బ్రిటన్ , ప్రాన్స్ దేశాలు జర్మనీ పై యుద్దాన్ని ప్రకటించాయి. ఈ యుద్దం వల్ల 1930 లలో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, పేదరికం తీవ్రవాద భావజాలాలకు ప్రాణం పోశాయి. ఈ యుద్ధ పలితమే మధ్యతరగతి వర్గం ఒకటి సమాజంలో అంకురించింది.
రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు లక్షల్లో, కోట్లల్లో మరణించారు. దాదాసు 25 దేశాలపై ప్రత్యక్ష ప్రభావం కనిపించింది. సోవియట్ యూనియన్ లో 25,285,000 మందికి పైగా బలి అయ్యారు. జర్మనీలో 8,800,000 మంది మరణించారు. చైనాలో 7,850,000 మంది, పోలాండ్ లో 5,800,000 మంది, జపాన్ లో 3,100,000 మంది మరణించారు. బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న ఇండియాలో 2,500,000 మంది విగతజీవులయ్యారు. ఇలా దాదాపు 25 దేశాల్లో కోట్లాది మంది ఈ రెండో ప్రపంచయుద్దంలో మరణించారు.
యుద్దం వల్ల మరణం పుష్పిస్తుందేమో కానీ జీవితం వికసించదు...అని సినారే అన్నా...శ్మశానాన వికసిస్తుంది వీరు నాటిన పూలచెట్టు...ఎవరు తుడుస్తారు నా తుది కన్నీటి బొట్టు అని ప్రఖ్యాత కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆవేదన వ్యక్తం చేసినా...యుద్ధం అనర్థమనే...మానవాళికి ముప్పు అనే. రెండో ప్రపంచయుద్ధమే కాదు...ఆ తర్వాత జరిగిన యుద్ధాలు...ఇపుడు జరుగుతున్న యుద్దాలు చెబుతున్న రక్తసిక్త సత్యమిదే.
