Begin typing your search above and press return to search.

విశాఖ మేయర్ సీటు...ఇద్దరి మధ్యనే పోటీ !

విశాఖ మేయర్ పదవి కోసం పోటీ పడుతూ ఎన్నికల 15 మంది అభ్యర్థులు ఉన్నారని ఎన్నికల అధికారులు తుది జాబితాను విడుదల చేశారు.

By:  Satya P   |   25 Oct 2026 8:33 PM IST
విశాఖ మేయర్ సీటు...ఇద్దరి మధ్యనే పోటీ !
X

విశాఖ మేయర్ పదవి కోసం పోటీ పడుతూ ఎన్నికల 15 మంది అభ్యర్థులు ఉన్నారని ఎన్నికల అధికారులు తుది జాబితాను విడుదల చేశారు. మేయర్ పదవి పోటీకి మొత్తం 29 నామినేషన్లు స్వీకరించగా అందులో 8 నామినేషన్లు తిరస్కరించారు. ఇక మిగిలిన 21 నామినేషన్లు సక్రమంగా ఉండగా అక్టోబర్ 21న నామినేషన్ ఉపసంహరణలో ఆరుగురు సభ్యులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో చివరికి మేయర్ పదవి పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం ప్రకటించారు. అలా 15 మంది అభ్యర్దులు ఉన్నారు.

వీరంతా పోటీలో :

జీవీఎంసీ మేయర్ ఎన్నికలకు పోటీలో నిలిచిన 15 మంది అభ్యర్థుల వివరాలు చూస్తే . బహుజన సమాజ్ పార్టీ నుండి కరణం కీర్తన గ్రేస్ కాంగ్రెస్ పార్టీ నుంచి దేవర నాగ సునందా దేవి, టీడీపీ నుంచి ముక్కా శ్రావణి, వైసీపీ నుంచి వరుదు కళ్యాణి, భారత చైతన్య యువజన పార్టీ నుండి నమ్మి భవాని ఉన్నారు ఇండిపెండెంట్లు గా 11 మంది ఉంటే ఫ్రాన్సినమ్మ అత్తిలి, గొంప వెంకట పద్మావతి, శైలజ తలుపుల, ప్రియాంక దండి, పకృతి దేవిక, బోర సంతోషి, లిఖిత, వాడ్రాసి శాంతి కుమారి, వియ్యపు ఉమ, షేక్ దౌలత్ ఉన్నీసా మేయర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇక ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరించుకున్నారు.

కూటమి వర్సెస్ వైసీపీ :

పోటీలో 15 మంది కనిపిస్తున్నా అసలైన పోరు మాత్రం కూటమి వైసీపీల మధ్యనే ఉండబోతోంది. ఈ రెండు పార్టీలకే 120 వార్డులలో కార్పోరేటర్లు ఉన్నారు. అలాగే పార్టీలకు సంస్థాగతంగా బలం ఉంది. దాంతో పాటు గతంలో వైసీపీ గెలిచింది. ఈసారి కూడా గెలవాలని పోటీ పడుతోంది. నాలుగు దశాబ్దాల తరువాత టీడీపీ మేయర్ సీటుకు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. 1987లో ప్రత్యక్ష ఎన్నికల్లోనే టీడీపీ మేయర్ సీటుని దక్కించుకుంది అని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

టీడీపీకి అనుకూలతలు :

ఇదిలా ఉంటే టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. దాంతో పాటు విశాఖ అంటేనే టీడీపీకి కంచుకోట అన్నది తెలిసిందే. దాంతో ఆ పార్టీకి అదే సానుకూల అంశం అవుతుందని అంటున్నారు. దాంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖకు చేసిన అభివృద్ధి గురించి కూడా ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూటమికే ఉండడం మరో అదనపు బలంగా ఉంది అని అంటున్నారు.

వైసీపీ ఆశలు :

అయితే రెండున్నరేళ్ల కాలంలో కూటమి మీద ప్రజలలో వ్యతిరేకత బాగా ఉందని వైసీపీ భావిస్తోంది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని విశాఖకు గతంలో లేని విధంగా తాగు నీటి కష్టాలు వచ్చాయని వైసీపీ ప్రచారం చేస్తోంది. విశాఖను వైసీపీ హయాంలోనే తాము అభివృద్ధి చేశామని చెబుతోంది. వైసీపీకి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అభ్యర్ధిత్వం సానుకూలంగా ఉంది. ఆమె అందరికీ పరిచయం ఉన్న వారు కావడం వాగ్దాటి అన్నది మేయర్ మెటీరియల్ గా జనాలు భావించే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. కూటమిలో అనైక్యత అసంతృప్తి చాలా చోట్ల ఉందని అది తమకు అనుకూలిస్తుందని కూడా వైసీపీ భావిస్తోంది. మొత్తం మీద అయితే టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగానే పోటీ సాగనుంది అని అంటున్నారు.