కూటమి పక్కన పెట్టింది...వైసీపీ షాక్ ఇచ్చేసింది
వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అంతే కాదు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా వాలంటీర్లను తీసుకుంది.
By: Satya P | 24 Jan 2026 5:00 PM ISTవైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అంతే కాదు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా వాలంటీర్లను తీసుకుంది. వీరికి గౌరవ వేతనంగా అయిదు వేల రూపాయలను ఇచ్చింది. వీరిని ప్రతీ యాభై కుటుంబాలకు బాధ్యులుగా చేసింది. ఆ విధంగా వీరు తమకు రాజకీయంగా ఉపయోగపడతారు అని భావించింది. కానీ విషయం చూస్తే మొత్తానికి మొత్తం బూమరాంగ్ అయింది.
రెండింటికీ చెడి :
వాలంటీర్లను తీసుకుని వచ్చి వైసీపీ పార్టీ నాయకులను క్యాడర్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది. అన్నీ వారే చూస్తారు అని ధీమా పడింది. తీరా ఎన్నికల సమయంలో ఈసీ తీసుకున్న నిర్ణయంతో వాలంటీర్లు అంతా సైడ్ అయిపోయారు. మరో వైపు కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారు వైసీపీని వదిలేసి ఆ వైపుగా పనిచేసారు. కూటమి అధికారంలోకి వస్తే పది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ఇచ్చిన హామీతో వైసీపీని వారే ఓడించేశారు. ఇలా వైసీపీ వ్యూహాలు రెండిందాలుగా చెడిపోయి ఎన్నడూ లేని విధంగా భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది.
కొన్నాళ్ళు ఆందోళన :
వాలంటీర్లు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొన్నాళ్ళ పాటు ఆందోళనలు నిర్వహించారు. తమకు పది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పారని తమను విధులలోకి తిరిగి తీసుకోవాలని వారు కోరారు. అయితే వారి సేవలను 2023 ఆగస్టు నుంచే వైసీపీ ప్రభుత్వం రెన్యూవల్ చేయలేదని టెక్నికల్ సాకులు చూపించి కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అదే సమయంలో నెలవారీగా అందించే సామాజిక పెన్షన్లను కూడా సచివాలయ ఉద్యోగుల చేత అందిస్తోంది. ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు అందడం లేదని ఎవరూ అనుకోవడం లేదు, క్రమంగా వారి గురించి కూడా అంతా మరచిపోయారు.
మానస పుత్రికగా :
అయితే వాలంటీర్ల వ్యవస్థను సృష్టించిన వైసీపీ దానిని తమ మానస పుత్రికగా అభివర్ణించింది. కానీ 2024 ఎన్నికల తరువాత నుంచి చూస్తే వైసీపీ ఎక్కడా వారి గురించి పెద్దగా ప్రస్తావన సైతం చేయడం లేదు, వాలంటీర్లు గతంలో ఆందోళన చేసినా కూటమి ప్రభుత్వం మీద దానిని విమర్శలుగా వాడుకుంది తప్ప తాము అధికారంలోకి వస్తే వారిని తిరిగి తీసుకుంటామని మాత్రం ఎక్కడా చెప్పడంలేదు, దీంతో వైసీపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది అని అంటున్నారు.
ఉండదు కాక ఉండదు :
ఇక వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకుని వస్తారా అంటే ఆ పార్టీ నాయకులు మాత్రం ఉండదు కాక ఉండదని చెబుతున్నారు. అంతే కాదు క్యాడర్ కి కూడా ఇదే రకమైన భరోసా ఇస్తున్నారు. మీరే ప్రభుత్వం తరఫున అన్నీ చూస్తారు, మీరే సారధులు అని వారికి చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను మంచి ఉద్దేశ్యంతో తాము తెచ్చినా చివరికి రాజకీయంగా అది తమకు తీరని నష్టాన్ని చేసింది అని వైసీపీ నేతలు అంటున్నారు. దాంతో వాలంటీర్ల వ్యవస్థ అన్నది వైసీపీ ఆలోచనలో ఎక్కడా కనిపించడం లేదు, తాము అధికారంలోకి వస్తే ఫలానాది చేస్తామని చెబుతున్న వైసీపీ పెద్దలు ఈ రోజుకీ వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పకపోవడమే విశేషం అని అంటున్నారు. మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ ఎంతో గొప్పదని దేశంలో అతి పెద్ద పాలనా సంస్కరణ అని గొప్పగా చెప్పుకునే వైసీపీ ఇపుడు మాత్రం తూచ్ అంటోదని చెబుతున్నారు. మరి దెబ్బ గట్టిగానే తగిలింది అందుకే ఇలా అని సెటైర్లు అయితే పడుతున్నాయి.
