Begin typing your search above and press return to search.

వీవీఐపీలు అంతా విశాఖలోనే - ఏమిటీ విశేషం ?

విశేషమేంటి అంటే విశాఖలో జరిగే అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకి అమెరికా,జర్మనీ,ఫ్రాన్స్ దేశాలకు చెందిన మూడు నౌకలు అలావే వాటితో పాటు 150 మంది వరకూ ప్రతినిధులు హాజరవుతారు.

By:  Satya P   |   4 Feb 2026 6:48 PM IST
వీవీఐపీలు  అంతా విశాఖలోనే - ఏమిటీ విశేషం ?
X

విశాఖకు వీవీఐపీలు వస్తున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీ ఒక్కసారిగా అంతర్జాతీయ నగరంగా మారిపోబోతోంది. విశాఖకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది అతిధులు తరలి రానున్నారు. వీరి రాకతో విశాఖ పూర్తిగా రక్షణ వలయంలోకి వెళ్ళిపోతోంది. విశాఖలో ఏమిటీ విశేషం, వీరంతా ఎందుకు వస్తున్నారు అంటే విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐ ఎఫ్ ఆర్-2026 ని ఈ నెలలో నిర్వహిస్తున్నారు. దాని కోసం విశాఖ ఇపుడు ముస్తాబు అవుతోంది.

రాష్ట్రపతి రాకతో :

విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఐఎఫ్ఆర్-2026, మిలాన్, అంతర్జాతీయ సిటీ పరేడ్ కార్యక్రమాలను మూడు రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకూ సాగే ఈ కార్యక్రమాల కోసం విశాఖ ప‌టిష్ట ఏర్పాట్లతో సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 17న భారత రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము రాక‌తో విశాఖలో ఐఎఫ్ఆర్-2026 కార్య‌క్ర‌మాలు అట్టహాసంగా మొద‌ల‌వుతాయి. ఇక 18న నౌకాదళ ఫ్లీట్ రివ్యూ ఉంటుంది. అలాగే 19న ఉద‌యం మిలాన్ ప్రారంభోత్స‌వం అలాగే సాయంత్రం విశాఖ బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటుంది. ఈ మొత్తం మూడు రోజుల కార్యక్రమాలను నౌకా దళ విన్యాసాలను వీక్షించేందుకు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. దాంతో విశాఖలో సందడే సందడి అన్నట్లుగా నౌకా దళ విన్యాసాలు సాగనున్నాయి.

వీవీఐపీలు హాజరు :

ఇక భార‌త రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్, ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇత‌ర ప్ర‌ముఖులు విశాఖకు ఈ మూడు రోజుల కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో విశాఖ మొత్తం భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అన్నీ ఉన్నత స్థాయిలో సాగుతున్నాయి.

విన్యాసాలు తిలకించేందుకు :

ఇదిలా ఉంటే లక్షలది మంది ప్రజలు నేరుగా బీచ్ లో జరిగే నావికా దళ విన్యాసాలు తిలకించేందుకు కుదరకపోవచ్చు. అందుకే అల్టర్నేషన్ గా ఇతర మార్గాలలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ పరేడ్ మార్గంలో ఎల్ఈడి స్క్రీన్లు, పీఏ సిస్టమ్, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నరు. అలాగే ప్రత్యేక బస్సులను అన్ని వైపులా నడుపుతున్నారు.

ఫ్లీట్ రివ్యూ అంటే ఏమిటి :

అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష అంటే ఏమిటి అన్నది అందరికీ సందేహంగా ఉంటుంది. రాష్ట్రపతి తన పదవీ కాలంలో నాలుగేళ్లకు ఒకసారి నౌకా దళానికి సంబంధించి సమీక్షను స్వయంగా నిర్వహిస్తారు. ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ అని అంటారు. అది కాకుండా అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష కూడా ఉంటుంది. దీని కోసం దేశ విదేశాలకు చెందిన నౌకలు పెద్ద ఎత్తున పాల్గొంటాయి. అలాగే ఎయిర్ క్రాఫ్టులు కూడా వస్తాయి. ఈసారి విశాఖలో జరిగే అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు ఇరాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు పందొమ్మిది దాకా ఇతర దేశాల నుంచి నౌకలతో పాటు దాదాపుగా నాలుగు వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు.

నౌకా దళ విన్యాసాలకు వేదిక :

విశేషమేంటి అంటే విశాఖలో జరిగే అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకి అమెరికా,జర్మనీ,ఫ్రాన్స్ దేశాలకు చెందిన మూడు నౌకలు అలావే వాటితో పాటు 150 మంది వరకూ ప్రతినిధులు హాజరవుతారు. ఇక విశాఖలో జరగనున్న నౌకా దళ విన్యాసాలకు భారత దేశం నుంచి 90 నౌకలు,45 ఎయిర్ క్రాప్ట్ లతో పాటు దాదాపుగా 600 మంది ప్రతినిధులు హాజరవుతారని అంటున్నారు. ఇలా ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ ద్వారా దేశీయ నౌకాదళంతో పాటు పొరుగు దేశాలకు చెందిన నౌకల సామర్థ్యాలను రాష్ట్రపతి సమీక్షిస్తారు.

మిలాన్ గురించి :

అదే విధంగా విశాఖలో మిలాన్ ని కూడా నిర్వహిస్తున్నారు. మిలాన్ అంటే వివిధ దేశాలకు చెందిన నౌకాదళాలు ఈ నావికా దళ ప్రదర్శనలో పాల్గొంటాయి. సముద్ర కార్యకలాపాల్లో పరస్పర సహకారం చాటి చెబుతూ తమ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ కార్యర్క్రమంలో హాజరవుతాయి. అలా అంతా కలుస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి మిలాన్‌ అన్న పేరు పెట్టారు. ఇక ఇదే సందర్భంలో ఆయా దేశాలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దీంతో ఈ మూడు రోజులూ విశాఖ వాసులకు కన్నుల పండుగగా ఉంటుంది అని చెప్పల్సి ఉంది. అలాగే పర్యాటకులకు ఇది అదనపు ఆనందంగా ఉంటుంది.