విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వీఆర్ఎస్ ఎంతమందికి...?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మనుగడపై నీలినీడలు ముసురుతున్న తరుణంలో యాజమాన్యం మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ ( వీఆర్ఎస్ ) పథకాన్ని ప్రకటించడం కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది.
By: Garuda Media | 22 Jan 2026 10:00 AM ISTవిశాఖపట్నం ఉక్కు కర్మాగారం మనుగడపై నీలినీడలు ముసురుతున్న తరుణంలో యాజమాన్యం మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ ( వీఆర్ఎస్ ) పథకాన్ని ప్రకటించడం కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. గత ఏడాది కాలంలో ఇప్పటికే రెండు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేసిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తాజాగా మూడో విడతకు రంగం సిద్ధం చేసింది. ఈ విడతలో సుమారు 600 మంది ఉద్యోగులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే సుమారు 350 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ ద్వారా పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించి సంస్థపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. అయితే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడంలో భాగంగానే ఇలాంటి చర్యలు చేపడుతున్నారని కార్మిక సంఘాలు బలంగా విమర్శిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ఆదుకోవడానికి సుమారు 11,440 కోట్ల రూపాయలతో పునరుజ్జీవ ప్యాకేజీ ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ముడి సరకు కొరత, నిధుల లేమి కారణంగా ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదని, దసరా వంటి పండుగలకు కూడా బోనస్ కూడా ఇవ్వలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లడం వల్లే యువ అధికారులు సైతం ఈ సంస్థను వీడి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 45 ఏళ్ల వయసు పైబడిన వారు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించగా చాలా మంది అనివార్య పరిస్థితుల్లో దీని వైపు వెళ్తున్నారు.
ఉక్కు కర్మాగారంలోని సుమారు 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లు పిలిచినట్లు తెలుస్తోంది. ముడి పదార్థాల నిర్వహణ ప్లాంట్ లాంటి కీలక విభాగాలను కూడా ఈ జాబితాలో చేర్చడం చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్లాంటును ప్రైవేటీకరించమని కేంద్ర మంత్రులు భరోసా ఇస్తున్నా మరోవైపు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గందరగోళానికి దారితీస్తోంది. సంస్థలో ప్రస్తుతం ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్యను 8 వేల లోపునకు తీసుకురావాలని యాజమాన్యం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులను భారీగా తొలగించడం వల్ల వివిధ విభాగాల్లో నిర్వహణ లోపాలు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
తెలుగు ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఈ కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు నిరంతర పోరాటం చేస్తున్నాయి. సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా ప్లాంటును నష్టాల నుండి గట్టెక్కించవచ్చని కొందరు ప్రతిపాదిస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన అడుగులు పడలేదు. స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో నైపుణ్యం ఉన్న మానవ వనరులను వదులుకోవడం వల్ల దీర్ఘకాలంలో కర్మాగారం ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి నిధులు విడుదల చేసి ప్లాంటును కాపాడాలని అంతా కోరుతున్నారు.
