Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్.. విశాఖకు గూగుల్.. ఈ పోలిక కరెక్టేనా?

తాజాగా విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాక కూడా ఆ కోవకు చెందినదే. విశాఖకు గూగుల్ ను తీసుకొస్తున్న అంశంపై పెద్దగా అంచనాలు లేవు.

By:  Garuda Media   |   15 Oct 2025 5:23 PM IST
హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్.. విశాఖకు గూగుల్.. ఈ పోలిక కరెక్టేనా?
X

కొన్నిసార్లు అంతే. పెద్దగా హడావుడి లేకుండా జరిగే నిర్ణయాలు.. చరిత్రకు సరికొత్త అధ్యాయాలుగా మారుతుంటాయి. తాజాగా విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాక కూడా ఆ కోవకు చెందినదే. విశాఖకు గూగుల్ ను తీసుకొస్తున్న అంశంపై పెద్దగా అంచనాలు లేవు. కానీ.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆవిష్క్రతమైన సన్నివేశం.. అంతర్జాతీయంగా ఏపీ అందరి నోట్లో నానేలా చేసింది. ఎందుకంటే.. టెక్ సంస్థల భారీ పెట్టుబడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా ఫోకస్ చేసిన వేళ.. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ భారతదేశాన్ని తన ఏఐ డేటా హబ్ గా ఎంపిక చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ భారీ జాక్ పాట్ విశాఖపట్నం సొంతం చేసుకోవటం మరో విశేషంగా చెప్పాలి.

ఈ సందర్భాన చరిత్రను గుర్తు చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అప్పట్లో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకొచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. తాను అప్పట్లో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకురావటంతో ఐటీ రాక భాగ్యనగరికి మొదలైందని.. తాజాగా విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావటం అలాంటి పరిస్థితేనని చెప్పుకొచ్చారు. ఈ పోలిక నిజమేనా? ఎంతవరకు కరెక్టు? అన్న ప్రశ్నకు నూటికి రెండు వందల శాతం నిజమని చెప్పక తప్పదు.

గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ తన ఏఐ డేటా సెంటర్ కు విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవటం.. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందాలు.. అందుకు తగ్గట్లు కేంద్రంలోని మోడీ సర్కారు స్పందిస్తూ జీఎస్టీ రాయితీలు ప్రకటించటం చూస్తే.. ఏపీ రూపురేఖల మార్పునకు ఇదో కొత్త అధ్యాయమన్న మాట వినిపిస్తోంది. విశాఖలో ఏఐ డేటా హబ్ ఏర్పాటు కోసం గూగుల్.. ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన అవగాహన ఒప్పందం వేళ.. ఇప్పుడు అందరూ ఆంధ్రప్రదేశ్ గురించి.. విశాఖ పట్నం గురించి మాట్లాడుకోవటం షురూ చేశారు. దాదాపు లక్ష కోట్ల రూపాయిలకు పైనే పెట్టుబడులు.. లక్షన్నర మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఐదారు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ఒప్పందం విశాఖ తలరాతను మార్చేస్తుందని చెప్పక తప్పదు.

నిజమే.. కొన్ని దశాబ్దాల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకురావటంలో కీలకభూమిక పోషించిన ఆయన తీరుతో భాగ్యనగరి తీరుతెన్నులు మారిపోవటం తెలిసిందే. భారత ఐటీ హబ్ లలో హైదరాబాద్ మహానగరం ఒకటిగా మారటంలో మైక్రోసాఫ్ట్ ఆగమనం కీలక భూమిక పోషించిందని చెప్పాలి. తాజాగా మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనే విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చేందుకు ఒప్పందం కుదిరిన వైనం.. విశాఖకు కొత్త ఇమేజ్ ఖాయమని చెప్పాలి. ఈ రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం ఒక ఆసక్తికర పరిణామం అయితే.. తెలుగు నేల మీద రెండు మహానగరాలను టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దిన ఘనతను చంద్రబాబు సొంతం చేసుకోనున్నారని చెప్పక తప్పదు.