గూగుల్ మీద కూటమి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఐటీ ఫీల్డ్ మీద అవగాహన ఉన్న వారికి ఒక విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఒక డేటా సెంటర్ లో ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయన్నది.
By: Satya P | 19 Oct 2025 9:07 AM ISTఐటీ ఫీల్డ్ మీద అవగాహన ఉన్న వారికి ఒక విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఒక డేటా సెంటర్ లో ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయన్నది. అయితే లక్షా 88 వేల ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అలా కాదు అని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. అయితే టీడీపీ నుంచే ఎక్కువగా ఈ అంశం మీద సానుకూలంగా స్పందనలు సంబరాలు అన్నవి జరుగుతున్నాయి అదే సమయంలో కూటమి మిత్ర పక్షాలు మాత్రం మౌనంగానే ఉంటున్నాయి. కానీ ఉన్నట్టుండి బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పెద్ద బాంబే వేశారు.
లక్ష అవాస్తవం :
విశాఖలో ఏర్పాటు కాబోతున్న గూగుల్ సెంటర్ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయన్నది అవాస్తవం విష్ణు కుమార్ రాజు తాజాగా ప్రకటించడమే ఇపుడు సర్వత్రా చర్చగా ఉంది. విశాఖలో భారీ ఎత్తున గూగుల్ పెట్టుబడులు పెడుతోంది. ఏకంగా లక్ష 33 వేల కోట్ల పెట్టుబడులు అంటే మాటలు కాదు, అదే స్థాయిలో ఉద్యోగాలు కూడా అంతా ఆశిస్తారు అని అంటున్నారు. ఒక కోటికి ఒక ఉద్యోగం అయినా రాకపోతుందా అన్నది కూడా ఉంది. కానీ లక్ష ఉద్యోగాలు అయితే రావు అని విష్ణు కుమార్ రాజు మొదటికే కొట్టి పారేస్తున్నారు.
కాల్ సెంటర్ కాదంటూ :
గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయంటే అనుమానాలు ఉన్నాయని విష్ణు కుమార్ రాజు అంటున్నారు. అంతే కాదు గూగుల్ డేటా సెంటర్ కాల్ సెంటర్ కాదు అని ఆయన చెప్పడం విశేషం. ఇక ప్రత్యక్షంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావని అంటున్నారు. అయితే ఇక్కడ ఉద్యోగాలు అన్నవి పెద్ద సమస్య కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే విష్ణు కుమార్ రాజు ఈ రకమైన ప్రకటన చేయడంతో కూటమి ప్రభుత్వం ఇరుకున పడినట్లు అయింది. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ ని విశాఖకు తెచ్చామని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే గూగుల్ డేటా సెంటర్ తన సమాచారాన్ని స్టోర్ చేసే కేంద్రం మాత్రమే అని విష్ణు కుమార్ రాజు లాంటి వారు వివరిస్తున్నారు. పైగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే కనుక గూగుల్ డేటా విషయంలో వైసీపీ చెబుతున్న మాటలకు కూటమి మిత్రుడే మద్దతుగా నిలుస్తున్నారా అన్న చర్చ మొదలైంది.
ఉచిత బస్సు మీద :
అంతే కాదు ఆయన ఉచిత బస్సు మీద కూడా విమర్శలు చేశారు. దీని వల్ల బస్సులలో మహిళల డామినేషన్ ఎక్కువ అయిందని మగవారిని బస్సుల నుంచి లాగి దించేస్తున్నారని ఇది ఇబ్బందిగా ఉందని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్న సూపర్ సిక్స్ పథకాల అమలులో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని విష్ణు కుమార్ రాజు చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
