కూతురు పెళ్లి ఆగితే.. పురుగుల మందు తాగి చనిపోవటమా?
విన్నంతనే అయ్యో అనిపించే ఉదంతం ఒకటి విశాఖపట్నంలోని పీఎం పాలెంలో చోటు చేసుకుంది.
By: Garuda Media | 27 Nov 2025 1:00 PM ISTవిన్నంతనే అయ్యో అనిపించే ఉదంతం ఒకటి విశాఖపట్నంలోని పీఎం పాలెంలో చోటు చేసుకుంది. త్వరలో జరగాల్సిన కుమార్తె వివాహం ఆర్థిక లెక్కలతో ఆగిందన్న మనస్తాపానికి గురై.. హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్లి మరీ ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని మియాపూర్ దరి చందానగర్ లో ఉంటున్న ర్యాలి శ్రీనివాసరావు.. తాజాగా సొంతూరుకు వెళ్లి సూసైడ్ చేసుకున్న వైనం కలకలాన్ని రేపింది.
54 ఏళ్ల శ్రీనివాసరావు ఎనిమిదేళ్ల క్రితం ఊరి నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. పిల్లల చదువుల కోసం నగరానికి వెళ్లిన ఆయన.. అక్కడ పురుగుమందుల షాపుతో పాటు వాటర్ ప్లాంట్ ను నడుపుతున్నారు. ఆయనకు భార్య నాగమల్లీశ్వరి ఇంట్లోనే ఉంటారు. కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నారు. కొడుకు విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం కుమార్తెకు విదేశాల్లో ఉన్న ఒక ఐటీ ఉద్యోగితో వివాహ సంబంధం కుదిరింది. ఈ నెల 25న పెళ్లికి ముహుర్తం కుదరటం.. అనంతరం ఇరు కుటుంబాల మధ్య ఇబ్బందులు తలెత్తాయి. దీంతో.. యువకుడి తల్లిదండ్రులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. అనూహ్యంగా కుమార్తె పెళ్లి ఆగిపోవటంతో శ్రీనివాసరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
మూడు రోజుల క్రితం ఊళ్లో ఉన్న తల్లి సత్యవతిని చూసేందుకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి.. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పీఎంపాలెం క్రికెట్ స్టేడియం ముందు ఉన్న సర్వీసు రోడ్డులో కారును ఆపి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తాను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నానన్న విషయాన్ని వివరించటంతో పాటు.. తాను ఎవరెవరికి బాకీ ఉన్నానన్న విషయాన్ని.. తనకు రావాల్సిన డబ్బుల వివరాల్ని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఎంత కూతురు పెళ్లి ఆగిపోతే.. ఇలా సూసైడ్ చేసుకోవటమా? అన్నది షాక్ గా మారింది.ఈ ఉదంతం శ్రీనివాసరావు సొంతూర్లో హాట్ టాపిక్ అయ్యింది. తెల్లవారుజామున తాను ఆత్మహత్య చేసుకోవటానికి ముందు.. వాట్సప్ లో అన్ని వివరాల్ని పంపి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సూసైడ్ గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. రాత్రి నిద్రపోయి.. ఉదయం వాట్సప్ చూసుకునేసరికి ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
