లోహ విహంగాలతో అనుబంధం.. ఇంతలా ఉంటుందా?!
విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సేవలు అందించే వారు.. ఆయా విమానాశ్రయాలతో పెనవేసుకునే అనుబంధం గురించి ప్రత్యేకంగా ఎవరికీ తెలియకపోవచ్చు.
By: Garuda Media | 18 Aug 2026 12:00 AM ISTవిమానాశ్రయాల్లో ప్రయాణికులకు సేవలు అందించే వారు.. ఆయా విమానాశ్రయాలతో పెనవేసుకునే అనుబంధం గురించి ప్రత్యేకంగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఏ రంగంలో అయినా.. ఆయా రంగాల్లో పనిచేసే సిబ్బంది.. అనుబం ధం పెంచుకుంటారని చెప్పడానికి విశాఖవిమానాశ్రయంతో సిబ్బంది ఏర్పరుచుకున్న అనుబంధమే ఉదాహరణగా నిలుస్తోంది. దాదాపు 40 ఏళ్లపాటు పౌర విమాన సేవలు అందించిన విశాఖ విమానాశ్రయం ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వస్తి పలికింది. ఇక, నుంచి విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
దీంతో విశాఖ విమానాశ్రయ సిబ్బందిని 80 శాతంమేరకు కుదించారు. ఈ నేపథ్యంలో వారికి సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. యూనిఫాంలో వచ్చిన మహిళా సిబ్బంది.. ఇక, తమ కు విమానాశ్రయానికి బంధం తెగిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక.. కంట తడి పెట్టి బోరున విలపించారు. దాదాపు 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య తమకు ఈ విమానాశ్రయానికి మధ్య బంధం ఉందని వారు చెప్పారు. తమ ఉద్యోగాలు పోతున్నాయన్న ఆవేదన కంటే.. విమానాశ్రయంతో అనుబంధం తెగిపోతోందన్న ఆవేదనను వారు వ్యక్తం చేశారు.
భోగాపురంలో..
మరోవైపు కొత్తగా నిర్మించిన భోగాపురంలోనిఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలో కార్యకలాపాలు.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత నుంచి ప్రారంభమయ్యాయి. సింగపూర్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అయింది. అయితే.. విశాఖలో పనిచేస్తున్న సిబ్బందిని ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ కాంట్రాక్టు సంస్థ కొత్తగా నియమించుకుంది. ఇది కూడా విశాఖ విమానాశ్రయంలో పనిచేసిన సిబ్బందిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. విమానాశ్రయంలో పనిచేసేవారిని నియమించుకునేందుకు.. కాంట్రాక్టు సంస్థకు బాధ్యతలు అప్పగించారు.
దీనికి తోడు నిబంధనలు కూడా మార్చడంతో విశాఖ విమానాశ్రయంలో పనిచేసిన మహిళా సిబ్బంది ఆ నిబంధనలను అందుకోలేకపోయారు. అయితే.. ప్రత్యామ్నాయం చూపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక, భోగాపురంలో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు.. రాకపోకలు ప్రారంభించనున్నాయి.
