Begin typing your search above and press return to search.

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

ఉత్తరాంధ్రలో విజయనగరం, అల్లూరి జిల్లాల జెడ్పీ పీఠాలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. విజయనగరంలో 27 జెడ్పీటీసీ స్థానాలకు 72 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు, కూటమి నేతల కుటుంబ సభ్యులు బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అల్లూరి జిల్లాలో మాత్రం 11.81 శాతం అత్యల్ప పోలింగ్ నమోదైంది. ఈ రెండు జిల్లాల్లో జెడ్పీ పీఠాలు ఎవరికి దక్కుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.

By:  Satya P   |   6 Nov 2026 7:20 AM IST
ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !
X

ఉత్తరాంధ్రాలో రెండు జెడ్పీ పీఠాల మీద అయితే చర్చ సాగుతోంది. ఈ రెండింటిలో వైసీపీ గెలుస్తుందా లేక కూటమి పరం అవుతాయా అన్నదే అంతా చర్చిస్తున్నారు. అందులో ఒకటి వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా అయిన విజయనగరం అయితే రెండవది వైసీపీకి పట్టుకొమ్మ రాజకీయంగా కీలకమైన నమ్మకమైన అల్లూరి జిల్లా. ఈ రెండింట్లో వైసీపీకి ఆశలు ఎంతో కొంత ఉన్నాయని అంటున్నారు. ఒకటి బొత్స బలం చూసుకుని అయితే రెండవది వైసీపీకి ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయి వదలని ప్రాంతం కావడంతో ఇక్కడ పోలింగ్ ఎలా జరిగింది, ఎవరికి చాన్స్ ఉందని బిగ్ డిబేట్ సాగుతోంది.

భారీ పోలింగ్ తోనే :

ఇక విజయనగరం జిల్లాలో చూసుకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు చాలా జోరుగా సాగాయి. విజయనగరంలో మొత్తం 27 జెడ్పీటీసీలు ఉన్నాయి. అలాగే ఈ జిల్లాలో మొత్తం 449 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక పోలింగ్ వద్ద ఎంతో పెద్ద ఎత్తున ఓటర్ల సందడి ఎక్కువగా కనిపించింది. అంతే కాదు 72 శాతం పైగా పోలింగ్ నమోదు అయినట్లుగా నివేదికలు ఉన్నాయి. దీంతో ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం అన్నది మరో చర్చగా ఉంది. ఇక బొత్స తన కోడలు పూజితను గరివిడి నుంచి జెడ్పీటీసీగా నిలబెట్టారు. కుమార్తెను గజపతినగరం నుంచి పోటీ చేయించారు. గుర్ల నుంచి చెల్లెలుని బరిలో ఉంచారు. మిగిలిన సీట్లలో బలమైన అభ్యర్ధులనే ఏరి కోరి పోటీ చేయించారు.

కూటమి కూడా గట్టిగానే :

ఇక కూటమి విషయానికి వస్తే ఏమీ తక్కువ తినలేదు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తన కోడలు సంధ్యను బొత్స కోడలు పోటీ చేసిన గరివిడి నుంచే పోటీ చేయించారు. అలాగే నెల్లిమర్ల నుంచి సీనియర్ నేత కర్రోతు బంగారు రాజు తన కుమార్తెని పోటీ చేయించారు. అలాగే ఇతర టీడీపీ సీనియర్ నేతలు కూడా జడ్పీ చైర్మన్ మీద ఆశలు పెట్టుకున్నారు. అన్నింటికీ మించి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను తన కుమార్తె సిరి సహస్రను తెర్లాం జెడ్పీటీసీగా నిలబెట్టారు. దాంతో అనేక మంది జెడ్పీ పీఠం మీద కన్నేసి ఉన్నారు. ప్రత్యేకించి బొత్స సొంత జిల్లాలో ఆయన రాజకీయ పట్టు గట్టిగా ఉన్న చోట ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది.

అల్లూరి జిల్లాలో ఎవరు :

అదే విధంగా అల్లూరి జిల్లాలో కూడా జెడ్పీ చైర్మన్ రేసులో పోటీ ఎక్కువగానే ఉంది. ఇక్కడ వైసీపీకి రెండు ఎమ్మెల్యేలు అరకు ఎంపీ ఉన్నారు. వైసీపీ పోటీ చేసిన ప్రతీ సారీ ఇక్కడ విజయం సాధిస్తూ వస్తోంది. దాంతో జెడ్పీ పీఠం కూడా ఆ పార్టీ పరం అవుతుంది అని ఆశతో ఉన్నారు. 11 మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. అంటే 11 జెడ్పీటీసీలు అన్న మాట. మొత్తం అన్ని చోట్ల వైసీపీ పోటీ చేస్తోంది. ఇక జనసేనకు ఇక్కడ జెడ్పీ పీఠం ఇస్తారు అని అంటున్నారు. దాంతో పాటు ఎనిమిది దాకా జనసేన పోటీలో ఉంది. దాంతో అల్లూరి జిల్లా పీఠం ఎవరి సొంతం అవుతుంది అన్నది కూడా ఆసక్తిని పెంచుక్తోంది. అల్లూరి జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ అత్యల్పంగా నమోదు అయింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలింగ్‌లో అల్లూరి జిల్లాలోనే అత్యల్పంగా 11.81 శాతం పోలింగ్‌ నమోదైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మరి ఈ తక్కువ పోలింగ్ ఎవరికి జెడ్పీ పీఠం అందిస్తుందో చూడాల్సి ఉంది.