Begin typing your search above and press return to search.

హోటల్ గదిలో మిస్టరీ డెత్.. హైదరాబాద్ లో విశాఖ యువతి విషాదాంతం

హైదరాబాద్ నగరంలో విశాఖకు చెందిన యువతి మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   22 Sept 2026 1:36 PM IST
హోటల్ గదిలో మిస్టరీ డెత్.. హైదరాబాద్ లో విశాఖ యువతి విషాదాంతం
X

హైదరాబాద్ నగరంలో విశాఖకు చెందిన యువతి మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లిన యువతి హోటల్ లో దిగిన ఒక్క రోజు వ్యవధిలోనే విగతజీవిగా మారడం సంచలనంగా మారింది. అపస్మారకస్థితిలో ఉన్న యువతిని ఆస్పత్రికి తీసుకువెళ్లిన యువకుడు.. ఆమె మరణించిందని తెలుసుకుని వెంటనే పరార్ అయ్యాడు. ముందుగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన యువకుడు, ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించినట్లు చెబుతున్నారు. దీంతో హోటల్ గదిలో ఏం జరిగిందనేది మిస్టరీగా మారిందని అంటున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగారు.

హైదరాబాద్ నగరంలో విశాఖపట్నం నగరానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో మరణించిందనే సమాచారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన నిఖితా టోప్నో హోటల్ గదిలో దిగింది. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిద్దిఖీ నగర్, రోడ్ నంబర్-5లో ఉన్న ఓయో హోటల్‌లో సోమవారం ఇద్దరు గది అద్దెకు తీసుకోగా, మంగళవారం ఉదయం యువతి అపస్మారకస్థితికి చేరుకుందని శ్రీనివాసరవితేజ హోటల్ సిబ్బందికి తెలియజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా హోటల్ సిబ్బంది సహాయంతో కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి శ్రీనివాస రవితేజే స్వయంగా తరలించినట్లు గుర్తించారు. అయితే, చికిత్స నిమిత్తం యువతిని ఆస్పత్రికి తీసుకువచ్చిన రవితేజ, ఆమె అప్పటికే మరణించిందని తెలుసుకుని పరార్ అవడం అనుమానాలకు తావిస్తోంది.

యువతి మృతిపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి, ఆపై సంఘటనా స్థలమైన హోటల్‌కు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా, యువతి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, వారు బస చేసిన హోటల్ గది గోడలపై, బెడ్ షీట్లపై రక్తపు మరకలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో యువతిపై దాడి చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి గదిలోని వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. గదిలో యువతితోపాటు శ్రీనివాసరవితేజ మాత్రమే ఉండటంతో ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియడం లేదని చెబుతున్నారు. గదిలో మూడో వ్యక్తి ఎవరైనా ప్రవేశించారా? లేక ఇంకేమైనా జరిగిందా? అనే అనుమానంతో హోటల్ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

యువతి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే పరార్ అయిన ప్రియుడు శ్రీనివాస రవి తేజ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా శ్రీనివాస రవితేజనే నిందితుడిగా అనుమానిస్తున్నారు. యువతి మరణించిందన్న విషయం తెలిసిన వెంటనే అతడు పరార్ అవడంతో ఆచూకీ తెలుసుకునేందుకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లోకేషన్ గుర్తించాలని ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లిన నిందితుడు రైల్వేస్టేషన్ సమీపంలో ఫోన్ స్విచాఫ్ చేసినట్లు సిగ్నల్స్ చూపుతున్నాయని సమాచారం. దీంతో నిందితుడిని గాలించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. యువతికి ఆ గాయాలు ఎలా అయ్యాయి? హోటల్ గదిలో అసలు ఏం జరిగింది? వీరిద్దరి మధ్య ఏం గొడవ జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వస్తేనే యువతి మరణానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.