విశాఖ మేయర్ కోసం భారీగానే !
విశాఖ మేయర్ పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో పెద్ద కార్పోరేషన్ కావడం, ఏపీలో పెద్ద సిటీగా విశాఖ ఉండడంతో మేయర్ సీటుకు ఎంతో ప్రతిష్ట ఏర్పడింది.
By: Satya P | 19 Oct 2026 9:04 AM ISTవిశాఖ మేయర్ పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో పెద్ద కార్పోరేషన్ కావడం, ఏపీలో పెద్ద సిటీగా విశాఖ ఉండడంతో మేయర్ సీటుకు ఎంతో ప్రతిష్ట ఏర్పడింది. అంతే కాకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల తరఫున ఎన్నిక కావడం ఒక గౌరవం గర్వంగా భావించి అనేక మంది పోటీకి సిద్ధపడుతున్నారు. విశాఖ ప్రజలు తమను ఆదరించి పట్టం కడతారు అని నమ్మకంతో పోటీకి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో జీవీఎంసీ మేయర్ పదవికి మొత్తం 29 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం విశేషం. వారి తరఫున 39 సెట్లు నామినేషన్ల దాఖలు అయ్యాయి. ప్రధాన పార్టీల నుంచి మేయర్ సీటుకు రెండు సెట్ల నామినేషన్ దాఖలు అయింది.
పార్టీ వారీగా నామినేషన్లు :
ఇదిలా ఉంటే మేయర్ పదవికి పార్టీల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు చూస్తే టీడీపీ వైసీపీ నుంచే కాదు అనేక ఇతర పార్టీలు కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. అందులో బీఎస్పీ పార్టీ నుండి కరణం కీర్తన గ్రేస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటలక్ష్మి జెర్రిపోతుల, ఉష్నారా పర్వీన్, దేవర నాగ సునంద దేవి , ప్రియాంక దండి, షేక్ దౌలతునిషా, , భోర సంతోషి నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి శ్రావణి ముక్క, వైసీపి నుంచి వరుదు కళ్యాణి, పేడాడ రమణకుమారి, వెంకట విజయ కుమారి తిప్పల నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఇండిపెండెంట్లు గా నమ్మి భవాని, కొప్పుల సత్యవాణి, వట్టికొల్ల సరోజ దేవి, చింతాడ పద్మిని, దాసరి లక్ష్మీసంధ్య, శైలజ తలుపుల, వియ్యపు ఉమా, పకృతి, దేవిక, వాండ్రాసి శాంతి కుమారి, వాడ మొదల పద్మ, కనికిళ్లి లక్ష్మి, గొంప వెంకట పద్మావతి, పెదిరెడ్ల వరలక్ష్మి, పులిచెర్ల రాజేశ్వరి, పి. కీర్తి, ఫ్యాన్సీనమ్మ అత్తిలి, లిఖిత నామినేషన్లు దాఖలు చేశారు.
పెద్ద బ్యాలెట్ పేపర్ :
జీవీఎంసీ మేయర్ పదవికి పోటీ కోసం ఎక్కువ మంది నిలబడడం ఈ సారి విశేషంగా చూస్తున్నారు. నామినేషన్ల ఉప సంహరణ నాటికి వీరిలో కొంత మంది తప్పుకున్నా కూడా కనీసంగా ఇరవై మంది పోటీలో నిలుస్తారు అని అంటున్నారు. అలా చూసుకుంటే పెద్ద బ్యాలెట్ పేపర్ మేయర్ పదవి కోసం అవసరం అని అంటున్నారు. దాంతో ఎక్కువ మంది పోటీకి ఉంటే ప్రధాన అభ్యర్ధులకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది అని అంటున్నారు. తమ పార్టీ అభ్యర్ధి గుర్తుని వెతుక్కోవడం కూడా ఓటర్లకు కష్టంగా ఉంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే మేయర్ అభ్యర్ధిని ఎన్నుకునేందుకు పింక్ కలర్ బ్యాలెట్ పత్రాన్ని ఇస్తారు, అలాగే కార్పొరేటర్ ఎన్నిక కోసం వైట్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దీంతో ఒక్కో ఓటర్ కి ఈసారి రెండు ఓట్లు వేసే చాన్స్ లభిస్తుంది.
