వైసీపీకి డిపాజిట్లు గల్లంతు...జోస్యం ఎవరిది ?
వైసీపీ ఏపీలో బలమైన రాజకీయ పార్టీగా ఉంది. 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు షేర్ ని కలిగి ఉంది.
By: Satya P | 29 Sept 2026 8:00 AM ISTవైసీపీ ఏపీలో బలమైన రాజకీయ పార్టీగా ఉంది. 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు షేర్ ని కలిగి ఉంది. వైసీపీ ఇప్పటిదాకా పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ ఓటమి చెంది ఉండొచ్చు కానీ డిపాజిట్లు పోయిన రాజకీయ విషాదం అయితే లేదు. కానీ తొలిసారి వైసీపీకి ఆ ముచ్చట కూడా తీరిపోతుందని జోస్యం అయితే చెబుతున్నారు బీజేపీ రాజు గారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వైసీపీ మీద తాజాగా ఘాటు విమర్శలే చేశారు. వైసీపీకి విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో చేదు ఫలితాలే వస్తాయని అన్నారు. వైసీపీ 2019 నుంచి 2024 దాకా చేసిన అరాచక పాలనను జనాలు ఇంకా మరచిపోలేదని ఆయన ఫైర్ అయ్యారు.
మొత్తం సీట్లు మావే :
జీవీఎంసీ పరిధిలో ఉన్న 120 వార్డులలో మొత్తానికి మొత్తం టీడీపీ కూటమి గెలుచుకుంటుందని విష్ణు కుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు. మేయర్ సీటుని బంపర్ మెజారిటీతో గెలుస్తామని అన్నారు. నిజానికి 2024 ఎన్నికల్లో విశాఖ పరిధిలో మొత్తం ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కూటమి గెలవడంతోనే వైసీపీ నామ రూపాలు లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ఇపుడు మళ్ళీ పోటీకి వైసీపీ నేతలు తమ పార్టీ వారిని ఒత్తిడి పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ఎవరు ఒత్తిడి పెట్టినా పోటీకి దిగే వారు వాస్తవ పరిస్థితులు ప్రజల ఆలోచనలను అర్ధం చేసుకుని ఆలోచిస్తే మంచిందని ఆయన సూచించారు. లేకపోతే వారు ఇబ్బందులు పడతారని అన్నారు. ఓటమి ఎటూ జరుగుతుందని దాంతో పాటు ఆర్ధికంగా కూడా నష్టపోతారనే తాను ఈ విధంగా చెబుతున్నాను అని ఆయన అన్నారు.
నామినేషన్లు వేయనీయలేదు :
ఇదిలా ఉంటే 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుందని రాజు విమర్శించారు. ఎక్కడా ప్రచారం చేసుకో నీయకుండా ప్రజల వద్దకు వెళ్లకుండా కట్టడి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయినా సరే తాను ప్రాతినిధ్యం వహించిన ఉత్తరం నియోజకవర్గంలో ఒక వార్డుని బీజేపీ ఆనాడు గెలుచుకుందని ఆయన చెప్పారు. అప్పట్లో తమ నియోజకవర్గంలో 18 వార్డులు ఉంటే అందులో 16 వైసీపీ గెలిచిందని ఇపుడు ఆ బలాన్ని చూసుకుని బరిలోకి దిగాలనుకుంటే అది వాపుగానే మిగులుతుందని వైసీపీ నేతలకు ఆయన హెచ్చరించారు. ఈసారి 20 వార్డులుగా తన నియోజకవర్గంలో పెరిగాయని మొత్తం సీట్లను కూటమే అక్కడ గెలిచి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీకి ఇబ్బందే :
వైసీపీ అయితే విశాఖ కార్పోరేషన్ లో తమ బలాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. తాము గెలిచినా లేక ఓడినా తమ సత్తా ఏమిటో చూపించాలని భావిస్తోంది. అలాంటిది డిపాజిట్లు కూడా వైసీపీకి రావని కూటమి నేతలు చెప్పడం చర్చకు తావిస్తోంది. ఒక డివిజన్ లో పదిహేను నుంది ఇరవై వేల దాకా ఓట్లు ఉంటాయి. ఇందులో మూడు పార్టీలు కలసి 15 వేల ఓట్లు తీసుకున్నా నిన్నటిదాకా ఆ వార్డుని ఏలిన సిట్టింగ్ కార్పోరేటర్ కి వైసీపీ అభ్యర్ధికి అయిదు వేల ఓట్లు కూడా రావా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ అభ్యర్ధులకు డిపాజిట్ దక్కాలంటే పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 16.66 శాతం ఓట్లు రావాలి. అంటే ఒక వార్డులో 16 వేలు ఓట్లు పోల్ అయితే అందులో 2,800 ఓట్లు కూడా రావా అన్న చర్చ సాగుతోంది. అదే కనుక జరిగితే వైసీపీ గ్రౌండ్ లెవెల్ లో పూర్తిగా చతికిలపడడమే కాదు ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
