Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్ తో వేలాది ఓట్లు అవుట్... ప్రొసీజర్ అదే !

ఒక్క దెబ్బతో వేలాది ఓట్లు తీసి పక్కన పెట్టేయవచ్చా. దాని కోసం సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి ఓట్లను అన్నింటినీ లేపేయవచ్చా.

By:  Satya P   |   19 Sept 2025 9:33 AM IST
సాఫ్ట్ వేర్ తో వేలాది ఓట్లు అవుట్... ప్రొసీజర్ అదే !
X

ఒక్క దెబ్బతో వేలాది ఓట్లు తీసి పక్కన పెట్టేయవచ్చా. దాని కోసం సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి ఓట్లను అన్నింటినీ లేపేయవచ్చా. ఇది సామాన్యుడు సగటు ఓటర్లలో కూడా కలిగే సందేహం. మా ఓట్లు లేవు అని పోలింగ్ వేళ బూత్ ల వద్ద మీడియాకు చెబుతూ ఆవేదన చెందే వారిని చూస్తాం, ఆ మీదట వారు మళ్ళీ కనిపించరు. ఆ విషయంలో పట్టుదల కూడా చూపించరు. అయితే తమ ఓట్లు పోయాయని ఎందుకో అలా జరిగిందని మనసులో మాత్రం పెట్టుకుంటారు. ఈ విషయంలో అధికారుల మీద అనుమానాలు వ్యక్తం చేసేవారూ ఉంటారు. అచ్చం అలాంటి డౌట్లనే జనంలోకి పంపిస్తూ అవి సందేహాలు కావు పచ్చి నిజాలు అంటున్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. దేశంలో పలు కీలక రాష్ట్రాలలో ఓట్ల గల్లంతు జరుగుతోందని తమకు గిట్టని వారి ఓట్లు తొలగిస్తున్నారు అని ఆయన ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఆ ఆరోపణలు తప్పు :

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పు అని కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగానే ఖండిస్తోంది. ఓట్లను సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ లో తొలగించడం అన్నది అసాధ్యమని కూడా ఎబుతోంది. అసలు ఏ ఒక్కరూ కూడా మరొకరి ఓటుని తొలగించలేరు అని కూడా స్పష్టంగా చెబుతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలు నిరాధారమైనవి అని కూడా ఈసీ చెబుతోంది.

నిబంధనలు ఏమి చెబుతున్నాయి :

ఒక వ్యక్తి తన ఓటు పోయింది అని చెబితే ఆ బాధితుడికి కూడా తన వాదన విడిపించుకునేందుకు అవకాశం ఈసీ కల్పిస్తోంది. ఆయన క్లెయిం చేసుకున్న దానిని బట్టి ఓటు తిరిగి పొందే చాన్స్ ఉంటుందని చెబుతోంది. అసలు ఓటు తొలగించాలని అనుకుంటే సదరు ఓటరుకు ముందుగా సమాచారం ఇస్తారు, ఆ వ్యక్తి నుంచి ప్రమేయం లేకుండా ఓటు తీసేయడం అన్నది జరిగే పని కాదు అని నిబంధనలు చెబుతున్నాయి.

ప్రక్రియ ఇలాగే :

ఇక ఒక వ్యక్తి పేరుని జాబితా నుంచి తొలగించాలని అన్నా లేక ఆ నియోజకవర్గంలో తన పేరుని తీసేయాలని కోరినా దానికి కూడా ఒక పెద్ద కసరత్తు ఉంటుంది. ఫారం 7 ప్రకారం ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అందులోనే తన పేరు నియోజకవర్గం, ఎపిక్ నంబర్ తో పాటు తొలగింపునకు కారణాలు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తుల మీద క్షేత్ర స్థాయిలో పరిశీలన ఉంటుంది. ఒక వేళ ఆ ఓటరే తన ఓటు తొలగింపు కోరుకుంటే రిజిస్టర్ పోస్టులో ఓటర్ కి వ్యక్తిగతంగా అన్ని విషయాలు ఈ తొలగింపు మీద తెలియచేయడం కూడా జరుగుతుంది. సాధారణంగా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినపుడు మాత్రమే ఈ తొలగింపుని ఓటరు కోరుకుంటారు.

ఈ కారణాలతోనే తొలగింపు :

ఇక ఓటరు చనిపోయినపుడు, భారత దేశ పౌరుడు కానపుడు, లేదా రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నపుడు ఆ ఓటుని తొలగిస్తారు. అయితే ఇక్కడ ఏమైనా పొరపాటు జరిగి తనకు తెలియకుండా ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తే సదరు ఓటరు అప్పీలు చేసుకునే చాన్స్ ఉంటుంది. ఆయన వాదన విన్న తరువాత ఓటుని పునరుద్ధరిస్తారు మరి కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఫారం 7 ని ఉపయోగించి ఫలనా వారి ఓట్లను తీసేయాలని దరఖాస్తు చేయవచ్చు. అలా చేసినా వెంటనే ఓటుని తీసేయరు. దాని మీద కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిగి నిజం అని తేలితేనే తీసేస్తారు లేకపోతే సదరు దరఖాస్తు చేసిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈసీ నిబంధనల ప్రకారం చూస్తే కనుక ఓటును నేరుగా తొలగించడం అన్నది చట్ట రిత్యా అతి పెద్ద నేరం. అందువల్ల అలాంటివ్ ఎపుడూ జరిగే వీలు అయితే ఉండదు అని అంటున్నారు.

ఆన్ లైన్ లో ఉండేది అదే :

ఆన్ లైన్ లో కేవలం దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఓట్లను సాఫ్ట్ వేర్ ఉపయోగించి ఎవరూ తొలగించలేరు. ఈసీ ఇదే స్పష్టం చేస్తోంది. ఇలా వచ్చిన ప్రతీ దరఖాస్తుని పూర్తిగా పరిశీలించిన తరువాతనే ఈసీ చర్యలు తీసుకుంటుంది సాఫ్ట్ వేర్ ద్వారా తొలగించడం అసాధ్యమని ఈసీ స్పష్టం చేస్తోంది.