Begin typing your search above and press return to search.

విశాఖలో కైలాసగిరిపై అద్భుతం

విశాఖ అంటేనే పర్యాటక పరంగా అద్భుతంగా ఉండే ప్రాంతం. ఎంతో మంది దేశ విదేశీ పర్యాటకులు ప్రతి నిత్యం విశాఖ వచ్చి అక్కడ అందాలను చూసి ఎంతో మైమరుస్తారు.

By:  Satya P   |   1 Dec 2025 11:57 PM IST
విశాఖలో కైలాసగిరిపై అద్భుతం
X

విశాఖ అంటేనే పర్యాటక పరంగా అద్భుతంగా ఉండే ప్రాంతం. ఎంతో మంది దేశ విదేశీ పర్యాటకులు ప్రతి నిత్యం విశాఖ వచ్చి అక్కడ అందాలను చూసి ఎంతో మైమరుస్తారు. ప్రత్యేకమైన అనుభూతికి గురి అవుతారు. విశాఖలో ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. వాటిలో కైలాసగిరి ఒకటి. ఇక్కడకు అత్యధిక సంఖ్యలో టూరిస్టులు వస్తారు. ఎన్నో అందాలు ఇక్కడ ఉన్నాయి. ఇపుడు అదనంగా వాటికి మరొకటి జత చేరింది. అదే గాజు వంతెన. దానిని తాజాగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు.

నిజంగా బ్యూటీ :

ఈ గాజు వంతెన మీద నుంచి చూస్తే విశాఖ బ్యూటీ అంటే రెండు కళ్ళ కెమెరాతో అలా కట్టి పడేయవచ్చు. ఎంతో సోయగాన్ని అలా ఆస్వాదిస్తూ తరించవచ్చు. కైలాసగిరిపై ఇప్పటికే స్కై సైక్లింగ్, పారా గ్లైడింగ్ నెలకొల్పడం జరిగింది. ఇక వీటితో పాటుగా ఇప్పుడు సుమారు ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో ఆదాయ భాగస్వామ్యం పద్ధతిలో గాజు వంతెన నిర్మించి ప్రారంభించారు. ఇక ఇది సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గాజు వంతెనను అత్యంత సురక్షితమైన 40 ఎస్ ఎస్ మందం గల గాజుతో తయారు చేశారు. దేశంలోనే 55 మీటర్ల పొడవైన నిర్మితమైన మొట్టమొదటి గాజు వంతెనగా దీనిని పేర్కొంటున్నారు.

పూర్తి సామర్ధ్యంతో :

ఇక ఈ గాజు వంతెన గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను అంటే హుద్ హూద్ వంటి తుఫాన్లను కూడా తట్టుకొని నిలబడే విధంగా తయారు చేశారు. అంతే కాదు ఒకేసారి సుమారు వంద మంది వచ్చి ఈ గాజు వంతెన మీద నిలిచినా వారిని అందరినీ తట్టుకొనే తీరులో రూపకల్పన చేశారు. ప్రస్తుతం పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి కేవలం నలభై మందికి మాత్రమే అనుమతించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

టూరిజం కాపిటల్ గా :

ఇదిల ఉంటే విశాఖపట్నాన్ని అటు ఐటీ పరంగా ఇటు పర్యాటక పరంగా అభివృద్ధి చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఎంపీ శ్రీ భరత్ చెబుతున్నారు వీటి ప్రభావంతో విశాఖకు అనేక విధాలుగా పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ఆయన అన్నారు. గాజు వంతెన ప్రాజెక్ట్ అన్నది విశాఖకే ఖ్యాతి తీసుకుంటుందని చెప్పారు. ఇంతే కాదని త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్ అందుబాటులో తీసుకువస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. అలాగే విశాఖలో పర్యాటక పరంగా మరిన్ని పెట్టుబడులు వస్తాయని కైలాసగిరిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.