విశాఖ జడ్పీ కాదది...భీమిలీ జడ్పీ !
అవును విశాఖ జిల్లా పరిషత్తు అతి చిన్నగా మారి చిన్నబోయిన సంగతి తెలిసిందే. మొత్తం 39 మండలాలతో అతి పెద్దదిగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్తు ఈ నెల 24వ తేదీతో తన రూపు రేఖలను పూర్తిగా మార్చేసుకుంటుంది.
By: Satya P | 22 Sept 2026 9:25 AM ISTఅవును విశాఖ జిల్లా పరిషత్తు అతి చిన్నగా మారి చిన్నబోయిన సంగతి తెలిసిందే. మొత్తం 39 మండలాలతో అతి పెద్దదిగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్తు ఈ నెల 24వ తేదీతో తన రూపు రేఖలను పూర్తిగా మార్చేసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లా పరిషత్తుని విభజించింది. ఆ రోజు నుంచి అది అమలులోకి వస్తుంది. దాంతో 24 మండలాలతో అనకాపల్లి జిల్లా పరిషత్తు పెద్దదిగా ఉండనుంది. 11 మండలాలతో అల్లూరి జిల్లా పరిషత్తు రెండవదిగా ఉంటుంది. ఇక కేవలం నాలుగు మండలాలతో విశాఖ జిల్లా పరిషత్తు ఆవిర్భవించనుంది. ఇంత చిన్న జెడ్పీ ఉండడం ఏపీలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా ఉండే చాన్స్ లేదని అంటున్నారు. మరో తమాషా ఏంటి అంటే విశాఖ కార్పోరేషన్ ఏపీలోనే అతి పెద్దది అయితే ఆ పక్కనే జిల్లా పరిషత్తు చిన్నదిగా ఉంటూ రికార్డు క్రియేట్ చేస్తోంది.
భీమిలీ నుంచే చైర్మన్ :
ఇక విశాఖ జిల్లా పరిషత్తులో ఉండే నాలుగు మండలాలలో మూడు భీమిలీ నుంచే వస్తున్నాయి. దాంతో కొత్త చైర్మన్ భీమిలీ నుంచి రానున్నారు అని అంటున్నారు. భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం ఈ మండలాలు అయితే పెందుర్తి మండలం మరొకటి జత చేరనుంది. ఇలా విశాఖ జిల్లా పరిషత్తు స్వరూపం మారనుంది. దాంతో ఉండే నలుగురు జెడ్పీటీల నుంచే వైఎస్ చైర్మన్ గా ఒకరు ఎన్నిక అయితే ముగ్గురు సభ్యులతోనే జిల్లా పరిషత్తు నడవనుంది అన్న మాట. ఇక జెడ్పీ చైర్మన్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. దాంతో భీమిలీ నియోజకవర్గానికి చెందిన మూడు మండలాల నుంచే పోటీ పడుతున్నారు. అందులో కొంతమంది ఎవరికి జెడ్పీ పొత్తులో ఖరారు అవుతుందో అని అంచనా వేసుకుంటూ అపుడే పార్టీలు మారే కార్యక్రమం మొదలెట్టేశారు అని అంటున్నారు.
బీజేపీలో చేరికలు :
ఇక నిన్నటిదాకా పద్మనాభం మండలం ఎంపీపీగా పనిచేసిన ఒక రాజు గారు తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి మారిపోయారు. ఈసారి ఆయన జిల్లా పరిషత్తు చైర్మన్ గా పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతోంది. విశాఖ మేయర్ సీటు ఆశిస్తున్న బీజేపీకి జిల్లా పరిషత్తు చైర్మన్ పీఠం ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. దాంతో టీడీపీకి చెందిన నేతలే బీజేపీలోకి మారి ఆ పీఠం అందుకోవాలని చూడడమే అసలైన రాజకీయంగా చెబుతున్నారు. మరో వైపు అనకాపల్లి జెడ్పీ పీఠం బీజేపీ కోరుతోంది అని అంటున్నారు. ఎందుకంటే పెద్ద జడ్పీ కావడంతో పాటు నిధులు కూడా అధికంగా ఉంటాయని పైగా రూర్ల జిల్లాలో రాజకీయ పట్టు సాధించవచ్చు అని ఆలోచిస్తోంది అంటున్నారు.
ఏజెన్సీలో జనసేనగా :
అదే విధంగా మూడవ జెడ్పీ పీఠం అల్లూరి జిల్లాలో ఉండబోతోంది. ఈ జడ్పీ పీఠాన్ని జనసేనకు కేటాయించే చాన్స్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. జనసేన కూడా ఏజెన్సీలో తన రాజకీయ కార్యకలాపాలను ఇటీవల కాలంలో ఎక్కువగా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అరకు పాడేరు ఎమ్మెల్యేలతో పాటు అరకు ఎంపీ సీటుకు పోటీ పడాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక్కడ వైసీపీకి కూడా రాజకీయంగా పట్టు ఉందని అంటున్నారు. దాంతో జనసేన వర్సెస్ వైసీపీగా అల్లూరి జెడ్పీ రాజకీయం సాగుతుందని అంటున్నారు. ఇక విశాఖ మేయర్ తో పాటు అనకాపల్లి జెడ్పీ పీఠాన్ని టీడీపీ తీసుకుంటుందని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.
