Begin typing your search above and press return to search.

ఇక సెలవు.. ఎయిర్ పోర్ట్ ఎమోషన్

విశాఖ వాసులకు దశాబ్దాలుగా సేవలు అందించిన ఎయిర్ పోర్టు క్లోజ్ అయింది. ఆగస్టు 16 తో విశాఖ ఎయిర్ పోర్టు పౌర విమానయాన సేవలు పూర్తిగా బంద్ అయినట్లే.

By:  Satya P   |   16 Aug 2026 11:31 PM IST
ఇక సెలవు.. ఎయిర్ పోర్ట్ ఎమోషన్
X

విశాఖ వాసులకు దశాబ్దాలుగా సేవలు అందించిన ఎయిర్ పోర్టు క్లోజ్ అయింది. ఆగస్టు 16 తో విశాఖ ఎయిర్ పోర్టు పౌర విమానయాన సేవలు పూర్తిగా బంద్ అయినట్లే. ఆగస్టు 17 నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయి. దాంతో విశాఖ ఎయిర్ పోర్టు బోసి పోయినట్లే.అయింది. అదే సమయంలో అక్కడ నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ కానీ ప్రత్యేక ట్రాఫిక్ సిగ్నల్స్ కి కానీ అవసరం పడదని అంటున్నారు. ఎన్నో ఎమోషన్స్ ని మూటగట్టుకున్న ఎయిర్ పోర్టు పౌర సేవలకు సంబంధించి ఇక సెలవు పలికినట్లే.

రాజీవ్ చివరి సారిగా :

ఈ ఎయిర్ పోర్టు ఎంతో మందిని తీసుకుని వచ్చింది. అలాగే విశాఖ నుంచి ఎంతో మందిని ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళింది. 1991 మే 20న అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని విశాఖలో ఎన్నికల ప్రచారం ముగించుకుని చెన్నై బయలుదేరి వెళ్ళినపుడు విశాఖ ఎయిర్ పోర్టు నుంచే ఆయన వెళ్ళారు. ఆయనకు అదే చివరి ప్రయాణం కూడా అయింది. శ్రీ పెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దళం దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అది ఒక చేదు జ్ఞాపకం లాంటిదే. ఇక విశాఖ ఎయిర్ పోర్టు నుంచి వీవీఐపీలు ఎంతో మంది వచ్చారు, వెళ్ళారు. అవనీ చరిత్ర పుటలలోకి గురుతులు కాబోతున్నాయి.

నేవీ ఆధ్వర్యంలో :

ఇదిలా ఉంటే గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో మంది వీవీఐపీలు, ప్రముఖులు, సాధారణ ప్రయాణికులకు సేవలు అందించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఐఎన్ఎస్ డెగా ఇక పౌర విమాన సర్వీసులను పూర్తిగా ముగించినట్లే అని అంటున్నారు. విశాఖ ఎయిర్ పోర్టుని డొమెస్టిక్ సేవలకు కొనసాగించాలని విజ్ఞప్తులు ఎన్ని చేసినా అది జరిగే పని కాదని తేలిపోయింది. దాంతో ఇక ఈ విమానాశ్రయం అన్నది గతం కాబోతోంది. నిజానికి చూస్తే నాలుగున్నర దశాబ్దాలకు పైగా విశాఖ ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు ప్రధాన విమానయాన కేంద్రంగా ఇప్పటిదాకా ఉండేది. ఇదే ఎయిర్ పోర్టు ద్వారా ఎంతో మంది రాష్ట్ర జాతీయ స్థాయి వీవీఐపీలు రాజకీయ నాయకులు రాకపోకలు సాగించారు. విశాఖ నగరంలోనే ఈ ఎయిర్ పోర్టు ఉండడంతో ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేది అన్న మాట ఉంది.

కోడ్ మారుతోంది :

ఇక విశాఖ ఎయిర్ పోర్టు క్లోజ్ కావడం పౌర విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విశాఖ ఎయిర్‌పోర్ట్ ఇకపై పూర్తిగా ఇండియన్ నేవీ రక్షణ అవసరాల కోసం మాత్రమే పనిచేస్తుంది. మరో వైపు కొత్త విమానాశ్రయం అయిన భోగాపురం ఈ నెల 17 నుంచి అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలను ఆపరేట్ చేయనుంది. దాంతో కోడ్ కూడా మారుతోంది. ఇప్పటిదాకా విశాఖ ఎయిర్‌పోర్ట్ వాడిన వీఐజెడ్ భోగాపురంకి కేటాయిస్తారు. అయిదు వేల కోట్ల రూపాయలతో కట్టిన భోగాపురం ఎయిర్ పోర్టు నాలుగు కోట్ల మంది ప్రయాణీకులకు సరిపడ సామర్థ్యం కలిగినది, భవిష్యత్తు అవసరాల కోసం దీనిని ఏర్పాటు చేశారు. అయితే విశాఖ వాసులు మాత్రం తమ ఎమోషన్స్ అన్నీ పాత ఎయిర్ పోర్టు తోనే ముడిపడి ఉన్నాయని అంటున్నారు. కానీ ప్రగతి రధం ముందుకు సాగాలంటే పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిందే కదా అన్నదే అంతా అంటున్న మాట.