Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాకు శుభవార్త...దశ తిరగనుంది

ఉత్తరాంధ్రా ప్రజలకు అతి మంచి వార్త ఇది. తొందరలో ఈ ప్రాంతం దశ తిరగనుంది. అంతే కాదు దాదాపుగా అయిదున్నర దశాబ్దాలుగా ఎదురుతెన్నులు చూస్తున్న ఒక సుదీర్ఘమైన కల సాకారం కాబోతోంది.

By:  Satya P   |   12 March 2026 11:53 AM IST
ఉత్తరాంధ్రాకు శుభవార్త...దశ తిరగనుంది
X

ఉత్తరాంధ్రా ప్రజలకు అతి మంచి వార్త ఇది. తొందరలో ఈ ప్రాంతం దశ తిరగనుంది. అంతే కాదు దాదాపుగా అయిదున్నర దశాబ్దాలుగా ఎదురుతెన్నులు చూస్తున్న ఒక సుదీర్ఘమైన కల సాకారం కాబోతోంది. అదే విశాఖ రైల్వే జోన్ అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. విశాఖ నుంచి రైల్వే జోన్ ఆపరేషన్స్ మరో పదిహేను రోజుల వ్యవధిలో మొదలు కాబోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రైల్వే జోన్ యాక్టివిటీ పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి.

అపాయింట్మెంట్ డే తో :

విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి అపాయింట్మెంట్ డే పైన నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. అంటే ఆ రోజు నుంచి అఫీషియల్ గా విశాఖ రైల్వే కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి అన్న మాట. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా విశాఖ ఇక ముందు అధికారికంగా తన పనులను మొదలెట్టడానికి ఈ నోటిఫికేషన్ శ్రీకారం చుడుతుంది. ఇక రైల్వే జోన్ కి సంబంధించిన సిబ్బంది బదలాయింపు, జోన్ సరి హద్దులు, డివిజన్లు ఇవన్నీ ఆ నోటిఫికేషన్ లో పొందు పరుస్తారు. దాంతో విశాఖ రైల్వే జోన్ ఏపీకి పూర్తి స్థాయిలో వచ్చినట్లే అని అంటున్నారు.

శాశ్వత భవనాలు కూడా :

ఇక గత ఏడాది జనవరి 8న విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రైల్వే జోన్ కి సంబంధించిన శాశ్వత భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అవి పెద్ద ఎత్తున నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రస్తుతానికి అయితే రైల్వే జోన్ తన కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రభుత్వ భవనాలను కూడా ఎంపిక చేసుకుంది. కొంతమంది పై స్థాయి అధికారులు అయితే నియమితులయ్యారు. పూర్తి స్థాయి సిబ్బంది నోటిఫికేషన్ తరువాత జోన్ కార్యాలయానికి రావచ్చు అని అంటున్నారు. ఇప్పటికే దాదాపుగా వేయి మంది దాకా సిబ్బందికి విశాఖ రైల్వే జోన్ కి బదిలీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది అని చెబుతున్నారు. దాంతో వీరందరికీ తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు భవనాలు అయితే సిద్ధంగానే ఉన్నాయి.

నాలుగు డివిజన్లతో :

విశాఖ రైల్వే జోన్ నాలుగు డివిజన్లతో ఏర్పాటు కానుంది. వాల్తేరు డివిజన్ పేరుని విశాఖ డివిజన్ గా మార్చారు. ఇందులో ఉన్న కేకే లైన్ ని కొత్తగా ఏర్పడిన రాయగడ డివిజన్ లో విలీనం చేశారు. ఇక విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది అని అంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి వేరు చేసి కొత్త జోన్ కి సిబ్బందిని కానీ డివిజన్లను కానీ విభజించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఏ ఏ డివిజన్లకు ఎక్కడ సరిహద్దులు అన్నది రైల్వే అధికారులు సీరియస్ గానే పరిశీలించి విభజన చేస్తున్నారు అని అంటున్నారు.

జోన్ వస్తే జోరు అందుకున్నట్లే :

విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల దశ జోన్ తో తిరుగుతుందని అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ వస్తే కొత్త రైళ్ళను ఇక్కడ నుంచే అవసరానికి తగినట్లుగా నడపవచ్చు. అలాగే ఇక్కడ నుంచే మొదలయ్యేలా రైళ్ల రాకపోకలను కూడా మార్చుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా విశాఖకు వస్తుందని చెబుతున్నారు. దాంతో ఎంతో మంది నిరుద్యోగుల రైల్వే ఉద్యోగ ఆశలు తీరనున్నాయి. అలాగే ఉత్తరాంధ్రకు ఆర్ధికంగా బలమైన ఆలంబనగా ఈ రైల్వే జోన్ నిలుస్తుంది అని అంటున్నారు మొత్తానికి చూస్తే ఏనాడో 1970లలో విశాఖ ఎంపీగా ఉన్న తెన్నేటి విశ్వనాధం తమ ప్రాంతానికి రైల్వే జోన్ కావాలని లోక్ సభలో కోరారు. ఆనాడు పురుడు పోసుకున్న ఈ కోరిక ఈనాటికి సాకారం అవుతోంది అంటే లేట్ అయినా విశాఖకు దక్కిన అదృష్టంగానే అంతా అంటున్నారు.