Begin typing your search above and press return to search.

తమిళ రాజకీయాలను ఊపేస్తున్న ముగ్గురు రెడ్లు? ఎవరు ఆ ముగ్గురు?!

తమిళనాడులో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో అనూహ్యంగా ముగ్గురు తెలుగువారి పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Political Desk   |   8 Sept 2026 3:00 PM IST
తమిళ రాజకీయాలను ఊపేస్తున్న ముగ్గురు రెడ్లు? ఎవరు ఆ ముగ్గురు?!
X

తమిళ రాజకీయాలను ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఊపేస్తోంది. ఏపీకి చెందిన ముగ్గురు రెడ్లు తమిళనాడు ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలు పెను దుమారానికి దారితీశాయి. తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన ఆ ముగ్గురు ఎవరు? అంటూ నెటిజన్లు ఇంటర్నెట్ లో గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి నీడలా ఉంటున్న విష్ణురెడ్డి, ఆయన బావమరిది సుజయ్ రెడ్డి, ఈయన స్నేహితుడు అనిల్ రెడ్డి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, గనుల శాఖను గుప్పెట్లో పెట్టుకున్నారని ఉదయనిధి ఆరోపించారు.

తమిళనాడులో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో అనూహ్యంగా ముగ్గురు తెలుగువారి పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రాంతీయ భావజాలం ఎక్కువగా ఉండే తమిళనాడులో తెలుగు వ్యాపారులు తెరవెనుక రాజకీయం నడిపేటంత స్థాయికి వెళ్లారా? అన్న చర్చ ఆసక్తి రేపుతోంది. ప్రతిపక్ష నేత బహిరంగంగా విమర్శలు చేయడంతో ఆ ముగ్గురు రెడ్లు ఎవరు? వారి స్వస్థలాలు ఎక్కడ అన్న చర్చ మరింత కుతూహలం కలిగిస్తోందని అంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో విష్ణురెడ్డి ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు.

ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన విష్ణు రెడ్డి అలియాస్ విష్ణువర్ధన్ రెడ్డి చెన్నైలో స్థిరపడినట్లు చెబుతున్నారు. అక్కడ గ్రానైట్ వ్యాపారం చేయడంతోపాటు దళపతి విజయ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ తో స్నేహం పెరిగిందని, ఆయన పార్టీ పెట్టిన తర్వాత టీవీకే వ్యవహారాలను సైతం విష్ణురెడ్డి పర్యవేక్షించేవారని చెబుతున్నారు. ఇక ఈయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువుగా చెబుతున్నారు. విష్ణురెడ్డితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఇద్దరిదీ ఏపీనే అని అంటున్నారు.

విష్ణురెడ్డి బావమరిది సుజయ్ రెడ్డి, ఈయన స్నేహితుడు అనిల్ రెడ్డి కూడా ప్రస్తుతం టీవీకే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ కి ఈ ముగ్గురు రెడ్లు షాడోగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన కుమారుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి గత ప్రభుత్వంలో తీవ్ర అవినీతి చేశారని సీఎం విజయ్ ఆరోపించారు. దీనిపై సభలోనే మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదంటూ ఆరోపణలు చేసిన ఉదయనిధి సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ స్నేహితులైన ముగ్గురు రెడ్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ తమిళ రాజకీయాలను వేడెక్కిస్తోందని అంటున్నారు.