Begin typing your search above and press return to search.

మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు ట్రంప్ గారూ.. పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో ఇప్పటికే రకరకాల కారణాలు చెప్పారు ట్రంప్.

By:  Raja Ch   |   22 Jan 2026 2:00 PM IST
మమ్మల్ని ఇన్వాల్వ్  చేయొద్దు ట్రంప్  గారూ.. పుతిన్  ఆసక్తికర వ్యాఖ్యలు!
X

గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో ఇప్పటికే రకరకాల కారణాలు చెప్పారు ట్రంప్. ఇందులో భాగంగా కాసేపు చాగోస్ దీవుల ప్రస్థావన తీసుకురాగా.. ప్రధానంగా రష్యా, చైనాల నుంచి గ్రీన్ ల్యాండ్ భద్రతకు.. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ భద్రతకు ముప్పు ఉందని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. అది తమకు సంబంధం లేని వ్యవహారమని చెబుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి నిన్నటి వరకూ పూర్తి ఉత్సాహంగా కనిపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అందుకు ఆయన చెప్పిన ప్రధాన కారణం.. రష్యా, చైనాల నుంచి భద్రతకు ముప్పు పొంచి ఉండటమే అని. ఈ విషయాలను డెన్మార్ అర్ధం చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో... తాజాగా మాత్రం ఈ విషయంలో బల ప్రయోగాలు ఉండవని దావోస్ వేదికగా తెలిపారు. ఈ సమయంలో వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ.. అమెరికాకు గతాన్ని గుర్తు చేశారు.

రష్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పుతిన్... గ్రీన్‌ లాండ్‌ పై ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారంతో తమకు ఏమీ పని లేదని అన్నారు. ఈ సమస్యను అమెరికా, డెన్మార్క్‌ లు కలిసి పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డెన్మార్క్‌.. గ్రీన్‌ లాండ్‌ ను ఒక భాగంగా, ఒక కాలనీగా మాత్రమే చూస్తోందని, దానిపై వివక్ష చూపించడం లేదని పుతిన్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యవహారంపై ఎవరూ ఆసక్తి చూపిస్తున్నారని తాను అనుకోవడం లేదన్నారు.

ఈ నేపథ్యంలోనే అమెరికాను పొగిడారో, ట్రంప్ కు చురకలు అంటించారో తెలియదు కానీ... ఇతరుల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంలో అమెరికాకు సుదీర్ఘ చరిత్ర ఉందని అన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ సందర్భంగా 1867లో అలస్కాను రష్యా 7.2 మిలియన్‌ డాలర్లకు యూఎస్‌ కు విక్రయించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అదే విధంగా... 1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు విక్రయించిందని గుర్తు చేశారు.

ఈ క్రమంలో... గ్రీన్‌ లాండ్‌ కొనుగోలుకు దాదాపు 1 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చవుతుందని చెప్పిన పుతిన్.. ఆ మొత్తాన్ని భరించగల సామర్థ్యం అగ్రరాజ్యానికి ఉందని వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ విషయం పూర్తిగా అమెరికా, డెన్మార్క్, గ్రీన్ ల్యాండ్, ఈయూ లకు సంబంధించిన విషయమని.. గ్రీన్ ల్యాండ్ వ్యవహారంతో తమకు ఏమీ సంబంధం లేదని స్పష్టం చేశారు!

మరోవైపు... గాజా పునర్నిర్మాణానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరేందుకు పుతిన్‌ అంగీకరించారని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై పుతిన్ క్లారిటీ ఇచ్చారు. తాము ఈ ప్రతిపాదనను ఇంకా అంగీకరించలేదని.. ప్రస్తుతం పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వాములతో సంప్రదించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.