రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనపై భారీ కుట్ర?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ళనంతరం ఇండియాలో పర్యటించబోతున్నారు.
By: Tupaki Political Desk | 3 Dec 2025 1:45 PM ISTరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతపర్యటనపై భారీ కుట్రకు తెరలేచిందా? ఇప్పటికే ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి పుతిన్ పై అంతర్జాతీయ అరెస్ట్ వారంట్ ఉండటంతో భారత్ లో పుతిన్ దిగగానే అరెస్ట్ అయ్యే అవకాశముందా అన్న పుకార్లు షికార్లు కొడుతున్నాయి. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే రష్యా సైన్యం దిగడంతో ఈ వాదనలు మరింత బలపడుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ళనంతరం ఇండియాలో పర్యటించబోతున్నారు. డిసెంబర్ 4,5 తేదీల్లో ఆయన భారత్ ను సందర్శిస్తారు. 23వ భారత్..రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి రావల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ పుతిన్ ను ఆహ్వానించారు. భారత్ అమెరికా విదేశ వ్యవహారాలు దెబ్బతిన్న తరుణంలో మరోవైపు భారత్ రష్యా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేయడానికి పరోక్షంగా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోందని అమెరికా అధ్యక్షుడి ప్రధాన ఆరోపణ...ఇందుకు ప్రతిగా విపరీతంగా ఎగుమతి సుంకాలు కూడా పెంచారు. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉక్రెయిన్ లో యుద్ధనేరాలు చేశారని, అక్కడి చిన్నారుల్ని బహిష్కరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పుతిన్ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. అయితే ఈ వారంట్ భారత్ కు వర్తిస్తుందా? రష్యా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోడానికి భారత్ సిద్ధమవుతుందా? పుతిన్ పర్యటన ప్రకరణలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తెలివిగా పావులు కదుపుతున్నారా? భారత్ రష్యాల మధ్య బంధం బలపడటాన్ని ఇరు దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయా? ఇలా పుతిన్ పర్యటనపై ఎన్నో సందేహాలు చుట్టుముడుతున్నాయి.
ఐసీసీ అరెస్ట్ జారీ చేశాక పుతిన్ తొలిసారి మంగోలియా పర్యటన చేపట్టారు. అయితే అక్కడ పుతిన్ కు భారీ స్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్సుఖ్‌ను పుతిన్ కలిశారు. పుతిన్ కు స్వాగతం పలికేందుకు లైవ్ బ్యాండ్ ద్వారా మార్షల్ గీతాలు వాయించారు. సైనికులు రాజధాని చెంఘిజ్ ఖాన్ స్క్వేర్‌లో గుర్రాలపై వరుసలో బారులు దీరారు.
నెదర్లాండ్స్ లోని ది హేగ్ లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అంతర్జాతీయంగా వ్యక్తులు లేదా దేశాలు చేసిన తప్పులు నేరాలను విచారించే అధికారం ఉన్న ప్రపంచ న్యాయస్థానం. సందర్భం వచ్చినపుడు యుద్ధనేరాలు, మారణకాండలు, దురాక్రమణలు తదితర ఆరోపణలపై విచారణ చేపడుతుంది. ఐసీసీని 2002లో స్థాపించారు. యుద్దనేర ఆరోపణపై రష్యాధ్యక్షుడు పుతిన్ పై ఐసీసీ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. అయితే రష్యా,ఉక్రెయిన్ రెండు దేశాలు ఐసీసీపై సంతకాలు చేయనందున ఇతర దేశాల్లాగానే రష్యా కూడా కోర్టు పరిధిని గుర్తించడం లేదని రష్యా ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. ఐసీసీ తీసుకునే ఏ నిర్ణయం అయినా రష్యా ఫెడరేషన్ కు అది చట్టబద్ధం కాదని...అందుకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఐసీసీపై 124 దేశాలు సంతకాలు చేశాయి. అయితే భారత్ చేయలేదు కాబట్టి భారత్ ఐసీసీ నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిన అవసరం లేదు. గతంలోనూ ఐసీసీ విచారణ ఎదుర్కొన్న నాయకులకు భారత్ ఆతిథ్యమిచ్చింది.
