Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..వైసీపీ మాటేంటి ?

ఎన్నికల టూ ఎన్నికలు అన్నట్లుగా దేశంలో రాజకీయాలు సాగుతున్నాయి. అయిదేళ్ళు ఇపుడు బొత్తిగా తక్కువ సమయంగా కనిపిస్తోంది.

By:  Satya P   |   2 Jan 2026 8:30 AM IST
టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..వైసీపీ మాటేంటి ?
X

ఎన్నికల టూ ఎన్నికలు అన్నట్లుగా దేశంలో రాజకీయాలు సాగుతున్నాయి. అయిదేళ్ళు ఇపుడు బొత్తిగా తక్కువ సమయంగా కనిపిస్తోంది. అందుకే పదిహేనేళ్ళ పాటు అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇక ఒక ఎన్నికల్లో గెలిచేశాం కదా అని ఎవరూ రిలాక్స్ కావడం లేదు, అధినేత నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ వచ్చే ఎన్నికల్లో కూడా జెండా పాతాలని పట్టుదల చూపిస్తున్నారు. పైగా చేతిలో అధికారం ఉన్నపుడే మరింతగా ఇమేజ్ పెంచుకోవాలని కూడా చూస్తున్నారు.

మూడేళ్లకు ముందే :

ఇదిలా ఉంటే చాలా తొందరగానే ఏపీలోని ఒక ప్రతిష్టాత్మకమైన ఎంపీ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్ధి ఫిక్స్ అయిపోయారు. విశాఖ ఏపీలో టాప్ లో ఉండే సీటు. ఈ సీటు నుంచి పోటీ చేయడానికి ఎంతో మంది చూస్తారు. పార్లమెంట్ లో కూడా అందరికీ తెలిసే ఎంపీ సీట్లలో విశాఖ ముందు వరసలో ఉంటుంది. సౌత్ లో మోస్ట్ హాట్ ఫేవరేట్ సిటీగా విశాఖ ఉంటుంది కాబట్టి దేశంలో సైతం అక్కడ నుంచి గెలిచి వచ్చిన ఎంపీ విషయంలో అందరి ఫోకస్ ఉంటుంది. అలా చూస్తే 2024 ఎన్నికల్లో ఎంపీగా టీడీపీ కూటమి తరఫున పోటీ చేసిన శ్రీ భరత్ గెలిచారు. ఇక వచ్చే ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగా సమయం ఉంది. అయితే 2029లో కూడా తాను ఎంపీగానే పోటీ చేస్తాను అని శ్రీభరత్ తాజాగా ప్రకటించి సంచలనం రేపారు.

బీజేపీ ఆశలు :

ఇక విశాఖ ఎంపీ సీటు మీద బీజేపీ ఆశలు పెట్టుకుంది. పొత్తులు ఉంటే ఎపుడూ బీజేపీకే ఈ సీటు ఇవ్వడం ఆనవాయితీగా ఉంటూ వచ్చేది. కానీ 2024 లో ఆ ఆనవాయితీ పూర్తిగా తప్పింది. విశాఖకు బదులుగా అనకాపల్లి సీటుని బీజేపీకి ఇచ్చారు. ఇక 2029 లో కూడా అదే జరుగుతుంది అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో టీడీపీకే విశాఖ సీటు అదీ భరత్ కే అన్నది కన్ ఫర్మ్ అయిపోయినట్లే. పైగా ఆయన లోకేష్ కి తోడల్లుడు, బాలయ్యకు అల్లుడు కాబట్టి ఆయన ప్రాధాన్యత కచ్చితంగా ఉంటుందని అంటున్నారు.

వైసీపీకి టఫ్ :

ఇక విశాఖ ఎంపీ సీటుకు ఇప్పటికి మూడు సార్లు పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. దానికి కారణం టీడీపీ జనసేన బీజేపీ ఒంటరిగా పోటీ చేశాయి. ఇంత జరిగినా టీడీపీకి విశాఖలో ఉన్న బలంతో కేవలం మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతోనే భరత్ నాడు ఓటమి పాలు అయ్యారు. అయితే కూటమి విశాఖలో పటిష్టంగా ఉంది. పైగా 2024లో అయిదు లక్షలకు పైగా భరత్ కి మెజారిటీ వచ్చింది. ఇంకో వైపు చూస్తే వైసీపీకి ఎంపీ అభ్యర్ధి ఎవరు అన్నది ఇప్పటికీ చర్చగా ఉంది. దాదాపుగా ఇరవై నెలలు దగ్గర పడుతున్నా విశాఖ పార్లమెంట్ పరిధిలో ధీటైన నాయకుడు ఎవరూ అన్నది చర్చలకే పరిమితం అవుతోంది. ఇక ఎన్నికల ముందు ఎవరిని దింపినా వర్కౌట్ అయ్యేది కాదని అంటున్నారు. ఎందుకంటే భరత్ జనంలో ఉంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. దాంతో పాటు మంచి పట్టు సాధించారు. దాంతో వైసీపీకి ఈ సీటు వెరీ టఫ్ అవుతుందని అంటున్నారు. ఎటూ టీడీపీ నుంచి భరత్ మళ్ళీ పోటీ చేయడం ఖాయం అయినందువల్ల వైసీపీ ఇప్పటి నుంచే బలమైన అభ్యర్ధిని బరిలోకి దించి రంగంలోకి దిగకపోతే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ నుంచి ఎవరు ముందుకు వస్తారో.