Begin typing your search above and press return to search.

విజయనగరం జడ్పీ రేసులో కిమిడి.. చిన్న శ్రీనుకు మళ్లీ షాక్ తప్పదా?

విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిపై మాజీ చైర్మన్ చిన్న శ్రీనుకు మోజు ఎక్కువని చెబుతారు.

By:  Tupaki Political Desk   |   23 Oct 2026 8:00 PM IST
విజయనగరం జడ్పీ రేసులో కిమిడి.. చిన్న శ్రీనుకు మళ్లీ షాక్ తప్పదా?
X

విజయనగరం జడ్పీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ పదవిని ఆశించి పార్టీలోకి వచ్చిన మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుకు రిజర్వేషన్ అనుకూలించపోగా, ఆయన కుమార్తె సిరి సహాస్రకు జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠం దక్కుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. చిన్న శ్రీను కుటుంబానికి జడ్పీ సీటు ఇస్తామనే హామీతోనే టీడీపీలో చేర్చుకున్నారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో విజయనగరం మేయరుగా చిన్న శ్రీను కుమార్తె సిరిసహస్ర పోటీ చేస్తారని ఊహాగానాలు వ్యాపించాయి. అయితే విజయనగరంలో సిరిసహస్రకు ఓటు లేకపోవడం వల్ల ఆమె జడ్పీ రేసులోకి వచ్చారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు సిరిసహస్రకు పోటీగా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోడలు సంధ్య రంగంలోకి దిగడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిపై మాజీ చైర్మన్ చిన్న శ్రీనుకు మోజు ఎక్కువని చెబుతారు. రాజకీయంగా ఆ కుటుంబానికి ఎన్ని పదవులు ఉన్నప్పటికీ జిల్లా పరిషత్ చైర్మన్ సీటు కావాలని పట్టుబడుతుంటారని చెబుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించినా, లేకపోయినా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా, తెరవెనుక పెద్దరికం అంతా చిన్న శ్రీనే చేసేశారన్న విమర్శలు ఉన్నాయి. 2006 నుంచి ఇప్పటివరకు జడ్పీపై చిన్నశ్రీను పెద్దరికమే నడిచిందని అంటున్నారు. 2014 - 19 మధ్య కాలంలో తప్ప మిగిలిన సమయంలో కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు చెందిన నాయకులే జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేయడం, ఆ సమయంలో చిన్న శ్రీను ఆ పార్టీలో కీలకంగా ఉండటంతో జడ్పీ పగ్గాలు తన చేతిలో ఉంచుకునేవారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 2021 ఎన్నికల్లో ఆయనే స్వయంగా పోటీ చేసి చైర్మను పీఠం అధిష్టించారు. ఇక తాజా ఎన్నికల్లో మరోసారి ఈ సీటు ఆశించినా రిజర్వేషన్ అనుకూలించలేదని చెబుతున్నారు. దీంతో తన కుమార్తె సిరిసహస్రను తెర్లాం జడ్పీటీసీగా పోటీకి పెట్టారని అంటున్నారు.

అయితే జిల్లా రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే చిన్న శ్రీను ఆశలు నెరవేరే పరిస్థితి ఉందా? అన్న చర్చే ఎక్కువగా నడుస్తోంది. చిన్నశ్రీను తన కుమార్తెను ఎవరూ ఊహించని విధంగా బొబ్బిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపగా, ఆయనకు పోటీగా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తన కోడలు సంధ్యను పోటీకి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. చిన్నశ్రీను సొంత నియోజకవర్గంగా భావిస్తున్న చీపురుపల్లితోపాటు రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కిమిడి కళావెంకటరావు ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఆయన కోడలు సంధ్య జిల్లా అధ్యక్ష పదవికి హాట్ ఫేవరెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీలో సీనియర్ కావడం, మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల జడ్పీ పీఠం కోసం కళా ఒత్తిడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో చిన్న శ్రీను కుమార్తె పేరు సందిగ్ధంలో పడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

భారీగా పోటీ

విజయనగరం జిల్లాలో ఈ సారి జడ్పీ చైర్మన్ పోస్టును చాలా మంది నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే ఉత్కంఠ ఎక్కువ అవుతోంది. ప్రధానంగా మాజీ చైర్మను చిన్న శ్రీను కుమార్తెకు ఈ పదవి ఇస్తారని తొలి నుంచి ప్రచారం జరిగినా, ప్రస్తుతం జిల్లా నుంచి పలువురు సీనియర్లు తమ కుటుంబ సభ్యులతో నామినేషన్లు వేయడంతో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోడలు నామినేషన్ వేయడంతో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు తన కుమార్తె చంద్రకళతో నామినేషన్ వేయించడం కూడా చర్చకు తావిస్తోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బంగార్రాజు పొత్తుల్లో భాగంగా త్యాగం చేయడంతో జడ్పీ చైర్మన్ సీటు ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గానికే చెందిన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ భార్య కంది రమాదేవి సైతం చైర్పర్సన్ సీటు ఆశించడంతో ఉత్కంఠ పెరుగుతోంది. కంది చంద్రశేఖర్ గత ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ సభ్యుడిగా పోటీకి సిద్ధమవగా, చివరి క్షణంలో అధిష్టానం తప్పించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ ఎక్కువవుతోంది.