Begin typing your search above and press return to search.

వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు..ఈసీ కీలక డెసిషన్

దీని పకారం ఈ 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు అలాగే దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.

By:  Satya P   |   20 March 2026 6:00 AM IST
వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు..ఈసీ కీలక డెసిషన్
X

ఇంటి నుంచే ఓటు హక్కుని ఉపయోగించుకునే సదుపాయం పోలింగ్ కంటే కొద్ది రోజులు ముందు పోస్టల్ ద్వారా తమ ఓటుని వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ మోస్ట్ ఓటర్లకు కల్పించింది. దేశంలో ప్రస్తుతం అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికలులో ఈసీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని పకారం ఈ 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు అలాగే దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.

పోస్టల్ ఓటు కోసం :

ఇక వీరంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు చేయాలనుకుంటే చేయాల్సిన విధి విధానాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రాష్ట్రాలలో ఎన్నికల ప్రకటన వెలువడిన ఐదు రోజులలోగా అర్హులైన ఓటర్లు తమ బూత్ స్థాయి అధికారి సహాయంతో ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ప్రక్రియలో సౌలభ్యంతో పాటుగా గోప్యత ఉంటాయని ఈసీ స్పష్టం చేస్తోంది. ఇలా ఈ రెండింటినీ నిర్ధారిస్తూ పోలింగ్ బృందాలు వారి నివాసాలకు వెళ్లి ఓట్లను సేకరిస్తాయని తెలియచేస్తోంది.

వీరికి సైతం ఓటు :

అంతే కాకుండా ఆరోగ్యం, అగ్నిమాపక, విద్యుత్, రవాణా, విమానయానం వంటి అత్యవసర సేవలలో నిమగ్నమైన ఓటర్లు కూడా నియమిత నోడల్ అధికారుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని పొందవచ్చని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. పోలింగ్ రోజు కవరేజీకి అధికారం పొందిన మీడియా సిబ్బందిని కూడా పోస్టల్ ఓటుని పొందే జాబితాలో ఈసారి చేర్చారు. దాంతో వారు సైతం ఎన్నికల విధులలో ఉంటూనే కఠినమైన గోప్యతా మార్గదర్శకాల మధ్య ఫెసిలిటేషన్ కేంద్రాలలో తమ ఓట్లను వేస్తారని ఈసీ స్పష్టం చేసింది. అయితే సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా తమ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్‌గా అందుకుంటారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.