ట్రాకర్ పెట్టి అనుమానించాడు.. టెకీ గాయత్రి మరణం వేళ.. తల్లిదండ్రుల షాకింగ్ ఆరోపణ
సంచలనంగా మారిన విశాఖ టెకీ గాయత్రి అనుమానాస్పద మృతి వెనుక ఉన్న కారణాలేంటి? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
By: Garuda Media | 19 Jun 2026 12:55 PM ISTసంచలనంగా మారిన విశాఖ టెకీ గాయత్రి అనుమానాస్పద మృతి వెనుక ఉన్న కారణాలేంటి? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి వెళ్లిన మొదటి ట్రిప్.. ఆమెను తిరిగిరాని లోకాలకు వెళ్లేలా చేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని ప్రఖ్యాత పర్యాటక స్థలమైన ముస్సోరిలోని ఒక హోం స్టేలో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. బాత్రూంలో శరీరంపై ఎలాంటి బట్టలు లేకుండా.. రక్తం మడుగులో పడి ఉన్న వైనం పలు అనుమానాలకు తావిచ్చేలా మారింది.మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఉత్తరాఖండ్ పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. విశాఖకు చెందిన 27 ఏళ్ల రాధా గాయత్రి గుర్ గావ్ లోని ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ఆమెకు విశాఖపట్నానికి చెందిన శ్రీచరణ్ తో గత ఏడాది నవంబరులో వివాహం జరిగింది. అతను ఫూణెలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తుంటాడు. పెళ్లైన తర్వాత తొలి విహార ట్రిప్ లో భాగంగా ఈ నెల 13న శనివారం ఢిల్లీ నుంచి రిషికేష్కు వెళ్లి.. తర్వాతి రోజు ముస్సోరి సమీపంలోని తిప్రిధార్ లోని కియానా హోం స్టేలో బస చేశారు.
పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం వారు రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో తమ హోంస్టేలోకి వెళ్లారు. భర్త వెల్లడిస్తున్న వివరాల ప్రకారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో తాను నిద్రపోయానని.. ఉదయం నిద్ర లేచే సమయానికి గాయత్రి ఒంటిపై బట్టలు లేకుండా.. నేలపై రక్తం మడుగులో కనిపించిందని.. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లుగా చెబుతున్నారు.
గాయత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. అర్జెంట్ గా రావాలంటూ ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు. వారు వచ్చేసరికి గాయత్రి పోస్టుమార్టం జరుగుతోంది. ఘటనా స్థలంలోనే గాయత్రి మరణించినట్లుగా పోలీసులు నిర్దారించారు. బెడ్ షీట్ మీద రక్తం మరకలతో పాటు.. గదిలో ఉన్న రెండు మద్యం బాటిళ్లను.. ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. డెహ్రాడూన్ లోని ఒక ఆసుపత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా.. పుట్టెడు శోకంతో గాయత్రి తల్లిదండ్రులు తాజా విశాఖ సీపీని కలిశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
గాయత్రి మరణం కచ్ఛితంగా ఆమె భర్తదే అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. శ్రీచరణ్ కు భార్యపై విపరీతమైన అనుమానం ఉండేదని.. గతంలో వారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు.. ఆమె ల్యాప్ టాప్ బ్యాగ్ లో ట్రాకర్ ను ఉంచినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని కొంతకాలం తర్వాత గుర్తించిన గాయత్రి.. భర్తను నిలదీసినట్లుగా పోలీసులకు తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న సమయంలో గాయత్రి కోసం ఎవరెవరు ఇంటికి వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం వాచ్ మేన్ సాయంతో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ను శ్రీచరణ్ నిరంతరం గమనిస్తూ ఉండేవాడని పేర్కొన్నారు.
పెళ్లైన కొంతకాలం తర్వాత గురుగావ్ కు మారిన తర్వాత కూడా ఆమెను నిత్యం వేధిస్తూ ఉండేవాడని పేర్కొంటూ.. ఆఫీసుకు వెళ్లే సమయంలో నిరంతరం వీడియోకాల్స్ చేయాలని.. చుట్టుపక్కల చూపించాలని ఒత్తిడి తెచ్చేవాడని పేర్కొన్నారు. ఇంతటి అనుమానం ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఎందుకు ఇలా టార్చర్ పెట్టాలి? అని ప్రశ్నిస్తున్నారు. గాయత్రి కోలీగ్స్ గురించి పదే పదే ప్రశ్నలు వేయటంతో పాటు.. వివాహేతర సంబందాలు అంటగడుతూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు మద్యం తాగే అలవాటు లేదని గాయత్రి తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. కేవలం అనుమానంతోనే తమ కుమార్తెను శ్రీచరణ్ హత్య చేసి ఉంటాడన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని వారు కోరుకుంటున్నారు. పోలీసులు పక్కాగా విచారణ జరిపి..తమ కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
