Begin typing your search above and press return to search.

ఉక్కు ఊపిరి కొన్నాళ్ళేనంటూ బాంబు పేల్చిన ఎంపీ

విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రా జిల్లాలలో ప్రత్యేకించి విశాఖ జిల్లాలో పార్టీల రాజకీయ జాతకాన్ని తారుమారు చేసే సత్తా కలిగి ఉంది.

By:  Satya P   |   1 Oct 2025 7:52 AM IST
ఉక్కు ఊపిరి కొన్నాళ్ళేనంటూ బాంబు పేల్చిన ఎంపీ
X

విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రా జిల్లాలలో ప్రత్యేకించి విశాఖ జిల్లాలో పార్టీల రాజకీయ జాతకాన్ని తారుమారు చేసే సత్తా కలిగి ఉంది. ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఆధారపడి ఉన్నారు. దానితో పాటు ప్లాంట్ అన్నది ఒక సెంటిమెంట్ గా మారింది. దాంతో విశాఖ ప్లాంట్ చుట్టూనే గత కొన్నేళ్ళుగా రాజకీయం సాగుతూ వస్తోంది.

ఉక్కుని కాపాడలేరా :

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అన్నది ప్రైవేటీకరణ అని విపక్షాలు చెబుతున్నాయి. అప్పట్లో తెలుగుదేశం ఇతర పక్షాలు ఇదే మాట అంటూ అధికారంలో ఉన్న వైసీపీని ఇరకాటంలో పెట్టాయి. ఇపుడు వైసీపీ కూడా కూటమిని పూర్తిగా కార్నర్ చేస్తోంది.విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు లేటెస్ట్ గా మాట్లాడుతూ ఒక బాంబు పేల్చారు. తాను ఆగస్టు 20న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని ప్రశ్నించాను అని దానికి సమాధానంగా ఆయన ప్లాంట్ ని ఎక్కువ కాలం కాపాడలేమని జవాబు ఇచ్చారు అని చెప్పారు. దానిని బట్టి ప్లాంట్ ఏదో నాటికి ప్రైవేటీకరణ జరగడం ఖాయమని అర్ధం అయింది అని గొల్ల బాబూరావు చెప్పారు.

వైసీపీ ఉద్యమిస్తుందంటూ :

ఈ విషయంలో వైసీపీ మాత్రం చూస్తూ ఊరుకోదని ప్లాంట్ ని పరిరక్షించేందుకు జాతీయ స్థాయిలోనూ అలాగే స్థానికంగా ప్రజా సంఘాలతో కలసి ఉద్యమిస్తుందని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎంతో చరిత్ర ఉందని అనేక మంది త్యాగ ఫలితంగా ప్లాంట్ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే ఉపాధి అవకాశాలే కాకుండా అన్ని విధాలుగా విశాఖ నష్టపోతుందని ఆయన అన్నారు.

టార్గెట్ కూటమిగా :

దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత కూటమి పెద్దలపైన ఉందని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోందని అది కేంద్ర మంత్రి ఇచ్చిన జవాబుతో స్పష్టమైందని ఇంకా లేట్ చేస్తే ప్లాంట్ ఊపిరి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.