సినిమా కష్టాలను మించిన విషాదం.. నడిసంద్రంలో ఏడుగురు, తిరిగొచ్చింది ఒక్కడే!
బోటు ప్రమాదంలో చిక్కుకున్న వారిలో చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు మిగిలిన ఆరుగురి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.
By: Tupaki Political Desk | 7 July 2026 1:34 PM ISTవిశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 4న చేపల బోటు బోల్తా పడగా, మొత్తం ఏడుగురు సముద్రంలో మునిగిపోయారు. ఇందులో బోటు డ్రైవర్ కర్రి చిన్న ఓ వాణిజ్య నౌక సిబ్బంది సహకారంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల 4న చిన్న సముద్రంలో పడిపోగా, ప్రాణాల కోసం భీకర పోరాటం చేశాడు. సుదూరంలో ఉన్న పనామా దేశానికి చెందిన నౌకను చూసి ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ క్రమంలోనే బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు కూడా ప్రాణాలు కాపాడుకోడానికి ప్రయత్నించినా, వారు మాత్రం వాణిజ్య నౌకను చేరుకోలేకపోయినట్లు చిన్నా చెబుతున్నాడు. వాణిజ్య నౌక సిబ్బంది రక్షించిన సమాచారాన్ని చిన్న అధికారులకు తెలియజేయడంతో నేవీ హెలికాఫ్టర్ ను పంపి ఎయిర్ లిఫ్ట్ ద్వారా సోమవారం విశాఖ తీసుకువచ్చారు. ఇక మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం ప్రభుత్వం నేవీ సహకారంతో ముమ్మరంగా గాలిస్తోంది.
సోమవారం సాయంత్రం ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారుడు చిన్న బోటు ప్రమాదంపై పూర్తి వివరాలు వెల్లడించాడు. నడిసంద్రంలో ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలు కాపాడుకోడానికి చేసిన పోరాటం అందరికీ కన్నీరు తెప్పిస్తోంది. ఈ నెల 1న చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు మెకనైజ్డ్ బోటులో వెళ్లారు. అల్పపీడన ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో 4వ తేదీన తిరుగు పయనమైనట్లు చిన్న తెలిపాడు. ఇదే విషయాన్ని ఇంటికి తెలియజేశామని, అంతలోనే వాతావరణం మరింత ప్రతికూలంగా మారి తమ బోటు తిరగబడిందని వివరించాడు.
తొలుత ఒకరు కనిపించకపోగా, తనతోపాటు మిగిలిన ఐదుగురు బోల్తా పడిన బోటుపైనే సుమారు ఆరు గంటల పాటు ఉన్నామని, ఏదైనా బోటు వస్తే ప్రాణాలు కాపాడుకుందామని చూశామని కానీ, ఏ బోటు కనిపించకపోవడం, బోటు నీళ్లలో మునిగిపోవడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవాలని భావించామని చిన్న తెలిపాడు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తెప్పల సహాయంతో ఈదుకుంటూ ఒడ్డుకు రావడానికి ప్రాణాలకు తెగించి ప్రయత్నించామని తెలిపాడు. ఈ క్రమంలో కర్రి చిన్నా సుదీర్ఘంగా ఈదుకుంటూ వెళ్లి, సమీపంలో లంగరు వేసి ఉన్న పనామా జెండాతో వాణిజ్య నౌక 'ఎంవీ యూనివర్స్ వెల్తీ'ని చేరుకుని, సహాయం కోసం గట్టిగా అరవడంతో ఆ నౌక సిబ్బంది అతడిని రక్షించినట్లు వివరించాడు.
విస్తృత స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్
బోటు ప్రమాదంలో చిక్కుకున్న వారిలో చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు మిగిలిన ఆరుగురి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. వారు తెప్పల సాయంతో ఎటువైపు అయినా ప్రయాణం చేస్తున్నారా? లేక సముద్రంలో మునిగిపోయారా? అన్న విషయం తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆరుగురి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నాలుగు రోజులుగా కొనసాగిస్తూనే ఉంది. భారత తీర రక్షక దళానికి చెందిన 'ఐసీజీఎస్ కనక్ లతా బరువా', 'ఐసీజీఎస్ వీర' నౌకలు, భారత నౌకాదళానికి చెందిన రెండు యుద్ధనౌకలు నిరంతరం గాలింపులో ఉన్నాయి. అలాగే నౌకాదళం, కోస్ట్ గార్డ్‌కు చెందిన డోర్నియర్ విమానాలు, 'సీ కింగ్' హెలికాప్టర్లు, 'అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్' (ALH)ల ద్వారా సముద్రంపై వైమానిక గాలింపు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ప్రాంతీయ ఆపరేషన్స్ సెంటర్ (ROC) ద్వారా ఎలక్ట్రానిక్ నిఘాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం సముద్రంలో నాలుగు మీటర్ల ఎత్తున అలలు, గంటకు 50 నాటికల్ మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నప్పటికీ, మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను నిరంతరాయంగా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కాగా, సెర్చ్ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని త్వరితగతిన కనిపెట్టాలని, గంగవరం పరిసరాలతో పాటు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపును విస్తృతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
