విశాఖలో చారిత్రక ఘట్టానికి కౌంట్ డౌన్ !
విశాఖ వేదికగా ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెర లేవనుంది. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కీలక ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు.
By: Satya P | 19 Sept 2026 8:51 AM ISTవిశాఖ వేదికగా ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెర లేవనుంది. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కీలక ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు. విశాఖలో సుదీర్ఘకాలంగా వేలాది మంది పెట్టుకున్న ఆశలను కు కలలను సాకారం చేసే అతి పెద్ద కార్యక్రమం జరగనుంది. ఏకంగా 28 వేల 445 కుటుంబాలకు ఇంటి హక్కుని కూటమి ప్రభుత్వం కల్పించనుంది. ఈ హక్కు విలువ 8 వేల 874 కోట్ల విలువగా చెబుతున్నారు. అంతటి విలువ చేసే భూమి వారి సొంతం కానుంది. సంపూర్ణ హక్కులతో కూడిన పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు రానున్నారు.
నాలుగు దశాబ్దాల నిరీక్షణ :
సొంతింటి కల అలాగే తాము ఉంటున్న భూములకు శాశ్వత హక్కులు కల్పించాలని కోరుతున్న ప్రజానీకం ఇలా నాలుగు దశాబ్దాలుగా ఉన్న అతి పెద్ద పెండింగ్ సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. దీంతో విశాఖలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల కల ఈ విధంగా సాకారం కానుంది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28 వేల 445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ చంద్రబాబు హక్కుదారు పట్టాలను పంపిణీ చేయనున్నారు. అలా మొత్తం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ 19 లక్షల 33 వేల 853 చదరపు గజాలను పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పించనున్నారని అంటున్నారు.
ఇదే మొదటిసారిగా :
విశాఖలో గజం జాగా అంటేనే ఎంత ఖరీదు అన్నది తెలిసిందే. అలాంటిది 9 లక్షల 33 వేల 853 చదరపు గజాలను పేదల కోసం ప్రభుత్వం హక్కు భుక్తం చేసి ఇవ్వడం అంటే వారి జీవితాల్లో కొత్త దశ వచ్చినట్లే అని అంటున్నారు. అంతే కాదు విశాఖ నగరం విస్తరించాక ఇంత పెద్ద ఎత్తున క్రమబద్ధీకరణ చేపట్టి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం కూడా ఇదే తొలిసారి అంటున్నారు. పేదలు మధ్యతరగతి వర్గాలు ఇల్లు నిర్మించుకుని దశాబ్దాలుగా అందులో నివసిస్తున్నా కూడా ఆ ఆ ఇంటి స్థలంపై వారికి ఈ రోజు దాకా పూర్తి హక్కు లేకపోవడం ఒక విషాదంగా ఉంది. ఇది ఒక్కరిది కాదు వేలాది కుటుంబాలను వేధిస్తోన్న దశాబ్దాల సమస్య. తమ పేరిట పట్టా లేకపోవడంతో ఆస్తిని పూర్తిస్థాయిలో అనుభవించలేని దుస్థితిలో వారు ఉన్నారు. ఇలా ఎవరికీ బదలాయించుకోలేక భవిష్యత్తుపై భరోసా లేక నానా అవస్థలు పడుతున్న వారి సమస్యలకు కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టింది.
బాబు ట్వీట్ వైరల్ :
ఇదిలా ఉంటే సామాన్య కుటుంబాలను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని బాబు ట్వీట్ చేశారు. గ్లోబల్ సంస్థలను విశాఖకు తీసుకురావడం, పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేద కుటుంబాలకు ఆస్తి హక్కు, భవిష్యత్తుపై భరోసా కల్పించడం ద్వారా అభివృద్ధి ఫలాలు సామాన్యుడి ఇంటి గడపకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన అన్నారు. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల అని పేర్కొంటూ అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు విశాఖ వస్తున్నా అంటూ బాబు పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధం అయింది.
