Begin typing your search above and press return to search.

రాజు గారి అమ్మాయి ప్రెస్టేజ్ గా మేయర్ సీటు !

విజయనగరం మేయర్ సీటుని టీడీపీ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది.

By:  Satya P   |   26 Oct 2026 9:24 AM IST
రాజు గారి అమ్మాయి ప్రెస్టేజ్ గా మేయర్ సీటు !
X

విజయనగరం మేయర్ సీటుని టీడీపీ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే పార్టీతో పాటుగా విజయనగరం టీడీపీ శాసనసభ్యులు, కేంద్ర మాజీ మంత్రి, గోవా గవర్నర్ అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అయిన అదితి గజపతిరాజు కూడా ప్రతిష్టగానే తీసుకున్నారు అని అంటున్నారు. రేసులో ఎంతో మంది ఉంటే ఆమె ఏరి కోరి అవనాపు భార్గవిని ఎంపిక చేశారు. విజయనగరం మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించారు. దాంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు టీడీపీ మేయర్ సీటుని ఇచ్చింది. ఇక అవనాపు కుటుంబం టీడీపీలో చాలా కాలంగా పనిచేస్తోంది. దాంతో ఆ ఫ్యామిలీకి న్యాయం చేయడానికి కూడా అదితి గజపతిరాజు ఈ ఎంపిక చేశారు అని చెబుతున్నారు.

తొలిసారి జనంలోకి :

ఇక విజయనగరం నుంచి టీడీపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవనాపు భార్గవి రాజకీయాల్లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమె ఒక బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. ఆమె టీడీపీ సీనియర్ నాయకుడు అవనాపు విజయ్ భార్య. అలాగే విజయనగరం మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత అవనాపు సూరిబాబు కోడలుగా జనానికి పరోక్షంగా పరిచితులు. ఇక ఈ ఎన్నికల్లో ఆమెకు కూటమి పార్టీల మొత్తం మద్దతు దక్కుతోంది. ఆమె చురుకుగా జనంలో తిరుగుతున్నారు. అంతే కాదు తన గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మేయర్ మాదే :

విజయనగరం మేయర్ పీఠం టీడీపీ కూటమిదే అని అవనాపు భార్గవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో కూటమి ఉండడం, రాజకీయ సామాజిక సమీకరణలు అన్నీ సరిపోవడం చిన్న శ్రీను వర్గం అంతా మద్దతుగా నిలవడం టీడీపీకి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. అయితే ఆమెకు రాజకీయ అనుభవం లేదని వైసీపీ విమర్శలు చేస్తోంది. అవతల వైపు మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె డిప్యూటీ మేయర్ గా అయిదేళ్ల పాటు పనిచేసిన కోలగట్ల శ్రావణి బరిలో ఉన్నారు. ఆమెకు రాజకీయ పాలన అనుభవం ఉంది, దాంతో ఆ విషయంలో వైసీపీ తమకు జనం సపోర్టు ఉంటుందని భావిస్తోంది. కానీ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న విజయనగరం కార్పొరేషన్ లో టీడీపీ కూటమిదే విజయం అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఒక్క చాన్స్ అంటూ :

ఇక ఎన్నికల ప్రచారంలో అవనాపు భార్గవి తనకు ఒక్క చాన్స్ ఇస్తే విజయనగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని అందువల్ల అభివృద్ధి తమతోనే సాధ్యమని కూడా చెబుతున్నారు. అయిదేళ్ళ వైసీపీ పాలనలో విజయనగరం కార్పోరేషన్ అభివృద్ధి చెందలేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే విజయనగరంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేస్తున్నారు.

అదితి సైతం :

ఇదిలా ఉంటే అదితి గజపతిరాజు మేయర్ ఎన్నిక అంతా తానే అయి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా ప్రచారం పర్వంలో దూసుకుని పోతున్నారు. విజయనగరం రాజుల కంచుకోట. వారు ఎవరి పేరు చెబితే వారే అధికారం అందుకుంటారు. అలా పూసపాటి వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న అదితి గజపతిరాజు ఈసారి మేయర్ పీఠాన్ని గెలిచి తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఒక విధంగా చూస్తే అటు కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ వైపు నుంచి ఉన్నారు. తన కుమార్తె గెలుపు కోసం ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. ఇక్కడ అదితి గజపతిరాజు ప్రతిష్ట గా తీసుకున్నారు. ఇలా 2024 తరువాత మరోసారి ఈ ఇద్దరి మధ్యనే మేయర్ పీఠం కోసం పరోక్షంగా పోరు సాగుతోంది అని అంటున్నారు.