వివేకా హత్య కేసులో సునీత కీలక పిటిషన్
వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తే సంబంధిత ట్రయల్ కోర్టులో పిటిషన్ దాకలు చేసుకోవాలని సునీతారెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సూచన చేసిన నేపథ్యంలో ఆమె తాజాగా సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
By: Garuda Media | 23 Oct 2025 12:28 PM ISTపెను సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆయన కుమార్తె నాంపల్లి కోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. ఇందులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. తదుపరి దర్యాప్తు చేట్టేలా సీబీఐకు కోర్టు ఆదేశాలు జారీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తే సంబంధిత ట్రయల్ కోర్టులో పిటిషన్ దాకలు చేసుకోవాలని సునీతారెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సూచన చేసిన నేపథ్యంలో ఆమె తాజాగా సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగకపోతే.. అసలు వ్యక్తులు తప్పించుకునే అవకాశం ఉందని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే తండ్రిని కోల్పోయిన తనకు మరింత అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేయాలని సీబీఐను ఆమె కోరారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిగితేనే.. ఇప్పటివరకు వెలుగు చూడని అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంతకూ ఆమె తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్న అంశాల్లో కీలకమైనది.. వివేకా హత్య కేసులో స్టేట్ మెంట్ ఇచ్చిన రిటైర్డు ఐఏఎస్ అజేయ కల్లం అంశాన్ని ప్రస్తావించారు.
వివేకా హత్యకేసుకు సంబంధించి అజేయ కల్లం సీఆర్పీసీ 161 కింద గతంలో సీబీఐ ఎదుట హాజరై స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన వైసీపీ అధినేత జగన్ కు.. ఆయన పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో సాయం చేసినట్లుగా పేర్కొని.. దీనికి సంబంధించిన సమావేశాలు హైదరాబాద్ లోని జగన్ నివాసంలో జరిగినట్లుగా వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున జగన్ నివాసంలో తెల్లవారుజాము ఐదు గంటల ప్రాంతంలో సమావేశం జరుగుతుందని.. తెల్లవారుజామున 5.30 గంటల వేళలో తాను జగన్ తో సమావేశంలో ఉండగా.. అటెండర్ వచ్చి అమ్మ (వైఎస్ భారతి) పిలుస్తున్నట్లుగా చెప్పటంతో.. జగన్ వెల్లడినట్లుగా అజేయ కల్లం స్టేట్ మెంట్ ఇచ్చారంటూ పిటిషన్ లో ప్రస్తావించారు.
‘‘పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన జగన్.. చిన్నాన్న ఇక లేరని చెప్పారు. దీంతో మేమంతా షాక్ కు గురయ్యాం’ అని స్టేట్ మెంట్ ఇచ్చారు. వివేకా చనిపోయినట్లుగా ఫోన్ కాల్ చేసిందెవరు? ఫోన్ కాల్ సారాంశం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ అంశంలో వైఎస్ భారతి పేరు పరోక్షంగా వచ్చినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పిటిషన్ లో వివేకా హత్యకేసులో ఐదో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యరెడ్డి కడప జైల్లో ఏ4గా ఉన్న దస్తగిరి (అప్రూవర్) కలిసి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొన్నారు. మరి.. ఈ పిటిషన్ పై నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఏ రీతిలో స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
