Begin typing your search above and press return to search.

విజయనగరం మేయర్ సీటు...ఆమె కోసమేనా ?

విజయనగరం కార్పొరేషన్ గా అవతరించాక రెండవసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 28న విజయనగరం మేయర్ తో పాటు అరవై దాకా ఉన్న కార్పోరేటర్లకు ప్రజలు ఎన్నుకోనున్నారు.

By:  Satya P   |   15 Oct 2026 4:00 AM IST
విజయనగరం మేయర్ సీటు...ఆమె కోసమేనా ?
X

విజయనగరం కార్పొరేషన్ గా అవతరించాక రెండవసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 28న విజయనగరం మేయర్ తో పాటు అరవై దాకా ఉన్న కార్పోరేటర్లకు ప్రజలు ఎన్నుకోనున్నారు. ఫలితాలు ఈ నెల 30న వెలువడనున్నాయి. ఇక ఈసారి తమదే మేయర్ పీఠం అని టీడీపీ కూటమి ధీమాగా ఉంది, అదే సమయంలో మరోసారి కార్పొరేషన్ మీద వైసీపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ చూస్తోంది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో విజయనగరంలో రాజకీయ వేడి రాజుకుంది.

జనరల్ మహిళగా :

విజయనగరం మేయర్ సీటుని జనరల్ మహిళ కేటగిరీగా రిజర్వ్ చేశారు. దాంతో పోటీలో ఇంతవరకూ వినిపించిన సీనియర్ నేతలు అంతా దిగాలు పడ్డారు. తాము తప్పుకుని తమ ఇంటి నుంచే మహిళా అభ్యర్ధులను తీసుకుని రావడానికి చూస్తున్నారు. ఇక జనరల్ మహిళగా ఈ సీటుని కేటాయించడంతో గతంలో పనిచేసిన వారు సీనియర్ మహిళా నేతలు మేయర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. టీడీపీలో అయితే పోటీ ఎక్కువగా ఉంది. అయితే అనూహ్యంగా ఈ సీటు విషయంలో చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె కోసమే జనరల్ మహిళగా రిజర్వ్ చేశారు అని అంటున్నారు.

యువతకు చాన్స్ అంటూ :

ఇక విజయనగరంలో మేయర్ సీటుని టీడీపీ తీసుకుంటుంది అని అంటున్నారు. ఆ పార్టీలో నాయకులకు కొరత లేదు, మహిళా నాయకులు కూడా అధికంగానే ఉన్నారు. సామాజిక సమీకరణలు చూసుకున్నా అన్ని వర్గాల నుంచి ధీటైన వారే రేసులో ఉన్నారు. అయితే అనుభవం కలిగిన వారికి మేయర్ అభ్యర్ధిత్వం ఇస్తారా లేక యువ నేతలకు పట్టం కడతారా అన్న చర్చ సాగుతోంది. యువ నాయకత్వానికే ఇటీవల కాలంలో టీడీపీ ప్రోత్సహిస్తోంది. అందువల్ల సిరి సహస్ర వంటి యువ మహిళా నాయకురాలికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఆమెను మొదట జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం అని అనుకున్నా ఇపుడు మేయర్ అభ్యర్ధిత్వం గురించి హైకమాండ్ పరిశీలన చేస్తోంది అని అంటున్నారు.

సులువుగా గెలుపు :

చిన్న శ్రీనుకు విజయనగరం పట్టణంలో రాజకీయంగా పలుకుబడి అధికంగా ఉంది అని అంటున్నారు. ఆయన తన కుమార్తెతో టీడీపీలో చేరింది సిరి సహస్రకు రాజకీయ భవిష్యత్తు కోసమే అని అంటున్నారు. నిజానికి జెడ్పీ పీఠం మీదనే చిన్న శ్రీను ఫ్యామిలీ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. కానీ అధినాయకత్వం మాత్రం మేయర్ సీటుని ఆఫర్ చేస్తోంది అని అంటున్నారు. వైసీపీ అభ్యర్ధిని ఓడించాలంటే సిరి సహస్ర వంటి వారినే ముందు పెట్టాలని చూస్తున్నారు. దాంతో సిరి సహస్త్ర మేయర్ కే పోటీ పడతారు అని చెబుతున్నారు. టీడీపీ కొత్త తరానికి అవకాశం ఇస్తుందని అందులో భాగమే ఇదంతా అని అంటున్నారు.

కోలగట్ల వర్సెస్ చిన్న శ్రీను :

అదే కనుక జరిగితే విజయనగరం మేయర్ సీటుకు పోటీ రెండు పార్టీల మధ్యనే కాదు రెండు రాజకీయ కుటుంబాల మధ్యన కూడా గట్టిగానే సాగుతుందని అంటున్నారు. ఇక కోలగట్ల వీరభద్రస్వామి రెండు సార్లు విజయనగరం అసెంబ్లీ నుంచి గెలిచారు. ఆయన గత ప్రభుత్వంలో ఉప సభాపతిగా పనిచేశారు. ఆయన తన కుమార్తెను మేయర్ పీఠం మీద చూడాలని అనుకుంటున్నారు. గతంలోనే ఆమె మేయర్ కావాల్సింది. అయితే బీసీ మహిళకు ఆనాడు రిజర్వ్ అయింది. ఈసారి మాత్రం జనరల్ కావడంతో కోలగట్ల శ్రావణి వైసీపీ తరఫున మేయర్ గా పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇక చిన్న శ్రీను కుమార్తె ఇదే సీటుకు పోటీ పడితే కోలగట్ల వర్సెస్ చిన్న శ్రీనుగానే పోరు సాగుతుందని అంటున్నారు.