వైజాగ్‌లో కొత్త ట్రెండ్ స్టూడియో ఫ్లాట్స్ కు టెక్ బూస్ట్!
విశాఖపట్నం ఇప్పుడు కేవలం పోర్ట్ సిటీ కాదు అది టెక్ హబ్ గా మారుతున్న సిటీ. టెక్నాలజీ, ఇండస్ట్రీ, లగ్జరీ నివాసాలకు కేంద్రంగా మారుతోంది.
By: Tupaki Political Desk | 4 Nov 2025 3:00 PM ISTవిశాఖపట్నం ఇప్పుడు కేవలం పోర్ట్ సిటీ కాదు అది టెక్ హబ్ గా మారుతున్న సిటీ. టెక్నాలజీ, ఇండస్ట్రీ, లగ్జరీ నివాసాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల ఈ నగరంలో వేగంగా పెరుగుతున్న ఒక కొత్త హౌసింగ్ కాన్సెప్ట్ స్టూడియో ప్లాట్స్ లేదా సర్వీస్ అపార్ట్‌మెంట్లు. కేవలం 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ల మధ్య ఉండే ఈ చిన్న స్మార్ట్ నివాసాలు ఇప్పుడు టెక్ కంపెనీలకు, తాత్కాలికంగా నగరంలో ఉండే ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యత పొందుతున్నాయి.
టెక్ వేవ్‌తో పెరుగుతున్న డిమాండ్
వైజాగ్ ఐటీ, టెక్నాలజీ రంగాల్లో వేగంగా ఎదుగుతోంది. అమెజాన్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి అనేక కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను విస్తరించాయి. ప్రతి వారం కొత్త ప్రాజెక్టు మొదలవుతుండడంతో నగరానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లు, గెస్ట్ ఇంజినీర్లు వస్తున్నారు. వీరికి తాత్కాలిక నివాసం అవసరం అవుతోంది. ఈ డిమాండ్‌ను గమనించిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు స్టూడియో ప్లాట్స్ వైపు దృష్టి సారించింది.
క్రిడాయ్ (CREDAI) సర్వే ప్రకారం.. విశాఖలో ప్రస్తుతం ఉన్న సుమారు 30 సర్వీస్ అపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వీటిలో వారాంతపు అద్దెలు కూడా నెలకు హోటల్ ఖర్చుతో సమానంగా ఉండేంత డిమాండ్ పెరిగింది. ఈ యూనిట్లు కేవలం నివాసాలు కాదు టెక్ వర్క్ కల్చర్‌కు సరిపోయే స్మార్ట్ లివింగ్ స్పేస్‌లు.
ఆకర్షణ వెనుక ఉన్న సౌలభ్యం
స్టూడియో ప్లాట్స్ స్మార్ట్ సిటీ లైఫ్‌కి సరిపోయేలా రూపుదిద్దుకుంటున్నాయి. చిన్న స్థలంలోనే లివింగ్ ఏరియా, మినీ కిచెన్, సింగిల్ బెడ్‌రూమ్ కానీ సౌకర్యాలు చూస్తే వేరే లెవల్. హై–స్పీడ్ ఇంటర్నెట్, స్మార్ట్ లైటింగ్, మోడర్న్ ఫర్నీచర్, 24 గంటల సెక్యూరిటీ, లాండ్రీ, ఫుడ్ సర్వీస్ వంటి అన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సౌకర్యాలే టెక్ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. వారం లేదంటే 10 రోజుల ప్రాజెక్టుల కోసం వచ్చిన సిబ్బందిని హోటళ్లలో ఉంచడం కంటే స్టూడియో ప్లాట్స్‌లో ఉంచడం ఖర్చుతో పాటు సౌలభ్యపరంగా కూడా మంచిదని కంపెనీలు చెబుతున్నాయి. ఒక ఐటీ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ‘హోటల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ స్టూడియో ప్లాట్స్ మాకు కంఫర్ట్, ప్రైవసీ కూడా ఉంటుంది. వర్క్ ఫ్రం హోం తరహా వాతావరణంలో ఉద్యోగులు రిలాక్స్‌గా ఉంటున్నారు.’ అని చెప్పాడు.
హౌసింగ్ రంగానికి కొత్త దిశ
రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ట్రెండ్ వల్ల వైజాగ్ హౌసింగ్ మార్కెట్‌లో కొత్త శకం మొదలైంది. పెద్ద అపార్ట్‌మెంట్లతో పోలిస్తే స్టూడియో యూనిట్లు తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు, తక్కువ సమయంలో అమ్ముడవుతాయి. అద్దె రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది డెవలపర్లకు లాభదాయకం, వినియోగదారులకు సౌకర్యవంతం.
ఇక భవిష్యత్తులో భీమిలి, మధురవాడ, తాడేపల్లిగూడెం, సీతమ్మధార వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి మైక్రో ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఎంతో దూరంలో లేదు. వైజాగ్‌లో ఐటీ సిటీగా రూపుదిద్దుకుంటున్న భవిష్యత్తుకు ఇది మరింత బలాన్ని ఇస్తుంది.
వైజాగ్ కొత్త జీవనశైలికి ప్రతీక
ఇప్పటికే వైజాగ్ ఇండస్ట్రీ, విద్య, పర్యాటక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే నగరం లైఫ్ స్టయిల్ మార్పు కేంద్రంగా మారుతోంది. స్టూడియో ప్లాట్స్ కేవలం నివాసాలు కాదు.. అవి ఆధునిక జీవనశైలికి ప్రతిబింభాలు. టెక్ కంపెనీలు వారానికోసారి అద్దె చెల్లిస్తూ ఈ సౌకర్యాలను బుక్ చేసుకుంటున్నాయి. వైజాగ్ ఇప్పుడు తన భవిష్యత్తు రూపాన్ని స్వయంగా మార్చుకుంటోంది.
