Begin typing your search above and press return to search.

మేయర్ సమరం : బీసీ కార్డుతో టీడీపీ ఢీ !

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దశల వారీగా కార్పొరేషన్లు మునిసిపలైటీలు, జెడ్పీలు మండల పరిషత్తులకు డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది.

By:  Satya P   |   3 Sept 2026 2:00 PM IST
మేయర్ సమరం : బీసీ కార్డుతో టీడీపీ ఢీ !
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దశల వారీగా కార్పొరేషన్లు మునిసిపలైటీలు, జెడ్పీలు మండల పరిషత్తులకు డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ కాపోరేటర్లు కౌన్సిలర్లు సర్పంచులు వార్డు మెంబర్లకు కూడా వరసబెట్టి ఎన్నికలు ఉన్నాయి. అయితే అందరి దృష్టిని ఎక్కువగా మేయర్ జెడ్పీ చైర్మన్ ఎన్నికలే ఆకట్టుకుంటాయి. అందులోనూ ప్రత్యక్ష పోరు కాబట్టి రసవత్తరంగా ఉంటాయి. మేయర్ అంటే ఏపీలో అతి పెద్ద కార్పొరేషన్ గా ఉన్న విశాఖ మీదనే అందరి దృష్టి ఉంటుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా విశాఖ మేయర్ సీటుని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

టీడీపీకే సీటు :

ఇదిలా ఉంటే కూటమిలో మిగిలిన పార్టీలు కోరుతున్నా కూడా విశాఖ మేయర్ సీటు టీడీపీ తానే పోటీ చేస్తుందని అంటున్నారు. విశాఖలో దాదాపుగా నాలుగు దశాబ్దాల తరువాత పూర్తి స్థాయి మేయర్ పదవిని అందుకుని నగరాభివృద్ధిలో తన ముద్ర వేయాలని టీడీపీ చూస్తోంది. టీడీపీయే పోటీ చేస్తుంది అని తెలియడంతో ఆ పార్టీలో అనేక మంది రేసులోకి వస్తున్నారు. వారిలో మాజీ మంత్రుల బిడ్డలు అలాగే ఎమ్మెల్యేల వారసులు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఎంతో మంది ఉన్నారు. వీరిలో అగ్ర కులాలు కాపులు కమ్మలు ఇలా అనేక మంది తమ అంగబలం అర్ధ బలం చూపిస్తూ తామే పోటీలో ఉంటామని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే డజన్ దాకా ఆశావహుల లిస్ట్ ఉంది. దాంతో అధినాయకత్వం కూడా దీనిని నిశిస్తంగా పరిశీలిస్తూనే తనదైన వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు.

బీసీలకే పెద్ద పీట :

ఇదిలా ఉంటే బీసీలు విశాఖ కార్పోరేషన్ పరిధిలో అధిక సంఖ్యలో ఉన్నారు. పైగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరీ టీడీపీ క్రెడిట్ ని తీసుకుంటోంది. దాంతో బీసీలకే విశాఖ మేయర్ సీటు కేటాయించాలని చూస్తోంది. దీని వల్ల బీసీలకు సామాజిక న్యాయం చేసినట్లుగా ఉండడంతో పాటు అధిక సంఖ్యాకులు పోటీలోకి దూసుకుని వస్తున్న తరుణంలో తరుణోపాయంగా కూడా ఉంటుందని ఆలోచిస్తోంది. బీసీలలో కూడా విశాఖ పరిధిలో ఎక్కువగా యాదవ సామాజిక వర్గం జనాభా ఉంది. వైసీపీ 2021 లో జరిగిన ఎన్నికల్లో వారికే మేయర్ సీటు ఇచ్చింది. అయితే నాలుగేళ్ల తర్వాత యాదవ సామాజిక వర్గం మేయర్ ని దించేశారు అని టీడీపీ కూటమి మీద ఆ వర్గం అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఈసారి వారికి భరోసా ఇవ్వాలని కూడా వారి నుంచే మేయర్ క్యాండిడేట్ ఎంపిక చేస్తారు అని అంటున్నారు.

అన్ని సమీకరణలు చూసుకుని :

ఇక బీసీలలో కూడా యువకులకు ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. విశాఖ మేయర్ పీఠం అంటే మెగా సిటీలో తొలి పౌరుడు కాబట్టి ఉన్నత విద్యా వంతులకు కూడా చాన్స్ ఇవ్వాలని చూస్తోంది. అలాగే ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి అంగబలం అర్ధబలం అన్నీ తట్టుకుని నిలిచే బిగ్ షాట్ కే అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలతో ఆశావహులు అయితే కొంత ఖంగు తింటున్నారు. అదే సమయంలో టీడీపీ బీసీ కార్డు అన్ని విధాలుగా పార్టీకి మేలు చేస్తుందని అత్యధిక శాతం అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి విభేదాలు లేకుండా అంతా కలసి పనిచేయడానికి బీసీ కార్డు వ్యూహం పనిచేస్తుందని అంటున్నారు. ఇంతకీ టీడీపీ బీసీ మేయర్ అభ్యర్థి ఎవరో తొందరలోనే తెలుస్తుంది అని అంటున్నారు.