కోటని ఢీ కొట్టనున్న కోలగట్ల వారసురాలు ?
విజయనగరం అంటేనే పూసపాటి వారి సంస్థానం. మూడు తరాలను చూసిన గడ్డ అది. రాచరికం అయినా ప్రజాస్వామ్యం అయినా పూసపాటి వారి హవాకు తిరుగులేదు.
By: Satya P | 24 Jun 2026 9:24 AM ISTవిజయనగరం అంటేనే పూసపాటి వారి సంస్థానం. మూడు తరాలను చూసిన గడ్డ అది. రాచరికం అయినా ప్రజాస్వామ్యం అయినా పూసపాటి వారి హవాకు తిరుగులేదు. పీవీజీ రాజు నుంచి అశోక్ గజపతిరాజు దాకా అందరినీ విజయనగరం ప్రజలు ఆశీర్వదించారు. అశోక్ అయితే ఈ రోజున గోవాకు గవర్నర్ గా వెళ్లారు. ఆయన 1978 నుంచి 2009 దాకా ఏకంగా ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఏడు సార్లు విజయనగరం అసెంబ్లీ నుంచి గెలిచి అనేకసార్లు మంత్రి పదవులు చేపట్టారు. ఇక కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అశోక్ గవర్నర్ గా తన రాజకీయ జీవితాన్ని రాజ్యాంగబద్ధమైన పదవితో పూర్తి చేయనున్నారు.
ఓడి గెలిచిన అదితి గజపతి :
అశోక్ కుమార్తెగా రాజకీయాల్లో వారసత్వంగా ముందుకు వచ్చిన అదితి గజపతి రాజు 2019లో ఓడి 2024లో గెలిచారు. 2019లో ఆమెను కోలగట్ల వీరభద్రస్వామి ఓడించారు. ఇక 2029లో అదితి గజపతి రాజు మీద పోటీ చేయబోయేది కోలగట్ల వారసురాలు అయిన శ్రావణి అని అంటున్నారు. తండ్రికి తగిన తనయగా ఆమె ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. విజయనగరం కార్పోరేషన్ కి డిప్యూటీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. దాంతో పాటుగా వైసీపీ పార్టీ కార్యక్రమాలలో ఆమె జోరుగా పాల్గొంటున్నారు. 2029 ఎన్నికల విషయంలో ఇప్పటి నుంచే కోలగట్ల శ్రావణి ప్రిపేర్ అవుతున్నారు.
అందుబాటులో లేరంటూ :
అశోక్ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చినా తండ్రి మాదిరిగా జనంతో మమేకం కావడం లేదు అన్న విమర్శ అయితే అదితి గజపతిరాజుకు ఉందని అంటున్నారు. ఆమె కొద్ది మంది నేతల మీదనే ఆధారపడుతున్నారని అంటున్నారు. దాంతో పార్టీలోనూ కొంత అసంతృప్తి ఉందని చెబుతున్నారు. వీటిని ఆమె అధిగమించాల్సి ఉందని చెబుతున్నారు. రెండేళ్ళ పాలన అయితే పూర్తి అయింది, దాంతో ఇక మీదట గట్టిగా పట్టు బిగించాల్సి ఉందని చెబుతున్నారు. విజయనగరంలో వైసీపీకి కూడా పట్టు ఉంది. పైగా కోలగట్ల సామాజిక వర్గం కూడా అధికంగా ఉంది. దాంతో మాజీ ఉప సభాపతిగా ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన కోలగట్ల వీరభద్రస్వామి ఈసారి కుమార్తెని గెలిపించుకోవాలని పూర్వ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
బీసీ నినాదం నేపథ్యం :
ఇదిలా ఉంటే టీడీపీ వైసీపీలలో బీసీ నినాదం బలంగా ఉంది. విజయనగరం అసెంబ్లీని తమకు వదిలేయాలని అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న తూర్పు కాపులు కోరుతున్నారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కూటమిలో జనసేన కూడా విజయనగరం సీటుని ఆశిస్తోంది అని చెబుతున్నారు. అయితే అటు అశోక్ కుమార్తెకి ఇటు కోలగట్ల కుమార్తెకు టికెట్ దక్కేందుకే అత్యధిక శాతం అవకాశాలు ఉన్నాయి. దాంతో ఇద్దరు పేరున్న నాయకుల కుమార్తెలు కొంగు బిగించి చేయబోయే రాజకీయ సమరానికి విజయనగరం అసెంబ్లీ వేదిక అవుతుందా అంటే వేచి చూడాల్సిందే.
