చిన్న శ్రీను కూతురు కులం మీద వివాదం...వైసీపీ లాజిక్ పాయింట్ !
కీలకమైన విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల వేళ వైసీపీ కీలకమైన పాయింట్ తో ముందుకు వచ్చింది.
By: Satya P | 25 Oct 2026 4:50 PM ISTకీలకమైన విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల వేళ వైసీపీ కీలకమైన పాయింట్ తో ముందుకు వచ్చింది. అది కూడా నిన్నటిదాకా వైసీపీలో ఉండి టీడీపీ వైపు వెళ్ళిన చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కులం గురించి కీలక పాయింట్ నే పట్టుకుని వైసీపీ కరెక్ట్ టైం లో గట్టిగానే టార్గెట్ చేసింది. ఆమెది బీసీ సామాజిక వర్గం కాదని కొత్త విషయాన్ని వైసీపీ బయటపెడుతోంది. ఆమె ఓసీ అని అగ్ర వర్ణానికి చెందిన వారు అని వైసీపీ వాదిస్తోంది. దాంతో సిరి జెడ్పీటీసీ నామినేషన్ ఇపుడు రసకందాయంలో పడింది.
చట్టపరమైన ఆధారాలు :
ఇదిలా ఉంటే సిరి సహస్ర విజయనగరం జిల్లా పీఠం మీద గురి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె జెడ్పీటీసీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తోంది. అందులో ఒకటి బొబ్బిలి అసెంబ్లీ నియోజకర్గం తెర్లాం మండలం జెడ్పీటీసీగా ఆమె బరిలో ఉన్నారు. ఈ మేరకు ఆమె నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆమె పోటీ చేస్తున్న జెడ్పీటీసీ సీటు బీసీ సామాజిక వర్గానికి కేటాయించినది కావడంతో వైసీపీ ఒక లాజిక్ పాయింట్ తో ఆమెను ఇరుకున పెడుతోంది. ఆమె అసలు బీసీనే కాదని వైసీపీ కొత్త వాదన చేస్తోంది. ఆమె అగ్ర వర్ణానికి చెందిన వారని చట్టాప్రమైన ఆధారాలు లేకుండా ఒక బీసీ రిజర్వేషన్ కింద ఉన్న సీటులో ఓసీ అభ్యర్ధిగా ఆమె ఎలా నామినేషన్ దాఖలు చేస్తారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
జైన్ మతానికి అంటూ :
ఇక సిరి సహస్ర పుట్టు పూర్వోత్తరాలను కూడా వైసీపీ బయటపెట్టింది. ఆమె అసలు పేరు సిరి సహస్ర కాదని ముస్కాన్ జైన్ అని, ఆమె రమేష్ కుమార్ జైన్ కుమార్తె అని స్పష్టం చేశారు. ఏపీలో జైన సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక చిన్న శ్రీను సునీత దంపతులు సిరి సహస్రను దత్తత తీసుకున్నారు అని కూడా వివరించారు. ఇక సిరి సహస్రకు జన్మతః వచ్చిన కులం హోదా ఎప్పటికీ మారదని వైసీపీ నేతలు పేర్కొంటూ దానికి సంబంధించిన చట్టపరమైన అంశాలను సైతం ఉదహరించారు. ఈ మేరకు సిరి సహస్ర కులం విషయంలో విజయనగరం జిల్లా రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా వైసీపీ తమ ఫిర్యాదులను సమర్పించింది.
అన్ని ఉల్లంఘనలే అంటూ :
సిరి సహస్ర తన కులం తూర్పు కాపు అని దాఖలు చేశారని అది చట్ట ప్రకారం చెల్లదని ఆమెకు బీసీ రిజర్వేషన్ వర్తించదని కూడా వైసీపీ నేతలు పేర్కొన్నారు. అంతే కాదు ఆమె నామినేషన్ డిపాజిట్ మొత్తం చెల్లించడంలో కూడా నిబంధనలను ఉల్లంఘించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలోని హ్యాండ్‌బుక్ ఛాప్టర్ 5 అలాగే రూల్ 2 (ఐ) ప్రకారం ఓసీ అభ్యర్థులు ఆరు వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉండగా తాను బీసీ అభ్యర్థిగా పేర్కొంటూ మజ్జి సిరి కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే చెల్లించారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో తెలిపారు.
తిరస్కరించాలని :
అందువల్ల సిరి సహస్ర నామినేషన్ ని తిరస్కరించాలని వైసీపీ నేతలు కోరారు. బీసీ సీటులో ఓసీ కి చాన్స్ ఇవ్వ కూడదని, ఆమె సమర్పించిన కుల ధృవీకరణ పత్రాలు ప్రామాణికంగా పరిగణించి పోటీకి అనుమతించకూడదని రిటర్నింగ్ అధికారిని వైసీపీ నేతలు కోరారు. అంతే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ అయిన స్థానాల విషయంలో అర్హులైన అభ్యర్థుల హక్కులు దెబ్బతినకుండా చూడాలని ఈ విషయంలో కచ్చితంగా చట్టబద్ధంగా వ్యవహరించాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
కీలక సమయంలో :
వైసీపీ సరైన సమయంలో చేసిన ఈ ఫిర్యాదు విజయనగరం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సిరి సహస్ర నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అంటున్నారు. దీంతో ఇపుడు ఈ కీలకమైన వ్యవహారంపై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆమె నామినేషన్ ని ఎన్నికల అధికారి తిరస్కరిస్తే ఆమె బీసీలకు రిజర్వ్ చేసిన జెడ్పీ చైర్ పర్సన్ పదవికి కూడా దూరం కావాల్సి వస్తోంది. తన కుమార్తె మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్న శ్రీను ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది.
