Begin typing your search above and press return to search.

30 ఏళ్లలో బొత్సకు తొలిసారి ఎదురుదెబ్బ! వైసీపీకి షాక్

సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణకు తన సొంత జిల్లా విజయనగరంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

By:  Tupaki Political Desk   |   6 Oct 2025 3:51 PM IST
30 ఏళ్లలో బొత్సకు తొలిసారి ఎదురుదెబ్బ! వైసీపీకి షాక్
X

సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణకు తన సొంత జిల్లా విజయనగరంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తలపండిన నేతగా చక్రం తిప్పుతున్న బొత్సకు టీడీపీ యువనేత, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున కోలుకోలేని షాక్ ఇచ్చారని అంటున్నారు. 30 ఏళ్లుగా బొత్సకు ఎదురులేని చోట నో ఎంట్రీ బోర్డు పెట్టిన నాగార్జున గట్టి ఝలక్ ఇచ్చారు. బొత్స స్వస్థలం విజయనగరం పట్టణంలో పైడితల్లి ఉత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఈ పొలిటికల్ ఫైట్ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

శాసనమండలిలో ప్రతిపక్ష హోదాతో కేబినెట్ హోదాలో ఉన్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణపై టీడీపీ తొలిసారిగా మానసికంగా పైచేయి సాధించిందని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా టీడీపీ-వైసీపీ మధ్య తీవ్రపోటీ ఉన్న విషయం తెలిసిందే. పరిస్థితుల బట్టి గెలుపోటుములు ఉంటున్నప్పటికీ వ్యక్తిగత నాయకత్వ సామర్థ్యం విషయానికి వస్తే విజయనగరం జిల్లాలో బొత్సను ఢీకొట్టే నేత ఇంతవరకు ఎవరూ లేరన్న అభిప్రాయమే ఉండేది. ప్రస్తుత గోవా గవర్నర్, ఒకప్పటి టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు రాజకీయాల్లో బొత్స కన్నా సీనియర్ అయినప్పటికీ ఆయన స్టైల్ వేరు. బొత్స పూర్తిగా మాస్ పాలిటిక్స్ తో జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగి విజయనగర రాజవంశీయుడైన అశోక్ కు సవాల్ చేసే స్థాయికి ఎదిగారు.

ఏటా జరిగే విజయనగరం ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్సవంలో విజయనగర రాజవంశీయులకు దీటుగా బొత్స కుటుంబం వ్యవహరించేది. ఈ ఉత్సవాన్ని కోటపై నుంచి రాజవంశీయులు తిలకించడం, అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం ఆచారం. జిల్లాకు చెందిన నేతలు అంతా కోట బురుజు పై నుంచే ఈ ఉత్సవాన్ని తిలకించేవారు. అయితే జిల్లా రాజకీయాల్లో బొత్స శకం ఆరంభమైన తర్వాత ఈ ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెట్టారు. రాజవంశానికి పోటీగా విజయనగరం కోటకు సమీపంలో డీసీసీబీ భవనంపై బొత్స ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయించారు. 1996లో ప్రారంభమైన ఈ ప్రత్యేక శిబిరం గత 30 ఏళ్లుగా రాజవంశీయుల రాజకీయ ప్రత్యర్థులకు వేదికగా మారింది.

విజయనగరం ఉత్సవాల సమయంలో కోటపైనే మంత్రులు, ప్రభుత్వ అధికారులు రాజవంశీయులతోపాటు ఆశీనులు అయ్యేవారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే ఆనవాయితీగా కొనసాగేది. అయితే 2004లో బొత్స మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ అధికారులు కోటపై కాకుండా డీసీసీబీ భవనంపై నుంచే ఉత్సవాలను తిలకించడం రివాజుగా మారింది. బొత్స ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఇదే పద్ధతి. ఇక రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్పప్పుడు సైతం బొత్స డీసీసీబీపై ఏర్పాటు చేసిన శిబిరం నుంచే ఉత్సవం తిలకించేవారు. 2014-19 మధ్య బొత్సకు ఎలాంటి పదవి లేకపోయినా, డీసీసీబీ భవనంపై బొత్స కుటుంబం కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. అయితే ఇప్పుడు బొత్స శాసనమండలి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పటికీ ఆయనకు డీసీసీబీ భవనంపై ఏర్పాటు చేసిన శిబిరానికి ఎంట్రీ లేకుండా చేయడం చర్చనీయాంశం అవుతోంది.

ఎప్పట్లానే తన కుటుంబం, పార్టీ నేతల కోసం డీసీసీబీ భవనంపై శిబిరం నిర్వహణకు అనుమతించాలని బొత్స లేఖ రాయగా, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తిరస్కరించారు. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇన్నాళ్లు విజయనగరం ఉత్సవాల్లో బొత్స హవాకు ఎవరూ అడ్డు చెప్పలేదు. కానీ, తొలిసారిగా ఆయనకు డీసీసీబీ భవనంపై ప్లేసు లేకుండా చేయడం చర్చనీయాంశంగా మారింది. 30 ఏళ్లుగా డీసీసీబీపై రాజ ఠీవి ఒలకబోసిన బొత్స, ఆయన అనుచరులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో డీసీసీబీ చైర్మన్ నాగార్జున నిర్ణయాన్ని గోవా గవర్నర్, విజయనగరం రాజవంశీయులు, మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతి అభినందిస్తూ బొత్సకు షాక్ ఇవ్వడాన్ని గొప్ప చర్యగా కొనియాడుతున్నారని అంటున్నారు.

ఇక ఈ ఇష్యూ రెండు పార్టీల మధ్య పెద్ద దుమారం రేపింది. వైసీపీలో జిల్లా నేతలు అంతా బొత్సను అవమానించేలా ప్రభుత్వం, డీసీసీబీ చైర్మన్ నాగార్జున వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. యాథావిధిగా తాము అధికారంలోకి వస్తే తమ పవర్ ఏంటో చూపుతామని వార్నింగులిస్తున్నారు. అయితే డీసీసీబీ చైర్మన్ హోదాలో నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స రాజకీయ ప్రత్యర్థిగా ఆయనను మరో మెట్టు ఎక్కించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బొత్సను ఎదుర్కోవడంలో టీడీపీకి ఇన్నాళ్లకు సరైన నేత లభించాడని కార్యకర్తలు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.