Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ కి ఫస్ట్ టైం జగన్

విశాఖ పర్యటనకు వచ్చిన జగన్ ని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కలిశాయి. విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఆయన హామీని కోరాయి.

By:  Satya P   |   9 Oct 2025 1:23 PM IST
స్టీల్ ప్లాంట్ కి ఫస్ట్ టైం జగన్
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసియా ఖండంలోనే నాణ్యమైన ఉత్పత్తిని సాధించే అతి పెద్ద కర్మాగారం. సాగర తీరంలో ఉన్న ఏకైక ప్లాంట్ కూడా ఇదే. దేశం నుంచి మేలైన స్టీల్ ని ఇక్కడ నుంచే ఉత్పత్తి చేస్తారు, విదేశాలలో విశాఖ స్టీల్ కి ఎంతో గిరాకీ ఉంది. అయితే గత అయిదేళ్ళుగా విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ ప్రైవేటీకరణం అల్లుకుని ఉంది. ప్రైవేట్ కాబోదు అని ఏపీలోని పాలకులు చెబుతారు కానీ కేంద్ర పెద్దలు మాత్రం భరోసా అయితే ఇవ్వరు, 2021 జనవరి 28న ఆర్ధిక మంత్రిత్వ శాఖ కేబినెట్ కమిటీ నూరు శాతం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామని చేసిన తీర్మానాన్ని ఈ రోజుకీ వెనక్కి తీసుకోలేదని కార్మిక సంఘాలు గుర్తు చేస్తూంటాయి. దాని మీద ఏ పార్టీ కూడా మాట్లాడదు, ఏ రాజకీయ నేత కూడా స్పందించరు, కానీ విశాఖ ఉక్కుని కాపాడుతామని గట్టిగా ప్రకటనలు చేస్తూ ఉంటారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

స్టీల్ ప్లాంట్ మీద వైసీపీ :

ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నపుడు వైసీపీ విశాఖ ఉక్కు మీద అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రానికి ప్రధానికి అప్పటి ముఖ్యమంత్రిగా జగన్ లేఖ రాశారు. 2022లో విశాఖ వచ్చిన నరేంద్ర మోడీతో కలసి పాల్గొన్న సభలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అని ఆయన కోరారు. ఇంతకు మించి వైసీపీ అయితే చేసింది ఏమీ లేదు అని అంటారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకుని వెళ్ళి ప్రధాని మోడీకి నేరుగా ఈ విషయం మీద వివరించి గతంలో చేసిన తీర్మానం వెనక్కి తీసుకునేలా చేయడంలో వైసీపీ ఏమీ చేయలేదని అంటారు. అదే విధగా టీడీపీ కూటమి ఇపుడు ఢిల్లీ స్థాయిలో ప్రధాని వద్ద ఈ విషయంలో ఏమీ చేయడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.

ఒక్కటే మాట అంటూ :

విశాఖ పర్యటనకు వచ్చిన జగన్ ని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కలిశాయి. విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఆయన హామీని కోరాయి. ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని కూడా విన్నవించాయి. దాని మీద మాట్లాడిన జగన్ తమ స్టాండ్ ఆనాడూ ఈనాడూ ఒక్కటే అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నపుడు అయినా లేక ప్రతిపక్షంలో ఉన్నపుడు అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ని తాము ప్రైవేట్ పరం కాకుండా తమ హయాంలో పరిరక్షించామని జగన్ చెప్పుకొచ్చారు. తప్పకుండా ప్లాంట్ విషయంలో పోరాటం చేస్తామని కార్మిక సంఘాలకు మద్దతుగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు

తొలిసారి అడుగు పెడతారా :

జగన్ సీఎం గా ఉండగా కానీ అంతకు ముందు కానీ ఎపుడూ స్టీల్ ప్లాంట్ లోకి అడుగు పెట్టిన సందర్భాలు అయితే లేవు. సీఎం గా ఉండగా కూడా ఎయిర్ పోర్టు లాంజ్ లోనే కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. ఇపుడు విపక్షంలో ఉన్నపుడూ అదే జరుగుతోంది. దాంతో తమ ప్లాంట్ ని సందర్శించాలని స్వయంగా అక్కడ పరిస్థితులను తెలుసుకోవాలని కార్మిక సంఘాలు జగన్ ని కోరాయి. దానికి ఆయన అంగీకరిచారు. మరి ఈ సారి పర్యటనలో అది జరుగుతుందా లేక మరో సారి వచ్చినపుడు స్టీల్ ప్లాంట్ కి వెళ్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా జగన్ స్టీల్ ప్లాంట్ కి వెళ్తే కనుక కార్మికుల ఉద్యమానికి మంచి ఊపు వస్తుందని అంటున్నారు. ఆ దిశగా వైసీపీ నేతలే ప్లాన్ చేయాలని కోరుతున్నారు.