Begin typing your search above and press return to search.

యుద్ధంపై బెట్టింగ్: మృత్యువుపై పందాలు.. కోట్లు గెలుచుకున్న 'ఇన్సైడర్' రాయుళ్లు!

యుద్ధం అంటే ఒక దేశానికి విధ్వంసం, సామాన్యుడికి శోకం. కానీ, కొందరికి మాత్రం అది అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక జూదంగా మారిపోయింది.

By:  Tupaki Political Desk   |   5 March 2026 3:17 PM IST
యుద్ధంపై బెట్టింగ్: మృత్యువుపై పందాలు.. కోట్లు గెలుచుకున్న ఇన్సైడర్ రాయుళ్లు!
X

యుద్ధం అంటే ఒక దేశానికి విధ్వంసం, సామాన్యుడికి శోకం. కానీ, కొందరికి మాత్రం అది అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక జూదంగా మారిపోయింది. అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో ముందే ఊహించి, వేల డాలర్లను లక్షల్లోకి మార్చుకున్న కొందరు బెట్టింగ్ రాయుళ్ల కథ ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. 'పాలీమార్కెట్' అనే క్రిప్టో ఆధారిత ప్రిడిక్షన్ మార్కెట్‌లో జరిగిన ఈ వింత పోకడ చూస్తుంటే, మానవత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతోంది.

ఒక్క రోజులో రూ. 4 కోట్ల లాభం..!

గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా దాడులు చేయబోతోందని సరిగ్గా అంచనా వేసిన కొందరు వ్యక్తులు ఈ ప్లాట్‌ఫామ్‌లో భారీగా బెట్లు వేశారు. పాలీమార్కెట్ నివేదికల ప్రకారం, సుమారు 529 మిలియన్ డాలర్ల (వేల కోట్లు) వ్యాపారం ఈ ఒక్క అంశంపైనే జరిగింది. ఇందులో 16 మంది యూజర్లు లక్ష డాలర్ల పైనే లాభం పొందగా, ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 5 లక్షల డాలర్లు (సుమారు రూ. 4 కోట్లు) సంపాదించాడు. 'Magamyman' అనే పేరున్న ఒక యూజర్, అమెరికా దాడులు చేయడమే కాకుండా, ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణంపై కూడా బెట్టింగ్ కాసి రూ. 4.5 కోట్లకు పైగా గెలుచుకోవడం గమనార్హం.

ఇది అంచనా నా? లేక ఇన్ స్పైడర్ సమాచారమా?

ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. యుద్ధం ఎప్పుడు జరుగుతుందో వీరికి అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? దాడులు జరగడానికి కేవలం కొన్ని గంటల ముందు కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసి, లక్షల రూపాయలు పందెంగా కాయడం చూస్తుంటే ఇది కేవలం అంచనా కాదని, లోపల ఉన్న సమాచారం ముందే లీక్ అయిందని నిపుణులు అనుమానిస్తున్నారు. అగ్రరాజ్యాల యుద్ధ వ్యూహాలు ఇలా బెట్టింగ్ రాయుళ్లకు ఎలా తెలుస్తున్నాయి? అనే దానిపై అమెరికాలో సెనేటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘యుద్ధం, మృత్యువుపై లాభాలు సంపాదించడం నీచమైన చర్య’ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాలీమార్కెట్ వాదన ఏంటి?

ఇన్ని విమర్శలు వస్తున్నా, ఆ సంస్థ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ‘ప్రపంచంలో ఏం జరగబోతోందో ముందుగానే చెప్పడానికి ఈ ప్రిడిక్షన్ మార్కెట్లు ఒక నిష్పాక్షికమైన వేదికలుగా పనిచేస్తాయి. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా చెప్పలేని నిజాలను మా ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు’ అని పాలీమార్కెట్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, ప్రాణాలతో ముడిపడి ఉన్న యుద్ధం వంటి అంశాలను కూడా జూదంగా మార్చడంపై సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

క్రిప్టో ప్రపంచంలో కొత్త రకం 'వార్ మాఫియా'

ఇప్పటి వరకు క్రికెట్, ఎన్నికల మీద బెట్టింగ్‌లు చూశాం. కానీ, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ పుణ్యమా అని యుద్ధాల మీద కూడా పందాలు కాయడం మొదలైంది. ఇది ఒక రకమైన 'డిజిటల్ వార్ ప్రాఫిటీరింగ్' (యుద్ధ లాభార్జన) అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల యుద్ధాలను ఆపడం కంటే, వాటిని ప్రోత్సహించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

టెక్నాలజీ అనేది సమాజానికి ఉపయోగపడాలి కానీ, ఇలాంటి వికృత చేష్టలకు వేదిక కాకూడదు. బాంబుల మోత వినిపించకముందే కొందరు జేబులు నింపుకుంటున్నారంటే, యుద్ధం వెనుక ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దేశం స్మశానంగా మారుతుంటే, దాన్ని చూసి డబ్బులు సంపాదించడం అనేది నాగరిక సమాజానికి సిగ్గుచేటు. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.