Begin typing your search above and press return to search.

60 లక్షలు మైనస్ 90 లక్షలు! బెంగాల్ పై బీజేపీ మాస్టర్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ మాస్టర్ ప్లాన్ రచించిందని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   24 April 2026 11:01 PM IST
60 లక్షలు మైనస్ 90 లక్షలు! బెంగాల్ పై బీజేపీ మాస్టర్ ప్లాన్?
X

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ మాస్టర్ ప్లాన్ రచించిందని ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న కమలనాథులు పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. తమ కంట్లో నలుసులా మారడమే కాకుండా ఢిల్లీ అధికారాన్ని సవాల్ చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి రుచిచూపించాలనే ఆలోచనతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయం వ్యూహారచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించిన బీజేపీ, సీట్ల సాధనలో బోల్తా పడింది. ఇప్పుడు ఆ లెక్క సరిచేసేలా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వాడుకుందని అంటున్నారు.

దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. దేశ తూర్పు ప్రాంతంలో బలంగా ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ గద్దెను అందుకోలేకపోవడంపై బీజేపీ తీవ్రంగా ఆలోచిస్తోందని చెబుతున్నారు. సుమారు 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీజేపీని తయారు చేసినా, పదేళ్లుగా మెజార్టీ సాధించలేకపోవడంపై కమలనాథులు తర్జనభర్జనకు గురయ్యారని అంటున్నారు. దీంతోనే బెంగాల్ లెక్క సరిచేసేందుకు రెండేళ్ల ముందు నుంచే పక్కా వ్యూహం రెడీ చేశారని అంటున్నారు.

2024 పార్లమెంటు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ ముందుగా బెంగాల్ పీఠం అందుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగిందని, ఆ సమయంలో దాదాపు 60 లక్షల ఓట్లు వెనకబడిపోవడంతో ఓడిపోయామని కమలనాథులు అంచనా వేసుకున్నారు. దీంతో తృణమూల్ తో ఈ అంతరం తొలగించుకునేందుకు రకరకాల మార్గాలు అన్వేషించిన బీజేపీ సర్ ప్రక్రియను సమర్థంగా వినియోగించుకుందని అంటున్నారు. సర్ లో దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించడంతో తమ లెక్క సరిపోయే పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారని అంటున్నారు. భారీగా డూప్లికేట్, నకిలీ ఓట్లు తొలగించడంతో ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని ఆశాభావం పెట్టుకున్నారని చెబుతున్నారు.

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 215 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 77 చోట్ల గెలిచింది. ఇక ఆ ఎన్నికల్లో తృణమూల్ కి 48 శాతం ఓట్లు పోలయ్యాయి. దాదాపు 2.89 కోట్ల ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2.29 కోట్ల ఓట్లు, 38.15 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఇరుపార్టీల మధ్య సుమారు 60 లక్షల ఓట్లు అంతరం ఉంది. ఇక 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో తృణమూల్ గెలవగా, బీజేపీ కూడా బలంగా ఎదిగింది. ఇదే సమయంలో రెండు పార్టీల మధ్య అంతరం 45 లక్షలకు తగ్గింది. దీంతో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లెక్క పూర్తిగా మార్చాలని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల మధ్య పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల సవరణ ప్రక్రియలో తొలగించిన ఓట్లు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 90 లక్షల ఓట్లను తొలగించడంతో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ప్రధానంగా ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో అత్యధికంగా ఓట్లు తొలగించటం ఈ ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను తృణమూల్ గెలుచుకుంది. సరిహద్దు జిల్లాలు కావడం, 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు మైనార్టీలవే ఉండటంతో ఈ జిల్లాల్లో ఓటరు తీర్పు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓట్ల తొలగింపు, బీజేపీ వ్యూహాత్మక చర్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.