Begin typing your search above and press return to search.

షాకింగ్ ట్విస్టు: ఫ్రెండ్ ఇంట్లో చంపేసి.. ట్రాలీ బ్యాగ్ లో తీసుకెళ్లి!

రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన విశాఖకు చెందిన మౌనిక హత్య కేసులో షాకింగ్ నిజం వెలుగు చూసింది.

By:  Garuda Media   |   9 April 2026 9:30 AM IST
షాకింగ్ ట్విస్టు: ఫ్రెండ్ ఇంట్లో చంపేసి.. ట్రాలీ బ్యాగ్ లో తీసుకెళ్లి!
X

రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన విశాఖకు చెందిన మౌనిక హత్య కేసులో షాకింగ్ నిజం వెలుగు చూసింది. నిందితుడు చెప్పిన విషయాలన్ని నిజాలుగా భావించి విచారణ చేసే క్రమంలో.. ఆధారాలు లభించకపోవటం.. సంబంధం లేనట్లుగా కొన్ని సన్నివేశాలు ఉండటంతో కొత్త సందేహాలతో నిందితుడు రవీంద్రను మరోసారి విచారించారు. ఈ క్రమంలో అతను వెల్లడించిన అంశాలు కేసుకు సంబంధించి మరో ట్విస్టుగా మారాయి. ఇప్పటివరకు తన ఇంట్లోనే మౌనికను చంపేసి.. ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచినట్లుగా.. కొన్ని భాగాల్ని బయటకు తీసుకెళ్లి తగలబెట్టినట్లుగా చెప్పినప్పటికీ.. జరిగింది మాత్రం అందుకు భిన్నమైనవన్న విషయం తాజాగా వెలుగు చూసింది.

నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ అయిన రవీంద్రకు డేటింగ్ యాప్ లో మౌనిక పరిచయం కావటం.. ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థలతో ఆమెను చంపేయటం తెలిసిందే. దీనికి సంబంధించి తొలుత పోలీసులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 29న మౌనికను మర్రిపాలెం నుంచి బైకు మీద తన ఫ్లాటుకు తీసుకెళ్లానని.. అక్కడ గొడవ జరగటంతో చంపేసినట్లుగా చెప్పాడు. అయితే.. సీసీ కెమేరాల్లో మౌనిక రవీంద్ర ఫ్లాటుకు వచ్చినట్లుగా ఎక్కడా లేడు. ఫ్లాట్ లోకే రాకుండా మౌనికను ఎలా హత్య చేయటం? అన్న సందేహం పోలీసులకు వచ్చింది.

దీంతో.. మరోసారి రవీంద్రను పోలీసులు విచారించగా అసలు నిజాల్ని బయటపెట్టాడు. రవీంద్ర ఫ్లాట్ కు దగ్గర్లో అతని స్నేహితుడు ఉంటున్నాడు. హత్య జరిగిన రోజు ఉదయం ఆ స్నేహితుడు ఫార్మా కంపెనీల జాబ్ కోసం వెళ్లాడు. ప్రెండ్ ను ఇంటి తాళాలు అడిగి తీసుకున్న రవీంద్ర.. మౌనికను ఆ ఇంట్లోకి తీసుకెళ్లాడు. తన ఫ్లాట్ కు మౌనికను తీసుకెళితే.. తనకు అప్పటికే పెళ్లైనట్లుగా తెలుస్తుందన్న ఉద్దేశంతో తన స్నేహితుడి ఇంటినే తన ఇంటిగా చూపించాడు. కాసేపటికే ఇద్దరి మధ్య గొడవ జరగటం.. మౌనిక గట్టిగా అరవడటంతో రవీంద్ర ఆమె నోరు నొక్కే ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత మోకాలితో గొంతుపై బలంగా తొక్కటంతో మౌనిక మరణించింది. ఆమెను చంపేసిన రవీంద్ర.. తన స్నేహితుడికి కూడా ఆ విషయాన్ని చెప్పలేదు. స్నేహితుడి ఇంట్లోనే మౌనిక డెడ్ బాడీని ఉంచేసి.. దగ్గర్లోని తన ఫ్లాట్ కు వెళ్లి.. ఇంట్లోని పెద్ద ట్రాలీ బ్యాగ్ ను తీసుకొచ్చాడు. అందులో మౌనిక డెడ్ బాడీని కుక్కేశాడు. తన ఇంట్లోనే మౌనిక హత్య జరిగిన విషయం ఆ స్నేహితుడికి ఇప్పటికి తెలీదు. అనంతరం ట్రాలీ బ్యాగ్ ను తన ఇంట్లోకి తీసుకెళ్లిన అతను.. ఆన్ లైన్ లో కత్తులు.. వైపర్.. డస్ట్ బిన్ కవర్లు కొనుగోలు చేశాడు

ఆ తర్వాత బాత్రూంలో మౌనిక శరీర భాగాల్ని వేర్వేరుగా చేసి.. కొన్నింటిని ఫ్రిజ్ లో పెట్టి..కొన్నింటిని తీసుకొని జీడితోటలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీ ముగియటంతో రవీంద్రను కోర్టుకు అప్పగించారు. అతడ్ని జైలుకు తరలించారు. అవసరమైతే మరోసారి కస్టడీ కోరుతామని పోలీసులు చెబుతున్నారు.