Begin typing your search above and press return to search.

సీనియర్ Vs సిన్సియర్... ఆసక్తికరంగా విశాఖ మేయర్ రేసు

ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో విశాఖ మేయర్ పరీక్ష ఎదుర్కొంటున్న వైసీపీ తన అభ్యర్థి వరుదు కల్యాణిపైనే ఆశలు పెట్టుకుంది.

By:  Tupaki Political Desk   |   18 Oct 2026 7:00 PM IST
సీనియర్ Vs సిన్సియర్... ఆసక్తికరంగా విశాఖ మేయర్ రేసు
X

రాష్ట్రంలోని అతిపెద్ద నగరపాలక సంస్థ విశాఖపట్నంలో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఈ మేయర్ సీటును ఎందరో హేమాహేమీలు ఆశించగా, టీడీపీ అధిష్టానం అనూహ్యంగా యువ మహిళా నేతను రంగంలోకి దింపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు అత్యంత కీలకమైన విశాఖ కార్పొరేషన్ పై పట్టుబిగించే ఉద్దేశంతో విపక్షం వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఎవరూ ఊహించని విధంగా విశాఖ నుంచి సీనియర్ నేత వరుదు కల్యాణిని బరిలో దింపింది. ఈ పరిణామంతో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగినా, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణి సీనియార్టీ, నగరవ్యాప్తంగా ఉన్న పరిచయాలు, వాగ్దాటితో గట్టిపోటీ ఇస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో విశాఖ రేసు ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

విశాఖ కార్పొరేషన్ లో దాదాపు 18 లక్షల ఓటర్లు ఉన్నారు. 120 డివిజన్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద నగర పాలక సంస్థగా విశాఖ గుర్తింపు తెచ్చుకుంది. ఇక భౌగోళికంగా, ప్రాంతీయంగా రాజకీయంగా ఉన్న ప్రాధాన్యతలు కూడా విశాఖ సీటును హాట్ హాట్ గా మార్చేశాయి. అదేసమయంలో ప్రత్యక్ష విధానంలో ఎన్నిక జరుగుతుండటం కూడా మేయర్ పదవికి క్రేజ్ పెంచింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య పోటీ ఎలా ఉంటుందనే అంశంపై విస్తృత చర్చలు సాగుతున్నాయి. 1858లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన విశాఖ 1979లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. 1981లో తొలిసారి మేయర్ ఎన్నిక జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు ఆరు సార్లు ఎన్నికలు జరిగితే ఏడుగురు మేయర్లుగా పనిచేశారు. ఇందులో టీడీపీ ఒకసారి డైరెక్టుగా గెలవగా, తాజా మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు గత పాలకవర్గంపై కార్పొరేటర్ల తిరుగుబాటుతో పదవిని దక్కించుకున్నారు. ఇలా 40 ఏళ్ల విశాఖ కార్పొరేషన్ లో కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ అధికారం చెలాయించింది.

బలంగా టీడీపీ

ఇక ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ బలమైన కేడర్ తో బరిలోకి దిగింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందరూ కూటమి నేతలే కావడం గమనార్హం. ఇక విశాఖ ఎంపీ శ్రీభరత్ టీడీపీకి అదనపు బలంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి విజయంపై ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భౌగోళికంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ సీటు కోసం పార్టీలో ఎందరో ప్రయత్నించినా, అధిష్టానం మాత్రం యువత, బీసీ కోటాలో డాక్టర్ ముక్కా శ్రావణికి ఎంపిక చేసింది. లోకల్ లీడర్ కావడం, మంచి విద్యార్హతలు, గతంలో కార్పొరేటర్ గా ఎన్నికైన అనుభవం శ్రావణికి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ఇక్కడ శ్రావణి గెలుపు వ్యక్తిగతంగా ఆమెకు అవసరమే అయినప్పటికీ, ఆమెను గెలిపించాల్సిన అవసరం ఎక్కువగా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకే ఉందని అంటున్నారు. దీంతో శ్రావణి కూడా తన విజయం పట్ల ధీమాగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు, తొలి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నేపథ్యం శ్రావణికి అదనపు బలంగా చెబుతున్నారు.

అభ్యర్థే వైసీపీ బలం

ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో విశాఖ మేయర్ పరీక్ష ఎదుర్కొంటున్న వైసీపీ తన అభ్యర్థి వరుదు కల్యాణిపైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కల్యాణి మంచి వాగ్దాటితో రాజకీయంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. అనుభవం, నగరంలో పరిచయాలు ఆమెకు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ఇక నగరంలో పార్టీకి పెద్ద ఎత్తున ఉన్న కేడర్ తో ఆమె ఎన్నికలను ఎదుర్కునేలా వ్యూహ రచన చేస్తున్నారు. అదేసమయంలో నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ ఓటర్లపైన కల్యాణి ఆశలు పెట్టుకున్నారు. విశాఖ నగరంలో పెద్ద ఎత్తున వలస ఓటర్లు స్థిరపడటం, తన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఓటర్లు ఫలితాన్ని శాసించే స్థితిలో ఉండటం కూడా వైసీపీ అభ్యర్థికి ఉత్సాహం ఇస్తోందని చెబుతున్నారు.

ఇలా రెండు పార్టీల వారు బీసీ మహిళలకు అవకాశం ఇవ్వడంతో మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారిందని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పురోగమిస్తున్న విశాఖలో గెలవడం ద్వారా తమకు తిరుగులేదని సంకేతాలు ఇవ్వాలని కూటమి భావిస్తుండగా, ఎక్కడ కోల్పోయామో అక్కడ నుంచే మళ్లీ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో విశాఖ మేయర్ సీటుపై సర్వశక్తులు ఒడ్డి నెగ్గాలని వైసీపీ భావిస్తోంది. గత ప్రభుత్వంలో పరిపాలనా రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని ప్రచారం చేసిన వైసీపీ ఆ దిశగా తీసుకున్న చర్యలను వివరించేలా ప్రచారం చేయాలని భావిస్తోంది. తమ హయాంలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఏమీ చేయలేదని చెబుతోంది. అయితే వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విశాఖలో ఇప్పటివరకు టీడీపీనే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికల్లో ఎటువంటి ఫలితం వస్తుందనేది ఉత్కంఠ పెంచుతోందని అంటున్నారు.