విద్యార్ధి గ్యాంగ్ వార్ : ప్రేమ యుద్ధమా...గంజాయి ప్రభావమా ?
విశాఖలో విద్యార్ధులు రెచ్చిపోయారు. రెండు గ్యాంగులుగా విడిపోయి ఒకరి పై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు.
By: Satya P | 22 Aug 2026 8:44 PM ISTవిశాఖలో విద్యార్ధులు రెచ్చిపోయారు. రెండు గ్యాంగులుగా విడిపోయి ఒకరి పై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ గ్యాంగ్ వార్ విశాఖ జాతీయ రహదారి మీద ఏకంగా అర గంట పాటు సాగడం విశేషం. మద్యం మత్తుతో పాటు ప్రేమ మత్తులోనే విద్యార్ధి గ్యాంగులు ఇలా రోడ్ల మీదకు వచ్చి మరీ చెలరేగిపోయాయాని అంటున్నారు. విశాఖ శివారు ప్రాంతం మధురవాడ మారికవలస తిమ్మాపురం రోడ్డు శివశక్తి నగర్ ప్రాంతంలో జరిగిన ఈ గ్యాంగ్ వార్ తో సమీప ప్రాంతాల ప్రజలే కాదు నగరం కూడా ఉలిక్కిపడింది.
అచ్చం సినీ ఫక్కీలోనే :
సినిమాలో చూసిన విధంగా ఈ గ్యాంగ్ వార్ సాగడం విశేషం. ఇందులో ముగ్గురు మేజర్లు ఉంటే మరో ముగ్గురు మైనర్ విద్యార్ధులు అని చెబుతున్నారు ఈ గ్యాంగ్ వార్ హద్దు మీరడమే కాదు పెద్ద సంఖ్యలో అటూ ఇటూ తలపడడం విశేషం. పిడి గుద్దులు ముష్టి ఘాతాలతో రెచ్చిపోయిన విద్యార్ధులను చూసి స్థానికులు భయ కంపితులు అయ్యారు అదే సమయంలో రోడ్డు మీద బైక్ తో వెళ్తున్న ఒక వ్యక్తి మీద కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురు స్థానికుల మీద కూడా దాడి చేసినట్లుగా చెబుతున్నారు.
తగ్గేదిలే అంటూ :
అసలే జెన్ జీ యువత ఆ పై నిషా ఎక్కింది దానికి తోడు లవ్ వార్ అని అంటున్నారు. ఇక చెప్పేది ఏముంది విద్యార్ధులు అటూ ఇటూ గ్యాంగులుగా విడిపోయి రోడ్డు మీద సినిమానే చూపించాయి. అర్ధ గంటకు పైగా సాగిన ఈ గ్యాంగ్ వార్ పోలీసుల రాకతో అదుపులోకి వచ్చింది. ఈ లోగా నియంత్రించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడం గమనార్హం. ఇక ఈ విద్యార్ధులు అంతా శివశక్తి నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పట్ట పగలే చుక్కలను చూపిస్తూ భీకరంగా కొట్టుకున్న ఈ విద్యార్ధులలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి అని తెలుస్తోంది. విషయానికి వస్తే గడచిన రెండు రోజులుగా ఘర్షణలు ఈ గ్యాంగుల మధ్య జరుగుతూ వ్యవహారం కాస్తా ముదిరి ఈ విధంగా రోడ్డున పడ్డారని అంటున్నారు.
ఒక వైపు బ్రిక్స్ సదస్సు :
విశాఖలొ ఒక వైపు అదే సమయంలో బీచ్ రోడ్డులోని ఒక హొటల్ లో బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. ప్రపచంలోని 11 దేశాలకు చెందిన విదేశీ మంత్రులు ప్రతినిధులు కేంద్ర మంత్రులు సహా వీవీఐపీఎలు అక్కడ హాజరయ్యారు. ఇంకో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో పర్యటిస్తున్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ ఈ గ్యాంగ్ వార్ జరుగుతున్న ప్రాంతానికి అతి సమీపంలోనే చంద్రంపాలెం పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇలా విశాఖలో ఒక వైపు ప్రభుత్వ పెద్దలు వీవీఐపీలు ఉండగానే నగరం పరువును బజారున పడేస్తూ సాగిన ఈ గ్యాంగ్ వార్ ని చూసి విశాఖ ముక్కున వేలేసుకుంది.
గంజాయి ప్రభావమా :
విశాఖలో గంజాయి ప్రభావం పెరిగింది అని అంటున్నారు. ఆ మత్తు ప్రభావంతోనే విద్యార్ధులు ఇలా బరితెగించారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే విధంగా చూస్తే కనుక మద్యం మత్తులో కూడా విద్యార్ధులు జోగుతూ ఈ భీకర యుద్ధాన్ని మొదలెట్టారు అని అంటున్నారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఈ గ్యాంగ్ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టి పదిహేడు మంది దాకా విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. మరో వైపు చూస్తే ముగ్గురు పరార్ లో ఉన్నారని అంటున్నారు ఈ గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి ఆరు కేసులను నమోదు చేసినట్లుగా పోలీస్ వర్గాలు తెలిపాయి. సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించి మరింత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ మాత్రం ఆర్థిక రాజధాని విశాఖను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది అన్నది వాస్తవం.
